Govt Vs Twitter : ట్విటర్ మాజీ సీఈఓ ఆరోపణలు పూర్తిగా అబద్ధం : కేంద్ర మంత్రి
ABN, First Publish Date - 2023-06-13T10:51:58+05:30
రైతుల నిరసనలకు సంబంధించిన అకౌంట్లను బ్లాక్ చేయాలని భారత ప్రభుత్వం ట్విటర్‌పై ఒత్తిడి తెచ్చిందని ట్విటర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీ చేసిన ఆరోపణలను కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మంగళవారం తోసిపుచ్చారు. జాక్ డోర్సీ ఆరోపణలు పూర్తిగా అబద్ధమని తెలిపారు.
న్యూఢిల్లీ : రైతుల నిరసనలకు సంబంధించిన అకౌంట్లను బ్లాక్ చేయాలని భారత ప్రభుత్వం ట్విటర్‌పై ఒత్తిడి తెచ్చిందని ట్విటర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీ (Jack Dorsey) చేసిన ఆరోపణలను కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ (Union minister Rajeev Chandrashekar) మంగళవారం తోసిపుచ్చారు. జాక్ డోర్సీ ఆరోపణలు పూర్తిగా అబద్ధమని తెలిపారు. ట్విటర్ చరిత్రలో అత్యంత సందేహాస్పద దశ నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నంలో భాగంగానే ఆయన ఈ ఆరోపణలు చేశారన్నారు.
‘బ్రేకింగ్ పాయింట్స్ విత్ క్రిస్టల్ అండ్ సాగర్’ అనే యూట్యూబ్ షోలో జాక్ డోర్సీ మాట్లాడారు. విదేశీ ప్రభుత్వాల నుంచి ఒత్తిళ్లు ఎదురయ్యాయా? అని ప్రశ్నించినపుడు ఆయన మాట్లాడుతూ, ట్విటర్ ఇండియా మీడియా ప్లాట్‌ఫామ్‌ను భారత దేశంలో షట్ డౌన్ చేస్తామని, సిబ్బంది ఇళ్లపై దాడులు చేస్తామని భారత ప్రభుత్వం హెచ్చరించిందన్నారు. చాలా రిక్వెస్టులు చేసిన దేశాల్లో భారత దేశం ఒకటని తెలిపారు. భారత ప్రభుత్వం రైతుల నిరసనలు, కొందరు పాత్రికేయులకు సంబంధించిన ట్విటర్ అకౌంట్లపై రిక్వెస్టులు చేసిందన్నారు. ఈ ట్విటర్ ఖాతాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు ఉన్నాయన్నారు. ‘‘భారత దేశంలో ట్విటర్‌ను షట్ డౌన్ చేస్తాం’’, ‘‘మీ ఉద్యోగుల ఇళ్లలో సోదాలు చేస్తాం’’, అని ప్రభుత్వం చెప్పిందని, అలాగే చేసిందని అన్నారు. ‘‘చెప్పినట్లు వినకపోతే మీ కార్యాలయాలను మూయించేస్తాం’’ అని హెచ్చరించిందన్నారు. ‘‘ఇది భారత దేశం, ఇది ప్రజాస్వామిక దేశం’’ అన్నారు.
జాక్ డోర్సీ చేసిన తీవ్ర ఆరోపణలపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ, జాక్ డోర్సీ నేతృత్వంలోని ట్విటర్ 2020-22 మధ్య కాలంలో భారతీయ చట్టాలను పదే పదే ఉల్లంఘించిందని, ఎలన్ మస్క్ (Elon Musk) ట్విటర్‌ను స్వాధీనం చేసుకునే ప్రక్రియను ప్రారంభించిన కొద్ది వారాల తర్వాత కేవలం 2022 జూన్‌లో మాత్రమే భారతీయ చట్టాలను అనుసరించిందని చెప్పారు. భారత దేశ సార్వభౌమాధికార చట్టాన్ని ట్విటర్ అంగీకరించడం లేదని, చట్టానికి అనుగుణంగా నడచుకోవడం సమస్యగా భావిస్తోందని చెప్పారు. భారత దేశ చట్టాలు తనకు వర్తించబోవనే విధంగా ప్రవర్తించిందన్నారు. జాక్ డోర్సీ చెప్పినట్లుగా ఎవరూ జైలుకు వెళ్లలేదన్నారు. అదేవిధంగా ట్విటర్‌ను షట్ డౌన్ చేయలేదన్నారు. భారత దేశంలో కార్యకలాపాలు నిర్వహించే కంపెనీలన్నీ దేశ చట్టాలను పాటించే విధంగా చేసే అధికారం సార్వభౌమాధికార భారత్‌కు ఉందన్నారు.
2021లో రైతుల నిరసనల సమయంలో ట్విటర్ వేదికగా మారణకాండ గురించి తప్పుడు సమాచారం, తప్పుడు నివేదికలు ప్రచారమయ్యాయని చెప్పారు. ఈ తప్పుడు సమాచారాన్ని తొలగించే కర్తవ్యం భారత ప్రభుత్వానికి ఉందన్నారు. బూటకపు వార్తల వల్ల పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంటుందన్నారు.
జాక్ డోర్సీ నేతృత్వంలోని అమెరికన్ కంపెనీ అయిన ట్విటర్ పక్షపాతంతో వ్యవహరిస్తూ ఉండేదన్నారు. 2020 జనవరిలో అమెరికా రాజధాని నగరంలో జరిగిన ఘర్షణల సందర్భంగా తప్పుడు సమాచారాన్ని ట్విటర్ తొలగించిందని, కానీ భారత దేశంలో అటువంటి తప్పుడు సమాచారాన్ని తొలగించడానికి ఇష్టపడలేదని చెప్పారు. ఎవరినీ జైలుకు పంపలేదని, ఎవరిపైనా సోదాలు చేయలేదని చెప్పారు. భారతీయ చట్టాలను అనుసరించేవిధంగా చేయడంపై మాత్రమే ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు.
2021 మే నెలలో ఢిల్లీ పోలీసులు దక్షిణ ఢిల్లీ, గురుగ్రామ్‌లలోని ట్విటర్ కార్యాలయాలకు వెళ్లారు. బీజేపీ అధికార ప్రతనిధి సంబిత్ పాత్రా కాంగ్రెస్ టూల్‌కిట్ గురించి ఇచ్చిన ట్వీట్‌ను ‘మేనిపులేటెడ్ మీడియా’ అని ట్విటర్ ట్యాగ్ చేసిన నేపథ్యంలో ఇది జరిగింది.
ఇవి కూడా చదవండి :
Janasena : జనసేన కార్యాలయంలో సినీ ప్రముఖుల సందడి.. హరీష్ శంకర్ కీలక ప్రకటన..
AIADMK Vs BJP : బీజేపీతో తెగదెంపులకు ఏఐఏడీఎంకే సిద్ధం?
Updated Date - 2023-06-13T10:51:58+05:30 IST