Twitter down: ప్రపంచవ్యాప్తంగా కొద్దిసేపు నిలిచిపోయిన ట్విటర్ సేవలు
ABN, First Publish Date - 2023-03-01T17:23:32+05:30
ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా వెబ్సైట్ ట్విటర్ (Twitter) సేవలు కొద్ది సేపటి క్రితం ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయాయి
న్యూఢిల్లీ: ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా వెబ్సైట్ ట్విటర్ (Twitter) సేవలు కొద్ది సేపటి క్రితం ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయాయి(Twitter down). ట్విట్టర్లో మరోసారి ఎర్రర్ మెజేజ్ కనిపించింది. వేలాది మంది యూజర్లకు పేజీలు లోడ్ కాలేదు. ఇటీవలి కాలంలో ట్విటర్ అనేక సార్లు మొరాయించింది. ఎలాన్ మస్క్ (Twitter CEO Elon Musk) ట్విటర్ చేజిక్కించుకున్నాక ఇబ్బందులు ఎదురౌతున్నాయి. సాంకేతిక కారణాలతో ట్విటర్ అనేకసార్లు ఆగిపోయింది. ట్విటర్ డౌన్ అయిందంటూ ఇతర సోషల్ మీడియా మాధ్యమాల్లో యూజర్లు పోస్టులు పెడుతున్నారు.అమెరికా, బ్రిటన్, జపాన్, భారత్ సహా అనేక దేశాల్లో ట్విటర్ యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మరోవైపు మస్క్ రెండు వందల మంది ఉద్యోగులను తొలగించారని అందుకే అకస్మాత్తుగా ఇలా జరిగిందని జాతీయ వార్తా సంస్థలు కథనాలు ప్రచురించాయి.
మైక్రోబ్లాగింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విటర్‌ను (Twitter) హస్తగతం చేసుకున్నాక ఉద్యోగుల తొలగింపుపై దృష్టిపెట్టిన టెస్లా (Tesla) అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) తాజాగా మరో కీలక చర్యకు నడుం బిగించారు. వ్యయాల తగ్గింపే లక్ష్యంగా కార్యాలయాల మూసివేతకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా భారత్‌లోని మూడు ట్విటర్ కార్యాలయాల్లో రెండింటిని మూసివేస్తూ ట్విటర్ నిర్ణయం తీసుకున్నట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఢిల్లీ, ముంబైల్లోని ఆఫీస్‌లు మూసివేయాలని నిర్ణయించగా.. బెంగళూరులోని కార్యాలయాన్ని మాత్రం యథావిథిగా కొనసాగించనుందని తెలుస్తోంది. ఎక్కువ మంది ఇంజనీర్లు ఇక్కడ నుంచి పనిచేస్తున్నారు. కాగా ఢిల్లీ, ముంబైల్లోని ఆఫీస్‌లు కేంద్రంగా ఇంతకాలం పనిచేసిన ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ కొనసాగించాలని ట్విటర్ కోరిందని సమాచారం.
కాగా ట్విటర్‌ను లాభాల బాటలోకి నడిపించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ గతేడాది 2022 నుంచి పెద్ద ఎత్తున ఉద్యోగుల ఏరివేత ప్రకటించారు. అందులో భాగంగా భారత్‌లో పనిచేసే ఉద్యోగుల్లో 90 శాతం మందిని తొలగించినట్టు పలు రిపోర్టులు ఇదివరకే పేర్కొన్నాయి.
కాగా ట్విటర్ కార్యాలయాల మూసివేత ఒక్క భారత్‌లోనే కాదని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల ఆఫీస్‌లను ట్విటర్ మూసివేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు భారత్‌లో కూడా ఆఫీస్‌లను మూసివేసింది. ట్విటర్‌ను ఆర్థికంగా స్థిరీకరించేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నిస్తున్నారు. కంపెనీ కార్యకలాపాలు సవ్యంగా కొనసాగాలంటే ఆర్థికంగా బలోపేతమవ్వడం చాలా ముఖ్యమని ఆయన భావిస్తున్నారు. అందుకే తొలుత ఉద్యోగుల తొలగింపు మొదలుపెట్టారు. ఆ తర్వాత ఇప్పుడు కార్యాలయాల మూసివేతకు శ్రీకారం చుట్టారు.
Updated Date - 2023-03-01T17:47:43+05:30 IST