Aadhar Card: ఆధార్ కార్డ్ అప్డేట్ చేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త.. ఈ పని చేయొద్దని UIDAI వార్నింగ్
ABN, First Publish Date - 2023-08-18T21:13:02+05:30
పదేళ్లు దాటిన తరుణంలో ఆధార్ కార్డుని అప్డేట్ చేసుకోవాలని యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) వెల్లడించిన విషయం అందరికీ తెలిసిందే. కొన్ని రోజుల క్రితం..
ఈరోజుల్లో సైబర్ నేరగాళ్లు ఎలా రెచ్చిపోతున్నారో అందరూ గమనిస్తూనే ఉన్నారు. ట్రెండింగ్ టాపిక్స్‌ని తమకు అనుకూలంగా మార్చుకొని, సునాయాసంగా ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఉదాహరణకు.. ప్రభుత్వం ఏదైనా పథకం ప్రకటిస్తే, వెంటనే దాన్ని ఎన్‌క్యాష్ చేసుకుంటున్నారు. ఫలానా పత్రాలు షేర్ చేస్తే.. ప్రభుత్వం నుంచి నేరుగా మీ అకౌంట్‌లోకి డబ్బులొచ్చి పడతాయంటూ బురిడీ కొట్టించేస్తున్నారు. ఇప్పుడు ఆధార్ కార్డ్‌ని అప్డేట్ చేసుకునే ప్రాసెస్ కొనసాగుతున్న నేపథ్యంలో.. దీన్ని కూడా సైబర్ మోసగాళ్లు విడిచిపెట్టట్లేదు.
పదేళ్లు దాటిన తరుణంలో ఆధార్ కార్డుని అప్డేట్ చేసుకోవాలని యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) వెల్లడించిన విషయం అందరికీ తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ఈ అప్డేట్ ప్రకటన రావడంతో.. ప్రజలు తమ ఆధార్ కార్డులని అప్డేట్ చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. చాలామంది నేరుగా ఆధార్ సెంటర్లకు వెళ్తుండగా.. కొందరు మాత్రం ఆన్‌లైన్ ప్రాసెస్ కోసం లింకులు వెతుకుతున్నారు. ఇదే అదునుగా భావించి.. సైబర్ నేరగాళ్లు తమ పంజా విసురుతున్నారు. మాల్వేర్‌కు సంబంధించిన లింకులు షేర్ చేస్తూ.. ఈ లింక్ క్లిక్ చేసి, ఆధార్‌ని అప్డేట్ చేసుకోవచ్చంటూ తమ అస్త్రాల్ని సంధిస్తున్నారు. ఒకవేళ తొందరపడి ఆ లింక్స్‌ని క్లిక్ చేస్తే.. స్వయంగా మీరే మీ మొబైల్ ఫోన్‌లో ఉన్న విలువైన సమాచారంతో పాటు బ్యాంక్ ఖాతా వివరాల్ని సైబర్ నేరుగాళ్ల చేతిలో పెట్టినట్లు అవుతుంది.
ఈ సైబర్ మోసాన్ని గమనించిన UIDAI అధికార యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది. ఆధార్ కార్డ్ హోల్డర్లకు ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. ఈ-మెయిల్, వాట్సాప్ ద్వారా ఆధార్ కార్డును అప్‌డేట్ చేసేందుకు తమ పత్రాలను షేర్ చేయొద్దని హెచ్చరించింది. ‘‘ఆధార్ కార్డ్ అప్డేట్ కోసం మీ గుర్తింపు లేదా అడ్రస్ ఫ్రూఫ్‌లను ఈ-మెయిల్ లేదా వాట్సాప్ ద్వారా షేర్ చేయమని UIDAI ఎప్పుడూ అడగదు. కేవలం #myAadhaarPortal ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో మీ ఆధార్‌ను అప్డేట్ చేయండి. లేకపోతే దగ్గరలోనే ఉన్న ఆధార్ కేంద్రాలకు వెళ్లి అప్డేట్ చేసుకోండి’’ అని సూచించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ రుజువు పత్రాల్ని పంచుకోవద్దని పేర్కొంది. ఒకవేళ ఏమైనా మెసేజ్‌లు వస్తే.. అవి మోసపూరితమైనవి అయ్యుండొచ్చని, వాటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.
ఇతర ఐడీ కార్డుల విషయంలో ఎలాగైతే శ్రద్ధ వహిస్తారో.. ఆధార్ కార్డ్ విషయంలోనూ అంతే శ్రద్ధగా ఉండాలని UIDAI సూచించింది. ఐడెంటిటీ ప్రూఫ్ కోసం, ఇతర ఆర్థిక లావాదేవీల విషయంలో ఆధార్ కార్డుని నిర్భయంగా వినియోగించుకోవచ్చని తెలిపింది. కానీ.. ట్విటర్, ఫేస్‌బుక్ వంటి పబ్లిక్ ప్లా్‌ట్‌ఫార్మ్‌లో మాత్రం ఆధార్‌ని ఉంచకూడదని పేర్కొంది. ఎందుకంటే.. ఆధార్ కార్డులో సున్నితమైన వ్యక్తిగత సమాచారం ఉంటుందని, దాన్ని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇచ్చింది.
Updated Date - 2023-08-18T21:13:02+05:30 IST