UK PM Rishi Sunak : ‘పద్మ’ పురస్కార ప్రదానోత్సవంలో అందరినీ ఆశ్చర్యపరచిన రిషి సునాక్ సతీమణి అక్షత
ABN, First Publish Date - 2023-04-06T10:07:52+05:30
బ్రిటన్ ప్రథమ మహిళ, ఆ దేశ ప్రధాన మంత్రి రిషి సునాక్ (Rishi Sunak) సతీమణి అక్షత మూర్తి
న్యూఢిల్లీ : బ్రిటన్ ప్రథమ మహిళ, ఆ దేశ ప్రధాన మంత్రి రిషి సునాక్ (Rishi Sunak) సతీమణి అక్షత మూర్తి (Akshata Murty) బుధవారం జరిగిన ‘పద్మ’ పురస్కారాల ప్రదానోత్సవంలో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆమె బ్రిటన్ భద్రతా దళం భద్రత లేకుండానే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేకాకుండా ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి అతిథుల మధ్యలో ఆసీనులయ్యారు. ఆమె తల్లి సుధా మూర్తి (Sudha Murthy) పద్మ భూషణ్ (Padma Bhushan) పురస్కారాన్ని స్వీకరించనుండటంతో ఆమె ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సుధా మూర్తికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) పద్మ భూషణ్ పురస్కారాన్ని బుధవారం ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అక్షత మూర్తి బ్రిటన్ నుంచి వచ్చారు. ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి, అతిథులతోపాటు కూర్చున్నారు. అనంతరం అధికారులు ఆమెను గుర్తించి, ప్రోటోకాల్ ప్రకారం ముందు వరుసలోకి వచ్చి కూర్చోవాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఆమె ముందు వరుసలో ఆసీనులయ్యారు. విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ (Subrahmanian Jaishankar) పక్కన కూర్చున్నారు. అదే వరుసలో ఇతర ప్రతినిధులు కూడా ఉన్నారు.
అక్షత మూర్తికి భద్రత కల్పించేందుకు బ్రిటన్ భద్రతా దళం రాకపోవడం కూడా చాలా మందిని ఆశ్చర్యపరచింది. ఈ కార్యక్రమంలో అక్షత మూర్తి తండ్రి, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి కూడా పాల్గొన్నారు. రిషి సునాక్, అక్షత మూర్తి వివాహం 2009లో జరిగింది. వీరిద్దరూ స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు.
ఇవి కూడా చదవండి :
Padma Awards 2023: కన్నుల పండువగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం
Supreme Court : విపక్షాలకు సుప్రీం షాక్!
Updated Date - 2023-04-06T10:07:52+05:30 IST