'Vande Bharat' train: ‘వందే భారత్’ రైలు ప్రాజెక్ట్‌కు జాతీయ అవార్డు
ABN, First Publish Date - 2023-09-09T07:30:36+05:30
స్థానిక పెరంబూర్ సమీపంలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసిఎఫ్) ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు కైవసం చేసుకుంది.
పెరంబూర్(చెన్నై): స్థానిక పెరంబూర్ సమీపంలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసిఎఫ్) ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు కైవసం చేసుకుంది. రైలు పెట్టెల తయారీలో దేశంలోనే ఐసిఎఫ్ పేరుగాంచింది. సబర్బన్, ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్(Suburban, Passenger, Express) రైళ్ల బోగీల తయారు చేస్తున్న ఐసిఎఫ్, దేశంలోనే అతివేగవంతమైన ‘వందే భారత్’ రైళ్ల తయారీకి శ్రీకారం చుట్టింది. అధునిక వసతులు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆహ్లాదం కలిగించే ప్రయాణం తదితరాలతో రూపొందిన వందే భారత్ రైళ్లు ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల మధ్య నడుస్తూ, ప్రజాదరణ పొందాయి. ఈ నేపథ్యంలో, ఇండియన్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ అసోసియేట్స్, నేషనల్ అసోసియేషన్ ఫర్ ప్రాజెక్ట్ ప్రొఫెషనల్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఏడాది ‘నేషనల్ ప్రాజెక్ట్స్ ఎక్స్‌లెన్సీ అవార్డ్స్’ ప్రకటించారు. దేశంలోనే హైస్పీడ్ రైలును రూపొందించిన ఐసిఎఫ్‌కు ఈ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ఐసిఎఫ్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఐసిఎఫ్ జనరల్ మేనేజర్ బీజీ మాల్యాకు ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ రీజినల్ డైరెక్టర్ టి.శ్రీనివాసన్ అవార్డు అందజేశారు. అలాగే, ఎయిర్‌క్రాఫ్ట్ కారియర్, ఐఎన్‌ఎస్ విక్రాంత్, ది జెనాబ్ రైల్వే బ్రిడ్జి ప్రాజెక్ట్‌లు కూడా ఈ అవార్డును పొందాయి.
సీఎంఆర్‌ఎల్ బంపర్ ఆఫర్
- రూ.100తో మెట్రోలో రోజంతా ప్రయాణం
ప్రయాణికులకు చెన్నై మెట్రోరైల్ లిమిటెడ్ (Chennai Metrorail Limited) బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆ ప్రకారం, రూ.100 చెల్లించి రోజంతా మెట్రోరైళ్లలో ప్రయాణించవచ్చు. అందుకోసం టూరిస్ట్ కార్డు కోసం రూ.150 చెల్లించాల్సి ఉండగా, రూ.50 డిపాజిట్‌గా ఉంటుంది. ఈ కార్డు ఒకరోజు మాత్రమే పనిచేస్తుండగా, కార్డు తిరిగి అప్పగించే సమయంలో డిపాజిట్ తిరిగి ఇవ్వనున్నారు. వారాంతపు రోజులు, సాధారణ రోజుల్లో ఈ కార్డు ఉపయోగించి ప్రయాణించవచ్చని సీఎంఆర్‌ఎల్ పేర్కొంది.
Updated Date - 2023-09-09T07:59:36+05:30 IST