Dinesh Sharma: యూపీ నుంచి రాజ్యసభకు బిజేపీ మాజీ డిప్యూటీ సీఎం ఏకగ్రీవ ఎన్నిక
ABN, First Publish Date - 2023-09-08T16:53:47+05:30
ఉత్తరప్రదేశ్ జీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత దనేష్ శర్మ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎలాంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సెప్టెంబర్ 15న రాజ్యసభకు ఉప ఎన్నిక జరగాల్సి ఉండగా, శర్మ ఒక్కరే నామినేషన్ వేశారు.
లక్నో: ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత దనేష్ శర్మ (Dinesh Sharma) రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎలాంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సెప్టెంబర్ 15న రాజ్యసభకు ఉప ఎన్నిక జరగాల్సి ఉండగా, శర్మ ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి అజిత్ శర్మ ప్రకటించారు. ప్రస్తుత రాజ్యసభ ఎంపీ హరిద్వార్ డూబే (బీజేపీ) ఆకస్మిక మృతితో ఉపఎన్నిక అనివార్యమైంది.
అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపిన దినేష్ శర్మ
కాగా, తనపై విశ్వాసం ఉంచిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, యూపీ బీజేపీ చీఫ్ భూపేంద్ర చౌదరి, బీజేపీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వానికి దినేష్ శర్మ కృతజ్ఞతలు తెలిపారు. అధిష్ఠానం తనపై ఉంచి నమ్మకాన్ని నిలబెడతానని చెప్పారు. 2024లో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మూడోసారి బీజేపీ నాయకత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం, ప్రపంచ దేశాల్లో ఇండియా అగ్రస్థానంలో నిలిపడమన్నదే అందరి ఏకైక లక్ష్యం కావాలని అన్నారు.
దినేష్ శర్మ 2017 నుంచి 2022 వరకూ యోగి ఆదిత్య నాథ్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. సెకండరీ, హైయర్ ఎడ్యుకేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఐడీ అండ్ ఎలక్ట్రానిక్స్ వంటి పదవులు కూడా చేపట్టారు.
Updated Date - 2023-09-08T16:53:47+05:30 IST