Mahua Moitra: అసలు మహువా మోయిత్రా ఎవరు? ఆమె చరిత్ర ఏంటి? ఈ ‘ప్రశ్నకు డబ్బు’ కేసు ఏంటి?
ABN, First Publish Date - 2023-10-20T20:46:19+05:30
ఉత్తర భారతంలో ఇప్పుడు రెండే రెండు అంశాలు బాగా హైలైట్ అవుతున్నాయి. ఒకటి.. ఎన్నికలు, రెండోది.. మహువా మోయిత్రాకు సంబంధించిన ‘ప్రశ్నకు డబ్బు’ కేసు. మరీ ముఖ్యంగా.. మహువా మోయిత్రా వ్యవహారం...
ఉత్తర భారతంలో ఇప్పుడు రెండే రెండు అంశాలు బాగా హైలైట్ అవుతున్నాయి. ఒకటి.. ఎన్నికలు, రెండోది.. మహువా మోయిత్రాకు సంబంధించిన ‘ప్రశ్నకు డబ్బు’ కేసు. మరీ ముఖ్యంగా.. మహువా మోయిత్రా వ్యవహారం మరింత సంచలనం అవుతోంది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అయిన మహువాకు డైనమిక్ లీడర్‌గా పేరుంది. లోక్‌సభలో తనదైన ప్రశ్నలు అడిగి, ప్రభుత్వాన్ని ఇరుకున పడేయడంలో ఈమె దిట్ట. నైపుణ్యం కలిగిన మహిళగా, అద్భుతమైన నాయకురాలిగా ఈమె పేరొందారు. సభలో ఆమె చేసే ప్రసంగాలు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. అలాంటి మహువా మోయిత్రా ఇప్పుడు ‘ప్రశ్నకు డబ్బు’ కేసులో ఇరుకున్నారు.
అదానీ గ్రూపు, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగినందుకు గాను.. మోయిత్రా భారీ మొత్తంలో నగదు తీసుకున్నారని మోయిత్రాపై ఆరోపణలు ఉన్నాయి. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఈ ఆరోపణ చేశారు. ఈ విషయమై లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు లేఖ రాసిన ఆయన, దీనిపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలకు బలం చేకూరిస్తూ.. వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ కూడా పార్లమెంట్ ఎథిక్స్ కమిటీకి లేఖ రాశారు. అదానీ, మోదీ ఒకే రాష్ట్రానికి చెందిన వాళ్లు కావడంతో మోదీని టార్గెట్ చేయడమే లక్ష్యంగా మోయిత్రా పెట్టుకుందని.. ఖరీదైన బహుమతులూ డిమాండ్ చేసిందని ఆ లేఖలో పేర్కొన్నారు. దీంతో.. ఈ వ్యవహారం ఇప్పుడు దేశ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది.
అసలు మహువా మోయిత్రా ఎవరు?
మహువా మోయిత్రా 1974లో అస్సాంలోని కాచర్ జిల్లాలో జన్మించారు. కోల్‌కతాలో ప్రాథమిక విద్యను అభ్యసించిన తరువాత ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లారు. 1998లో మసాచుసెట్స్‌లోని మౌంట్ హోలియోక్ కాలేజ్ సౌత్ హ్యాడ్లీ నుండి ఎకనామిక్స్ & మ్యాథ్స్‌లో పట్టభద్రులయ్యారు. చదువు పూర్తయ్యాక ప్రతిష్టాత్మక బ్యాంకింగ్ కంపెనీ JP మోర్గాన్ చేజ్‌లో పని చేశారు. న్యూయార్క్, లండన్‌లలో పని చేసిన ఆమె.. రూ.1 కోటి జీతం అందుకునే స్థాయికి ఎదిగారు. ఇది JP మోర్గాన్‌లో పనిచేస్తున్న ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ సగటు జీతం 1.21 లక్షల డాలర్ల కంటే ఎక్కువ.
అయితే.. ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో మోయిత్రా భారత్‌కు తిరిగొచ్చారు. 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత 2010లో కాంగ్రెస్‌ని వీడి, టీఎంసీలో చేరారు. అప్పటి నుంచి ఆమె రాజకీయ కెరీర్ గ్రాఫ్ వేగంగా పెరుగుతూ వచ్చింది. 2016లో టీఎంసీ పార్టీ ఆమెకు నదియా జిల్లాలోని కరీంపూర్ అసెంబ్లీ స్థానం నుండి టిక్కెట్ ఇచ్చింది. 2019 లోక్‌సభ ఎన్నికలకు పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్ స్థానం నుండి టిక్కెట్ ఇవ్వగా.. అక్కడ కూడా గెలిచారు. ఆ విధంగా మోయిత్రా తొలిసారిగా లోక్‌సభకు చేరుకుని, డైనమిక్ లీడర్‌గా ఎదిగారు.
మోయిత్రా వ్యక్తిగత జీవితం
మొయిత్రా వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. ఈమె డానిష్ ఫైనాన్షియర్ లార్స్ బ్రోసెన్‌ను వివాహం చేసుకున్నారు. అయితే.. ఈ వివాహం ఎక్కువ కాలం కొనసాగలేదు. ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె ఢిల్లీలో ఒంటరిగా నివసిస్తున్నారు. అయితే.. ఇప్పుడు ప్రశ్నకు డబ్బు వ్యవహారంలో మోయిత్రా మాజీ భాగస్వామి జై అనంత్ దెహద్రాయ్ పేరు చర్చల్లోకి వచ్చింది. ప్రస్తుతం అతను సుప్రీంకోర్టులో న్యాయవాదిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ప్రశ్నకు డబ్బు కేసుపై మోయిత్రా రియాక్షన్ ఏంటి?
ప్రశ్నకు డబ్బు కేసులో తనపై బీజేపీ ఎంపీ నిషికాంత్ చేసిన ఆరోపణల్ని ఖండించడంతో పాటు హిరానందానీ సమర్పించిన అఫిడవిట్ విశ్వసనీయతను మోయిత్రా ప్రశ్నించారు. ఆ అఫిడవిట్ ఎందుకు అధికారిక లెటర్ హెడ్ రూపంలో లేదని, దాన్ని హిరానందానీ సామాజిక మాధ్యమాల్లో ఎందుకు పోస్ట్ చేయలేదని నిలదీశారు. ప్రధాని కార్యాలయం హిరానందానీపై ఒత్తిడి తీసుకొచ్చి, తెల్లకాగితంపై సంతకం చేయించిందని ఆరోపించారు. అదానీని ప్రశ్నించే ధైర్యం ఉన్న ప్రతి నేతను అణిచివేసేందుకు బీజేపీ తనపై ఈ కుట్ర పన్నిందని మోయిత్రా తిప్పికొట్టారు.
Updated Date - 2023-10-20T20:48:41+05:30 IST