Vande Bharat Train: ‘వందే భారత్’ రైలు వచ్చేస్తోంది.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే..
ABN, First Publish Date - 2023-09-21T08:06:34+05:30
చెన్నై - తిరునల్వేలి మధ్య ఈనెల 24వ తేది నుంచి వందే భారత్ రైలు(Vande Bharat Train) ప్రారంభం కానుందని దక్షిణ రైల్వే జనరల్
పెరంబూర్(చెన్నై): చెన్నై - తిరునల్వేలి మధ్య ఈనెల 24వ తేది నుంచి వందే భారత్ రైలు(Vande Bharat Train) ప్రారంభం కానుందని దక్షిణ రైల్వే జనరల్ మేనేజర్ ఆనంద్ తెలిపారు. తిరునల్వేలిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రైల్వే బోర్డు నుంచి తమకు సమాచారం అందిందని, ఈ నెల 24న ప్రధాని నరేంద్రమోదీ ‘మన్‌కీ బాత్’ కార్యక్రమం అనంతరం, దేశవ్యాప్తంగా 9 వందేభారత్ రైళ్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నట్లు, వాటిలో చెన్నై - తిరునల్వేలి మధ్య నడుస్తుందన్నారు. అందుకోసం రైలు మార్గం పటిష్ఠత, సిగ్నలింగ్ వ్యవస్థను పరిశీలించాలని బోర్డు సూచించిందని జీఎం తెలిపారు. కాగా, ఈ రైలు స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రారంభించే అవకాశముందని తొలుత రైల్వే అధికారులు భావించగా, అది వాయిదా పడింది. ప్రస్తుతం ఈ రైలుకు నెంబర్లు చెన్నై - తిరునల్వేలి (నెం.20631), తిరునల్వేలి - చెన్నై (నెం.20632) కూడా కేటాయించారు. ఈనెల 24వ తేది ఉదయం 11 నుంచి 11.30 గంటల్లోపు తిరునల్వేలి జంక్షన్ నుంచి ప్రధాని మోదీ(Prime Minister Modi) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించనున్నారు. 8 బోగీలు కలిగిన ఈ రైలు 660 కి.మీ దూరాన్ని 8 గంటల్లో చేరుకోనుంది. 552 మంది ప్రయాణించే వసతి ఈ రైలులో వీఐపీ బోగీ ప్రయాణానికి రూ.2,800 నుంచి రూ.3 వేలు, ఇతర బోగీల్లో రూ.1,200 నుంచి రూ.1,300 చార్జీగా నిర్ణయించారు. తిరునల్వేలి నుంచి ఉదయం 6 గంటలకే బయల్దేరే వందే భారత్ రైలు మధ్యాహ్నం 1.50 గంటలకు చెన్నై చేరుకుంటుంది. చెన్నై నుంచి మధ్యాహ్నం 2.50 గంటలకు బయల్దేరి రాత్రి 10.40 గంటలకు తిరునల్వేలి చేరుకుంటుంది.
Updated Date - 2023-09-21T08:06:34+05:30 IST