Udhayanidhi Stalin: నేను మళ్లీ మళ్లీ అదే రిపీట్ చేస్తాను.. మరో బాంబ్ పేల్చిన ఉదయనిధి స్టాలిన్
ABN, First Publish Date - 2023-09-04T22:38:02+05:30
తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు, మంత్రి, నటుడు ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో అందరికీ తెలుసు. సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా లాంటివని..
తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు, మంత్రి, నటుడు ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో అందరికీ తెలుసు. సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా లాంటివని.. దీనిని పూర్తిగా నిర్మూలించాలని ఆయన కుండబద్దలు కొట్టడంతో.. దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఎదురైంది. ముఖ్యంగా.. ఈ నేపథ్యంలోనే ఉదయనిధి మరోసారి మీడియా ముందుకొచ్చి.. తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తాను కేవలం కుల భేదాలను మాత్రమే ఖండించానని స్పష్టం చేసిన ఆయన.. తాను మళ్లీ మళ్లీ అదే చేస్తానని బాంబ్ పేల్చారు.
‘‘ఒక కార్యక్రమంలో నేను సనాతన ధర్మం గురించి మాట్లాడాను. నేను ఏదైతే మాట్లాడానో.. మళ్లీ మళ్లీ అదే రిపీట్ చేస్తాను. నేను కేవలం ఒక్క హిందూ మతం మీదే వ్యాఖ్యలు చేయలేదు. అన్ని మతాలను ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు చేస్తున్నానను. నేను కుల భేదాల్ని మాత్రమే ఖండిస్తూ మాట్లాడాను. అంతే’’ అంటూ ఉదయనిధి చెప్పుకొచ్చారు. అంతేకాదు.. తనపై ఎలాంటి కేసులు పెట్టినా ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నానని తేల్చి చెప్పారు. ఇండియా కూటమిని చూసి బీజేపీ వెన్నులో వణుకు పుడుతోందని.. ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి బీజేపీ అనవసర రాద్ధాంతం సృష్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ నాయకులు తనని ‘ఉదయనిధి హిట్లర్’గా అభివర్ణించడంతో పాటు ఇండియా కూటమిని హిందూ వ్యతిరేకి అని నిందిస్తున్న నేపథ్యంలో.. ఉదయనిధి స్టాలిన్ పై విధంగా ఘాటుగా స్పందించారు. ఇంతకుముందు కూడా తన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పుడు.. తన మాటల్ని కేవలం కుల శ్రేణి నేపథ్యంలో చూడాలని నొక్కి వక్కాణించారు. తాను ఒక్క మతం (హిందూ) గురించి ప్రస్తావించలేదని.. అన్ని మతాల్ని ఉద్దేశించే సనాతన ధర్మంపై వ్యాఖ్యలు చేశానన్నారు. కానీ.. ప్రతిపక్షాల్లో పెరుగుతున్న ఐక్యత భయంతో బీజేపీ తన వ్యాఖ్యల్ని వక్రీకరించిందని ఆరోపించారు. తప్పుడు ప్రచారం చేస్తూ.. రాజకీయ ప్రయోగం పొందాలని బీజేపీ సాయశక్తులా ప్రయత్నిస్తోందని ఉదయనిధి ధ్వజమెత్తారు.
మరోవైపు.. బీజేపీ ఈ అంశాన్ని సాధ్యమైనంతవరకు తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. స్టాలిన్ వ్యాఖ్యల్ని ఖండిస్తూ.. ఇండియా కూటమిపై ఈ వ్యవహారాన్ని రుద్దేందుకు ట్రై చేస్తోంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, నితీశ్ కుమార్‌లతో పాటు ఇతర ప్రధాన నాయకులు దీనిపై స్పందించాలని బీజేపీ నాయకులు ఒత్తిడి చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో హిందూ వ్యతిరేక వ్యూహాన్ని ఇండియా కూటమి అనుసరిస్తోందా? అనే సరికొత్త నినాదాన్ని ఎత్తుకుంది. అటు.. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలతో ఇండియా కూటమికి సంబంధం లేదని తృణమూల్ కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఇండియా కూటమిలోని చాలామంది ప్రధాన నాయకులు సైతం.. ఉదయనిధి వ్యాఖ్యల్ని ఖండించారు.
Updated Date - 2023-09-04T22:38:02+05:30 IST