Minister V Senthil Balaji: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి సంచలన నిర్ణయం.. ఇటివల కాలంలో అరుదైన నిర్ణయం..
ABN, First Publish Date - 2023-06-29T20:54:49+05:30
తమిళనాడు (Tamil Nadu) గవర్నర్ ఆర్ఎన్ రవి (RN Ravi) ఇటివలి కాలంలో అరుదైన, అత్యంత వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను సంప్రదించకుండానే మంత్రి వీ సెంథిల్ బాలాజీని మంత్రి మండలి నుంచి తొలగించారు.
చెన్నై: తమిళనాడు (Tamil Nadu) గవర్నర్ ఆర్ఎన్ రవి (RN Ravi) ఇటివలి కాలంలో అరుదైన, అత్యంత వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను సంప్రదించకుండానే మంత్రి వీ సెంథిల్ బాలాజీని మంత్రి మండలి నుంచి తొలగించారు. ‘‘ ప్రస్తుతం జైలుజీవితం గడుపుతున్న మంత్రి సెంథిల్ బాలాజీ ఉద్యోగాల అమ్మకం స్కామ్, మనీల్యాండరింగ్ సహా పలు తీవ్రమైన నేరపూరిత కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి స్టాలిన్ సెంథిల్ బాలాజీకి ఎలాంటి పోర్ట్‌ఫోలియో కేటాయించకుండా మంత్రిగా కొనసాగిస్తున్నారు. ఈ పర్యవసనాల దృష్ట్యా సెంథిల్ బాలాజీని మంత్రి మండలి నుంచి తొలగిస్తున్నాం. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుంది’’ అంటూ తమిళనాడు గవర్నర్ కార్యాలయం ఉత్తర్వులు విడుదల చేసింది.
కాగా గవర్నర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేయాలని స్టాలిన్ ప్రభుత్వం యోచిస్తోందని డీఎంకే పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గవర్నర్ తన సొంత నిర్ణయంతో గవర్నర్‌ని తొలగించే హక్కులేదని, ఇది చాలా వివాదాస్పదమని స్టాలిన్ ప్రభుత్వవర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలావుండగా సెంథిల్ బాలాజీ జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ చెన్నైలోని ఓ కోర్ట్ బుధవారం నిర్ణయం వెలువరించింది. కాగా అవినీతి ఆరోపణలపై సెంథిల్ బాలాజీని ఈ నెలలో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
లేఖలో అసలేముందంటే...
‘‘ మంత్రిగా తన స్థాయిని వాడుకొని విచారణను ప్రభావితం చేస్తూ వస్తున్నారు. జరగాల్సిన చట్ట, న్యాయ పక్రియలకు ఆటంకం కలిగిస్తున్నారు. ప్రస్తుతం ఈడీ దర్యాప్తు జరుపుతున్న క్రిమినల్ కేసుల్లో జ్యుడీషియల్ కస్డడీలో ఉన్నారు. అవినీతి నిరోధక చట్టాలు, ఐపీసీ చట్టాల కింద నమోదైన క్రిమినల్ కేసులపై రాష్ట్ర పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. సెంథిల్ బాలాజీ మంత్రివర్గంలో ఇంకా కొనసాగితే చట్ట, న్యాయప్రక్రియలపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు పడే అవకాశం ఉంది. ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు నిర్వీర్యానికి దారితీయొచ్చు. ఈ పర్వవసనాలను దృష్టిలో ఉంచుకొని గౌరవనీయ గవర్నర్ సెంథిల్ బాలాజీని మంత్రిమండలి నుంచి తొలగించారు. తక్షణమే అమల్లోకి వస్తుంది’’ అని లేఖలో పేర్కొన్నారు.
Updated Date - 2023-06-29T21:38:00+05:30 IST