Uddhav Thackeray: మనసులో మాట బయటపెట్టిన ఉద్ధవ్
ABN, First Publish Date - 2023-03-08T18:37:58+05:30
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన ఉద్ధవ్ వర్గం అధినేత ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) ప్రధాని పదవిపై తన మనసులోని మాట బయటపెట్టారు.
ముంబై: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (Shiv Sena) ఉద్ధవ్ వర్గం అధినేత ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) ప్రధాని పదవిపై తన మనసులోని మాట బయటపెట్టారు. తాను ప్రధాని కావాలని కలలు కనడం లేదని అయితే 2024 ఎన్నికల్లో (2024 Lok Sabha Elections) దేశంలో తప్పకుండా మార్పు తీసుకొచ్చేందుకు యత్నిస్తామని చెప్పారు. ముంబై విధానసభలో మహావికాస్ అఘాడీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ ఏడాది బడ్జెట్ సమావేశాల వేళ తొలిసారిగా ఆయన విధానసభకు వచ్చారు. కుమారుడు ఆదిత్య థాకరే కూడా ఉద్ధవ్ వెంట వచ్చారు. ఫిబ్రవరి 27న ప్రారంభమైన మహారాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చ్ 26 వరకూ కొనసాగనున్నాయి. ఈనెల 9న బడ్జెట్ ప్రవేశపెడతారు.
విధానసభ వద్ద విలేకరులతో మాట్లాడిన ఉద్ధవ్ ఇటీవలి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి రవీంద్ర హేమ్‌రాజ్ బీజేపీ కంచుకోట కస్బా నుంచి గెలుపొందడంపై ఉద్ధవ్ హర్షం వ్యక్తం చేశారు. మహావికాస్ అఘాడీ దెబ్బకు బీజేపీ పరాజయం పాలైందని ఉద్ధవ్ చెప్పారు. తమను ఎవ్వరూ ఓడించలేరని బీజేపీ అనుకుంటోందని అయితే ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని ఆయన జోస్యం చెప్పారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆయన శిండే శివసేన- బీజేపీ సంకీర్ణ సర్కారును కోరారు.
మహారాష్ట్రలో ఇటీవల జరిగిన పరిణామాలు ఉద్ధవ్‌లో కలవరం పెంచాయి. మహారాష్ట్ర (Maharashtra) ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) వర్గాన్ని నిజమైన శివసేన(Shiv Sena)గా గుర్తించి 'విల్లు-బాణం' గుర్తును కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ (Election Commission of India) నిర్ణయం తీసుకోవడంపై ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) మరోసారి స్పందించారు. తమ పార్టీ గుర్తును శిండే వర్గం లాక్కుందన్నారు. తన గుర్తును దొంగతనం చేశారని ఆరోపించారు. ఎన్నికల సంఘం కేంద్రానికి బానిసలా వ్యవహరిస్తోందని చెప్పారు. తనకు ఇచ్చిన కాగడా గుర్తుతోనే ఎన్నికల్లో పోటీచేస్తానని రత్నగిరిలో జరిగిన సభలో ప్రసంగిస్తూ చెప్పారు. రానున్న 2024 ఎన్నికల్లో బీజేపీ-శిండే వర్గానికి ఓట్లు వేయరాదని ఉద్ధవ్ సూచించారు. 2024లో బీజేపీ-శిండే వర్గాన్ని చిత్తుగా ఓడించాలన్నారు. తన తండ్రి అయిన బాల్ థాకరే పేరు వాడుకోకుండా మోదీ పేరుతో ఎన్నికల్లోకి వెళ్లాలని ఉద్ధవ్ సవాలు విసిరారు.
2019లో మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో (Maharashtra Assembly Elections 2019) శివసేన బీజేపీ పొత్తులో సీట్లు పంచుకుని అధికారం చేపట్టేందుకు కావాల్సిన స్థానాలు సంపాదించారు. బీజేపీకి ఎక్కువ స్థానాలు రావడంతో బాల్ థాకరే సమయంలోనే కుదిరిన పాత ఫార్ములా ప్రకారం ఎవరికి ఎక్కువ స్థానాలు వస్తే వారికే ముఖ్యమంత్రి పీఠమనే విషయానికి ఉద్ధవ్ తిలోదకాలిచ్చారు. కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి మహావికాస్ అఘాడి ఏర్పాటు చేసుకుని రెండున్నరేళ్లు మహారాష్ట్ర సీఎంగా కొనసాగారు. అయితే హిందుత్వ సిద్ధాంతాలపై ఉద్ధవ్ రాజీ పడటంతో ఆయన భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. సీఎం పదవి కోల్పోవడంతో పాటు మెజార్టీ శివసేన ఎంపీలు, ఎమ్మెల్యేలు శివసేన ఎమ్మెల్యే షిండే జట్టులో చేరిపోయారు. ఉద్ధవ్ ఒంటరివారైపోయారు.
కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి బీజేపీని తీసుకురావాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా కమలనాథులు యత్నిస్తుండగా ప్రతిపక్షాల్లో ప్రధాని అభ్యర్థి ఎవరనేది ఇంకా తేలలేదు. 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థి ఎవరనేది తేలడం కూడా సంశయమేనని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, బీహార్ సీఎం నితీశ్ సహా పలువురు నేతలు ప్రధాని పదవిపై కన్నేశారు. అయితే కాంగ్రెస్‌తో కలిసి వెళ్లాలని కొందరు, కాంగ్రెస్‌తో వద్దే వద్దని మరికొందరు నేతలు పట్టుబడుతున్నారు. దీంతో మోదీకి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ ఫ్రంట్ కనపడటం లేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఈ తరుణంలో ఉద్ధవ్ థాకరే ప్రధాని పదవిపై తన మనసులోని మాటను బయటపెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తాను ప్రధాని రేసులో లేనంటూనే 2024 ఎన్నికల్లో సత్తాచాటుతామని ఉద్ధవ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
Updated Date - 2023-03-08T18:38:02+05:30 IST