Siddaramaiah : కర్ణాటకలో దూసుకెళ్తున్న కాంగ్రెస్.. సిద్ధరామయ్య ఇంట విషాదం..
ABN, First Publish Date - 2023-05-13T12:26:03+05:30
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ తిరుగలేని విధంగా విజయం సాధించనుందని తాజా ఫలితాలు చెబుతున్నాయి. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఇంట విషాదం చోటు చేసుకుంది.
బెంగుళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ తిరుగలేని విజయం దిశగా దూసుకుపోతోంది. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ రాష్ట్ర జీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఇంట విషాదం చోటు చేసుకుంది. సిద్ధ రామయ్య సోదరి శివమ్మ భర్త రామేగౌడ కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. ఎన్నికల ఫలితాలను ఎంతో హుషారుగా సందడిచేయాల్సిన తరుణంలో ఇంట విషాదంతో సిద్ధరామయ్య సంతోషమంతా ఆవిరై పోయింది. ఇవాళ ఉదయం ఆయన అస్వస్థతకు గురవ్వగా హుటాహుటిన మైసూరు ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు కుటుంబీకులు. ఆరోగ్యం మెరుగుపడి క్షేమంగా బయటికొస్తారని కుటుంబ సభ్యులు భావించారు కానీ ఇలా జరగడంతో సిద్ధరామయ్య అభిమానులు ఆవేదన చెందుతున్నారు.
నిజానికి కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయం కావడంతో సిద్ధరామయ్య చాలా హుషారుగా ఉన్నారు. ఇటీవల ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. కర్ణాటకలో ఈసారి కాంగ్రెస్ ప్రభంజనం సృష్టిస్తుందన్నారు. 130 సీట్లకు పైగా సీట్లతో కాంగ్రెస్ ఘనవిజయం సాధించడం ఖాయమన్నారు. ఈ విజయం జాతీయ స్థాయిలోనూ పార్టీ పుంజుకోవడానికి దోహదం చేస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కర్ణాటకలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సభల తర్వాత.. జనం పెద్ద ఎత్తున మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య సభలకే హాజరయ్యారు. 1978లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన సిద్దరామయ్య.. కర్ణాటకలో వెనుకబడిన కురుబ గౌడ వర్గానికి చెందిన ప్రజా నాయకుడు. నాలుగున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న సిద్దరామయ్య 8 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కర్ణాటకలో ఈ నెల 10న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే సిద్దరామయ్యనే సీఎం కావచ్చు. ఇంతటి హ్యాపీ మూమెంట్‌లో విషాదం చోటు చేసుకోవడం గమనార్హం.
Updated Date - 2023-05-13T12:37:48+05:30 IST