Train Accident: ఇంతటి ఘోర ప్రమాదంలోనూ ఒక అద్భుతం జరిగింది.. ఎవరూ ఊహించని విధంగా....
ABN, First Publish Date - 2023-06-03T16:25:36+05:30
పశ్చిమ బెంగాల్‌లోని పుర్బా మేదినీపూర్‌కు చెందిన సుబ్రొతో పాల్, దేబోశ్రీ పాల్, వారి కుమారుడు ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. కుమారుడిని డాక్టర్‌కు చూపించేందుకు కరగ్‌పూర్ నుంచి చెన్నైకి తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగిందని వివరించారు.
బాలాసోర్: ఒడిషా ఘోర రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 278కు పెరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 900 మంది గాయపడినట్లు రైల్వే అధికారులు తెలిపారు. బహనాగా బజార్ స్టేషన్‌లో మూడు వేర్వేరు ట్రాక్‌లపై బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు మూడు వైపులా ప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రమాదంలో మృతుల డెడ్ బాడీలకోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తుండగా.. మరోవైపు ఆస్పత్రుల్లో క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాద ఘటన నుంచి అదృష్టవశాత్తు సురక్షితంగా బయటపడి ఇంటికి చేరుకున్న ప్రయాణికులు ప్రమాద ఘటనను గుర్తు చేసుకుంటూ బతుకు జీవుడా అంటూ బయట పడ్డామని ఊపిరి పీల్చుకుంటున్నారు.
ఈ ఘోర రైలు ప్రమాదం నుంచి బయటపడిన పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ కుటుంబం ఘటనకు సంబంధించి వివరాలు తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లోని పుర్బా మేదినీపూర్‌కు చెందిన సుబ్రొతో పాల్, దేబోశ్రీ పాల్, వారి కుమారుడు ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. కుమారుడిని డాక్టర్‌కు చూపించేందుకు కరగ్‌పూర్ నుంచి చెన్నైకి తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగిందని వివరించారు. దేవుడి దయ వల్ల ప్రమాదం నుంచి తప్పించుకున్నామని అన్నారు. ఇది మాకు రెండో జన్మ అంటూ భావద్వేగానికి లోనయ్యారు.
"మేము ఖరగ్‌పూర్ స్టేషన్ నుంచి చెన్నైకి బయలుదేరాం. బాలాసోర్ స్టేషన్ తర్వాత రైలులో ఒక కుదుపు వచ్చింది. ఇంతలోనే పొగతో కంపార్ట్‌మెంట్ నిండిపోయింది. ఎవ్వరూ కనిపించడంలేదు. స్థానికుల వచ్చి నన్ను బయటికి తీశారు. ఇది నాకు పునర్జన్మ అని సుబ్రోతో పాల్ భావోద్వేగంతో తెలిపారు.
" ప్రమాదం సమయంలో రైలు ఒక్కసారిగా కుదుపుకు గురైంది. ఏం జరిగిందో మాకు అర్థం కాలేదు. బోగీలోని వారంతా ఒకరిపై ఒకరు పడి పోయారు. మా బాబు కనిపించలేదు. మేం ఎలా రక్షించబడ్డామో గుర్తులేదు. ఇది మాకు రెండో జన్మ.. ఈ ఘటన నాకు జీవితాంతం గుర్తిండిపోతుంది అని ప్రమాదం నుంచి బయటపడిన దేబోశ్రీ పాల్ తెలిపారు.
కాగా ప్రమాద ఘటనపై భువనేశ్వర్‌లోని ఒడిశా స్పెషల్ రిలీఫ్ కమిషనర్ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. బహనాగా బజార్ స్టేషన్ వద్ద సాయంత్రం 7 గంటలకు ప్రమాదం జరిగింది. ఈ రెండు రైళ్లలోని 17 కోచ్‌లు పట్టాలు తప్పి తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు.
Updated Date - 2023-06-03T16:25:36+05:30 IST