Union Minister: తేల్చిచెప్పిన కేంద్రమంత్రి.. వరద నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించలేం..
ABN, Publish Date - Dec 28 , 2023 | 08:51 AM
కన్నియాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్‌కాశి జిల్లాల్లో ఏర్పడిన వరద నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించలేమని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్(Union Minister Nirmala Sitharaman) తేల్చిచెప్పారు.
- కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
ప్యారీస్(చెన్నై): కన్నియాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్‌కాశి జిల్లాల్లో ఏర్పడిన వరద నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించలేమని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్(Union Minister Nirmala Sitharaman) తేల్చిచెప్పారు. ఈ జిల్లాల్లో ఇటీవల కురిసిన భారీవర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల నుంచి ప్రధాన రహదారులు సైతం వరద ముంపునకు గురై ప్రజలు ఆహారం, తాగునీటి కోసం పడరాని పాట్లు పడ్డారు. వరద ప్రవాహంలో రోడ్లు, కల్వర్టులు కొట్టుకుపోవడంతో ప్రజా రవాణా సైతం పూర్తిగా స్తంభించింది. వరద ప్రభావిత ప్రాంతాలను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పరిశీలించారు. ఈ సందర్భంగా తూత్తుకుడి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లిన ఆమె, అక్కడ ఏర్పాటుచేసిన వరద నష్టాలకు సంబంధించిన ఫొటోలు, సమాచారాన్ని పరిశీలించారు. ఆ సమయంలో ఈ నాలుగు బాధిత జిల్లాలకు చెందిన రైతులు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను సంప్రదించి, వరద తీవ్రతను జాతీయ విపత్తుగా ప్రకటించాలని, పంట రుణాలు మాఫీ చేయాలని వినతిపత్రం సమర్పించారు. మరోవైపు తమిళనాడు ప్రభుత్వం తరఫున వరద నష్టం వివరాలను 72 పేజీల వినతిపత్రంగా తయారుచేశారు. రాష్ట్ర మంత్రి తంగం తెన్నరసు, డీఎంకే ఎంపీ కనిమొళి(DMK MP Kanimozhi) తదితరులు ఈ వినతిపత్రాన్ని సమర్పించగా నిర్మలా సీతారామన్ పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ... 19 ఏళ్ల క్రితం సంభవించిన జలప్రళయం సునామీని కూడా కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించని నేపథ్యంలో, వరద నష్టాన్ని ప్రకటించడం సాధ్యం కాదన్నారు. బాధితులను ఆదుకునేందుకు రాష్ట్రప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ సూచనల మేరకు పెద్దమొత్తంలో రుణం పొందవచ్చని ఆమె స్పష్టం చేశారు.
Updated Date - Dec 28 , 2023 | 08:51 AM