ఎట్టకేలకు దిగొచ్చిన గవర్నర్.. ఇక ఆన్‌లైన్ జూదం..
ABN, First Publish Date - 2023-04-11T10:09:57+05:30
ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు రోజుల పర్యటన ముగిసిన మరునాడే గవర్నర్ ఆర్‌ఎన్ రవి(Governor RN Ravi) దిగొచ్చారు. సీ
- బిల్లుకు ఆమోదం
చెన్నై, (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు రోజుల పర్యటన ముగిసిన మరునాడే గవర్నర్ ఆర్‌ఎన్ రవి(Governor RN Ravi) దిగొచ్చారు. సీఎంతో ప్రధాని సాన్నిహిత్యం గుర్తుకొచ్చిందో, లేక సోమవారం అసెంబ్లీలో తనకు వ్యతిరేకంగా చేసిన తీర్మానం పనిచేసిందో తెలియదు గానీ ఏడాదిగా నాన్చుతూ వస్తున్న ‘ఆన్‌లైన్ జూదం’ బిల్లుపై గవర్నర్ ఆమోదముద్ర వేశారు. బిల్లుల ఆమోదానికి గడువు విధించాలని, శాసనసభ రూపొందించిన బిల్లుల్ని ఆమోదించేలా గవర్నర్‌కు సూచించాలంటూ ఏకంగా కేంద్రప్రభుత్వానికి, రాష్ట్రపతికి విజ్ఞప్తి చేస్తూ అసెంబ్లీ తీర్మానించిన నాలుగు గంటల్లోనే గవర్నర్ ఆన్‌లైన్ జూదం నిషేధ బిల్లుపై సంతకం చేయడం గమనార్హం. ఇప్పటికైనా కళ్లు తెరిచిన గవర్నర్‌కు కృతజ్ఞతలంటూ కొన్ని పార్టీలు వ్యంగ్యబాణాలు సంధించగా, ఆలస్యంగానైనా ఆయన మంచి నిర్ణయం తీసుకున్నారంటూ మరికొన్ని పార్టీలు అభినందించాయి. మొత్తమ్మీద తన వద్ద పెండింగ్‌లో వున్న 14బిల్లుల్లో ఒకదానికి గవర్నర్‌కు ధన్యవాదాలంటూ ఇంకొన్ని పార్టీలు చురకలంటించాయి.
ఆన్‌లైన్ రమ్మీ వంటి జూదాలతో లక్షలాది డబ్బు నష్టపోయిన వారి బలవన్మరణాలు రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. దీంతో ఆన్‌లైన్ జూదానికి అడ్డుకట్ట వేస్తూ గత అన్నాడీఎంకే ప్రభుత్వం 2020 నవంబరులో ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. అనంతరం 2021 ఫిబ్రవరి 3వ తేదీన శాసనసభలో ఆన్‌లైన్ జూదాన్ని నిషేధిస్తూ తీర్మానం చేశారు. అది చట్టంగా రూపుదాల్చగా, అందులోని లోపాలను ఎత్తి చూపుతూ అదే ఏడాది ఆగస్టు 3న హైకోర్టు ఆ చట్టాన్ని కొట్టివేసింది. దాంతో ముఖ్యమంత్రి స్టాలిన్ ఆన్‌లైన్ రమ్మీ నిషేధానికి సంబంధించిన సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రు నేతృత్వంలోని కమిషన్‌ను ఏర్పాటు చేసి, కొత్త చట్టానికి సంబంధించిన ముసాయిదా తీర్మానాన్ని 2022 అక్టోబరు 19న అసెంబ్లీలో ఆమోదించారు. అనంతరం ఆ బిల్లును గవర్నర్‌కు పంపగా, ఆయన తన వద్ద పెండింగ్‌లో ఉంచుకున్నారు. రాష్ట్రప్రభుత్వం నుంచి పలు వినతులు వెళ్లడంతో, ఆ బిల్లులో లోపాలున్నాయంటూ వెనక్కి తిప్పి పంపారు. దాంతో స్టాలిన్(Stalin) ప్రభుత్వం.. గవర్నర్ అడిగిన సందేహాలకు సమాధానాలు ఇవ్వడంతో పాటు లోపాలను సరి చేసి పంపింది. దానిని కూడా పెండింగ్‌లో పెట్టిన గవర్నర్.. జనవరిలో ఆ బిల్లును తిరస్కరించారు. దాంతో స్టాలిన్ ప్రభుత్వం మార్చి 23న రెండోమారు ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించి మళ్లీ గవర్నర్‌కు పంపించింది. అసెంబ్లీ రెండోమారు తీర్మానించిన బిల్లును ఆమోదించడం మినహా గవర్నర్‌కు గత్యంతరం లేదని రాజ్యాంగం చెబుతోంది. అయినా వెనక్కి తగ్గని గవర్నర్ ఆ బిల్లును పెండింగ్‌లో పెట్టేశారు. అంతేగాక ఆ బిల్లును రెండోమారు పంపినప్పటి నుంచి స్టాలిన్ ప్రభుత్వంపై ఆయన మాటల దాడి పెంచారు. ప్రధాని రాష్ట్ర పర్యటనకు రావడానికి రెండు రోజుల ముందు ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై పరోక్ష, ప్రత్యక్ష విమర్శలు చేశారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘గవర్నర్ బిల్లుకు ఆమోదం తెలపకుండా నిలిపేశారంటే, అది నిరాకరించినట్లు అర్థం’ అంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఆయన ఉద్దేశం ఏంటో గ్రహించిన స్టాలిన్ ప్రభుత్వం.. మాటల ఎదురుదాడిని పెంచింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని.. ముఖ్యమంత్రిని ప్రత్యేకంగా అభినందించడం, ఆయనతో సన్నిహితంగా ఉండడంతో పాటు గవర్నర్‌తో అంటీముట్టనట్లుగా వ్యవహరించారు. వీటన్నింటి నేపథ్యంలో గవర్నర్ రవి ఆన్‌లైన్ జూద నిషేధ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చట్టం అమలులోకి వస్తే ఆన్‌లైన్ రమ్మీ ఆడేవారికి 3 నెలల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధించబడుతుంది.
సంతోషం: ప్రతిపక్షాలు
ఇప్పటికైనా గవర్నర్ ఆన్‌లైన్ జూద బిల్లును ఆమోదించారంటూ పలు పార్టీలు హర్షం వ్యక్తం చేశాయి. అన్నాడీఎంకే, పీఎంకే, డీఎండీకే నేతలు ఈ మేరకు ప్రకటనలు విడుదల చేశారు. శాసనసభలో రెండు సార్లు చేసిన బిల్లును గవర్నర్ ఆమోదించారని, ఈ బిల్లు ముందే ఆమోదించి ఉంటే కొన్ని ప్రాణాలైనా కాపాడేవాళ్లమని ఆయా నేతలు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఆన్‌లైన్ జూదంపై నిషేధం విధించాలని పలు దీర్ఘకాలంగా డిమాండ్ వుందని, ప్రస్తుతం బిల్లు ఆమోదం పొందడం ప్రజా విజయమని పేర్కొన్నారు. ఆన్‌లైన్ జూదం నిషేధ బిల్లును రాష్ట్రప్రభుత్వం తక్షణం గెజిట్‌లో వెలువరించాలని కోరారు. న్యాయస్థానాల్లో ఈ బిల్లుకు వ్యతిరేకంగా కేసులు దాఖలయ్యే అవకాశమున్నందున, న్యాయనిపుణులను సంప్రదించి అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈరోజే గెజిట్ ప్రచురిస్తాం: సీఎం
ఆన్‌లైన్ జూదం నిషేధ బిల్లును గవర్నర్ ఆమోదించడంపై ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందించారు. సోమవారం సాయంత్రం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఈ బిల్లు యువత భవిష్యత్తుతో ముడివడి వుందని, అందుకే ఆ బిల్లు పెండింగ్‌లో వుండడం పట్ల తాము ఆందోళన చెందామని వ్యాఖ్యానించారు. ఎట్టకేలకు గవర్నర్ ఆ బిల్లుకు ఆమోదం తెలిపారంటూ ఎమ్మెల్యేల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. అంతేగాక ఈ రోజే ఈ చట్టం తమిళనాడు ప్రభుత్వ గెజిట్‌లో ప్రచురించబడుతుందని ప్రకటించారు. దాంతో ఈ చట్టం తక్షణం అమలులోకి వచ్చినట్లయింది.
Updated Date - 2023-04-11T10:09:57+05:30 IST