Kejriwal Vs Rijiju : కేజ్రీవాల్‌కు కేంద్ర మంత్రి రిజిజు సూటి ప్రశ్న
ABN, First Publish Date - 2023-04-15T16:24:56+05:30
ఢిల్లీ మద్యం విధానం కేసు (Delhi excise policy case)లో అబద్ధాలు చెప్తున్నందుకు సీబీఐ, ఈడీ అధికారులపై కేసు పెడతానని ఆ రాష్ట్ర
న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం విధానం కేసు (Delhi excise policy case)లో అబద్ధాలు చెప్తున్నందుకు సీబీఐ, ఈడీ అధికారులపై కేసు పెడతానని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Delhi chief minister Arvind Kejriwal) హెచ్చరించడంపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు (Union law minister Kiren Rijiju) ఘాటుగా స్పందించారు. మద్యం కుంభకోణం కేసులో కోర్టు దోషిగా తీర్పు చెప్తే, కోర్టుపై కూడా కేసు పెడతారా? అని ప్రశ్నించారు.
ఢిల్లీ మద్యం విధానం కేసులో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.2,600 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని సీబీఐ ఆరోపించింది. రూ.100 కోట్ల మేరకు ముడుపులు చేతులు మారినట్లు ఆరోపించింది. ఈ కేసులో ఇప్పటికే సుమారు 11 మంది అరెస్టయి, జైలులో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా కూడా అరెస్టయి, జైలులో ఉన్నారు. తెలంగాణ ఎమ్మెల్సీ కవితను కూడా ఓ దర్యాప్తు సంస్థ ప్రశ్నించింది. ఈ కేసులో సీబీఐ కేజ్రీవాల్‌కు శుక్రవారం సమన్లు జారీ చేసింది. ఆదివారం ఉదయం తమ కార్యాలయంలో హాజరుకావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ శనివారం విలేకర్ల సమావేశంలో స్పందిస్తూ, అవినీతికి వ్యతిరేకంగా అసెంబ్లీలో మాట్లాడినప్పుడే సీబీఐ సమన్లు పంపుతుందనే విషయం తనకు తెలుసునని చెప్పారు. మద్యం పాలసీ దర్యాప్తునకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థలు కోర్టులో తమపై అబద్ధాలు చెబుతున్నాయని ఆరోపించారు. అరెస్టు చేసిన వ్యక్తులను చిత్రహింసలు పెడుతూ, వారిపై ఒత్తిడి పెంచడం ద్వారా తమను ఇరుకునపెట్టేందుకు చూస్తున్నాయని అన్నారు. మద్యం విదానంలో మనీష్ సిసిడియాపై సీబీఐ తప్పుడు ఆరోపణలు చేసిందని, అబద్ధపు స్టేట్‌మెంట్లు ఇవ్వాలంటూ సాక్షులను చితకబాదుతున్నారని, అవినీతిని నిర్మూలించే గొప్ప విధానం ఇదే కావచ్చునని విమర్శలు గుప్పించారు.
తాను ఆదివారం ఉదయం 11 గంటలకు సీబీఐ సమక్షంలో హాజరవుతానని చెప్పారు. సాక్ష్యాలను ధ్వంసం చేయడం కోసం మనీశ్ సిసోడియా 14 ఫోన్లను ధ్వంసం చేశారని దర్యాప్తు సంస్థలు ఆరోపించాయన్నారు. అయితే సీజర్ మెమోలో 4 ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు రాశాయన్నారు. తన వద్ద ఒక ఫోన్ ఉందని సీబీఐ చెప్తోందన్నారు. అంటే , ఆ పద్నాలుగు ఫోన్లలో ఐదు ఫోన్లు దర్యాప్తు సంస్థల వద్ద ఉన్నాయని అర్థమవుతోందన్నారు. మిగిలిన ఫోన్లు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. సీబీఐ, ఈడీ న్యాయస్థానంలో అబద్ధాలు చెప్తున్నాయని, మద్యం కుంభకోణం జరగలేదని చెప్పారు. అబద్ధాలు చెప్తున్న సీబీఐ (Central Bureau of Investigation-CBI), ఈడీ (Enforcement Directorate) అధికారులపై తగిన కేసులు పెడతామని హెచ్చరించారు.
కేజ్రీవాల్ హెచ్చరికపై కిరణ్ రిజిజు స్పందిస్తూ, మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ దోషి అని కోర్టు తీర్పు చెబితే, కోర్టుపై కూడా ఆయన కేసు పెడతారా? అని ప్రశ్నించారు. చట్టంపై అందరికీ నమ్మకం ఉండాలన్నారు. ‘‘మిమ్మల్ని దోషిగా తీర్పు చెబితే కోర్టుపై కూడా కేసు పెడతానని చెప్పడం మర్చిపోయారు. చట్టం తన పని తాను చేసుకునేందుకు అవకాశం ఇవ్వండి. చట్టాన్ని మనమంతా గౌరవించాలి’’ అని కిరణ్ రిజిజు ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి :
Delhi Excise Policy: కోర్టుల ముందు అబద్దాలు చెబుతున్న దర్యాప్తు సంస్థలు.. సీబీఐ సమన్లపై కేజ్రీవాల్
Kapil Sibal : కేజ్రీవాల్‌కు సీబీఐ సమన్లపై కపిల్ సిబల్ ఘాటు స్పందన
Updated Date - 2023-04-15T16:30:30+05:30 IST