Cauvery Water Issue: కర్ణాటక, తమిళనాడు మధ్య మళ్లీ ‘కావేరి’ పోరు.. అసలు ఈ వివాదం ఏంటి? ఎప్పటి నుంచి జరుగుతోంది?
ABN, First Publish Date - 2023-09-26T20:35:23+05:30
కావేరీ నదీ జలాల విషయంలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య కొన్ని దశాబ్దాల నుంచి పోరు జరుగుతూనే ఉంది. న్యాయమైన వాటా కోసం ఈ రెండు రాష్ట్రాలు డిమాండ్ చేస్తూ.. పోట్లాడుకుంటున్నాయి. ఇప్పుడు మరోసారి...
కావేరీ నదీ జలాల విషయంలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య కొన్ని దశాబ్దాల నుంచి పోరు జరుగుతూనే ఉంది. న్యాయమైన వాటా కోసం ఈ రెండు రాష్ట్రాలు డిమాండ్ చేస్తూ.. పోట్లాడుకుంటున్నాయి. ఇప్పుడు మరోసారి ఈ వివాదం తెరమీదకు వచ్చింది. తమిళనాడుకు కావేరీ నది నీటిని విడుదల చేయొద్దని బెంగళూరు వ్యాప్తంగా బంద్‌కు పిలుపునివ్వడంతో.. వివాదం రాజుకుంది. అసలు ఈ వివాదం ఏంటి? ఎప్పుడు ప్రాంరంభం అయ్యింది? ఎందుకు రెండు రాష్ట్రాల మధ్య పోరు సాగుతోంది? నిజానికి.. కావేరి పరివాహక ప్రాంతం కేరళ, పుదుచ్చేరీల్లోనూ ఉంది. కానీ.. వివాదం మాత్రం కర్ణాటక, తమిళనాడు మధ్యే ప్రతీసారి రాజుకుంటుంది. సుమారు 130 ఏళ్లుగా కావేరీ నదీ జలాల పంపిణీకి సంబంధించి.. ఆ రెండు రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తూనే ఉంది.
1892లో కుదిరిన తొలి ఒప్పందం
1892లో నీటి పారుదల ప్రాజెక్టులను పునరుద్ధరించాలని మైసూరు భావించినప్పుడు.. మద్రాసు ప్రావిన్స్ అంగీకరించలేదు. దీంతో.. మద్రాసు ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా, మైసూరు కావేరీ నదిపై ప్రాజెక్టులు చేపట్టాలని 1890-92 మధ్య ప్రాంతంలో ఆ రెండు ప్రావిన్స్‌ల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ డీల్ తర్వాత కొన్ని సంవత్సరాల వరకు ఎలాంటి గొడవలు జరగలేదు.
1910లో రాజు తప్పిన మాటతో వివాదం
1910లో కావేరీ నదిపై కన్నాంబడి గ్రామం వద్ద ప్రాజెక్టును (41.5 టీఎంసీల సామర్థ్యం) నిర్మించాలని మైసూరు రాజు కృష్ణరాజ ఒడయార్ అనుకున్నారు. ఇందుకు సివిల్ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వయ్యతో కలిసి ప్రణాళికలు రూపొందించారు. రెండు దశల్లో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించేలా ప్లాన్ చేయగా.. మొదటి దశ (11 టీఎంసీల సామర్థ్యం) పనులు సజావుగానే సాగాయి. కానీ.. రెండో దశ పనులు ప్రారంభమైనప్పుడు మద్రాసు ప్రావిన్స్ అడ్డుకుంది. అదే టైంలో మద్రాసు కూడా మెట్టూరు డ్యాం నిర్మాణాన్ని చేపట్టడంతో.. మైసూరు ప్రాజెక్ట్ మొదటి దశకే ఆగిపోయింది. అయితే.. మైసూరు రాజు కొంతకాలం తర్వాత మళ్లీ పాత ప్రణాళిక ప్రకారమే రెండో దశ పనుల్ని ప్రారంభించారు. ఇది మద్రాస్ ప్రావిన్స్ గుర్తించి అడ్డుకుంది. తద్వారా.. ఇరు ప్రాంతాల మధ్య వివాదం ప్రారంభమైంది. దీనికి చెక్ పెట్టేందుకు అప్పటి బ్రిటీష్ ఇండియా రంగంలోకి దిగి.. హెచ్‌డీ గ్రిఫిన్, ఎం నీథర్‌సోల్‌లను మధ్యవర్తులుగా నియమించింది. వీళ్లు 1914లో మైసూరుకు అనుకూలంగా తీర్పు ఇవ్వగా.. మద్రాస్ దాన్ని వ్యతిరేకించింది. దీంతో.. 1924 వరకు ఈ వ్యవహారం తేలలేదు. చివరికి 1924లో సుమారు 50 ఏళ్లపాటు వర్తించేలా ఇరు ప్రాంతాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది.
1970ల్లో మళ్లీ రగిలిన వివాదం
ఆ ఒప్పందం ముగిసి, స్వతంత్రం తర్వాత భాషాప్రాతిపదికన రాష్ట్రాలు విడిపోయినప్పుడు.. కేరళ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాలు కావేరీ జలాలను పంచుకున్నాయి. 1970ల్లో కర్ణాటక ప్రభుత్వం కొడగు జిల్లాలో హరంగీ డ్యామ్ నిర్మాణం చేపట్టగా.. దాన్ని ఆపేయాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం కోర్టుకెక్కింది. ఈ వ్యవహారం 1990 వరకు సాగింది. ఫైనల్‌గా సుప్రీంకోర్టు ఆదేశాలతో భారత ప్రభుత్వం జస్టిస్ చిత్తతోష్ ముఖర్జీ అధ్యక్షతన 1990 జూన్ 2వ తేదీన ఓ ట్రిబ్యునల్‌ని ఏర్పాటు చేసింది. తమకు నీరు విడుదల చేసేలా కర్ణాటకకి ఆదేశాలు ఇవ్వాలని తమిళనాడు డిమాండ్ చేయగా.. ట్రిబ్యునల్ దాన్ని తిరస్కరించింది. అప్పుడు తమిళనాడు కోర్టుకెళ్లి, తన డిమాండ్‌ని సాధించింది. ఏటా తమిళనాడుకు 205 టీఎంసీ నీళ్లు విడుదల చేయాలని కర్ణాటనకు నిర్దేశించింది. కానీ.. కర్ణాటక దీన్ని తిరస్కరించింది. అప్పట్లో ఇది పెద్ద దుమారానికి దారి తీసింది. ఈ వివాదం ఎంతలా ముదిరిందంటే.. బెంగళూరులో ఉంటున్న తమిళ ప్రజలపై దాడులు జరిగాయి.
2002లో రోడ్డుకెక్కిన రగడ
2002లో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో తీవ్ర కరువు సంభవించినప్పుడు.. ఒప్పందాన్ని పాటించాలని కర్ణాటక రాష్ట్రానికి తమిళనాడు సూచించింది. ఈ సూచనని కర్ణాటక తిరస్కరించింది. కావేరీ రివర్ అథారిటీ సమావేశం నిర్వహించినా ఫలితం లేకుండా పోయింది. అప్పుడు సుప్రీంకోర్టు రంగంలోకి దిగి.. రోజుకు 1.25 టీఎంసీల చొప్పున తమిళనాడుకు నీటిని విడుదల చేయాలని కర్ణాటకను ఆదేశించింది. కానీ.. ఆ ఆదేశాల్ని కర్ణాటక పెడచెవిన పెట్టడంతో జల వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఇరు రాష్ట్రాల సినీ నటులు రోడ్డుకెక్కడం, కర్ణాటకలో తమిళ ఛానళ్ల ప్రసారాలను & సినిమాలను నిషేధించడం, తమ రాష్ట్రంలోకి తమిళనాడు వాసులు రాకుండా కర్ణాటక అడ్డుకోవడం జరిగింది. ఇలా సంవత్సరాల తరబడి పోరాటం జరిగిన తర్వాత.. 2007లో ట్రిబ్యునల్ తన తుది తీర్పును వెలువరించింది. దిగువ నదీ తీర రాష్ట్రమైన తమిళనాడుకు 41.92%, కర్ణాటకకు 27.36%, కేరళకు 12%, పుదుచ్చేరికి 7.68% నీటిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
2012లో మరో వివాదం
2012లో తీవ్రమైన వర్షపాతం లోటు కారణంగా.. కావేరి నదీ జలాల కేటాయింపును కర్ణాటక రాష్ట్రం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఆ సమయంలో కర్ణాటక ప్రభుత్వంలో ఉన్న ఐదుగురు జనతాదళ్ (సెక్యులర్) నాయకులు తమ పదవులకు రాజీనామా కూడా చేశారు. దీంతో.. ఈ వివాదానికి రాజకీయ నిప్పు రగులుకుంది. విస్తృత నిరసనలకు దారితీసింది. దాదాపు నాలుగేళ్ల పాటు ఈ రగడ కొనసాగగా.. 2016లో సుప్రీంకోర్టు ఓ కీలక తీర్పు ఇచ్చింది. 2016లో తమిళనాడుకు 6,000 క్యూసెక్కుల కావేరీ నీటిని 10 రోజుల పాటు విడుదల చేయాలని కర్ణాటకను ఆదేశించింది. ఈ తీర్పుకి వ్యతిరేకంగా మళ్లీ నిరసనలు భగ్గుమన్నాయి. దీంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 2017లో సుప్రీంకోర్టు తమిళనాడు నీటి వాటాను 177.25 టీఎంసీలకు తగ్గించడంతో వివాదం మరింత అగ్గిరాజుకుంది. తమిళనాడులో కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ బోర్డు (సీడబ్ల్యూఎంబీ)ని ఏర్పాటు చేయాలని రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి. 2018లో బోర్డుని ఏర్పాటు చేయమని ఆదేశాలిచ్చింది. అయితే.. 2018లో ప్రధాని నరేంద్ర మోదీ చెన్నై పర్యటనకు వెళ్లగా, కావేరి నదీ జలాల విషయంలో తమిళనాడులో నిరసనలు చెలరేగాయి. కావేరీ నీటిలో తమకు హక్కుగా వాటా ఇవ్వాలని ఆందోళనకారులు పిలుపునిచ్చారు. 2022 ఆగస్టులో కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (CWMA) తమిళనాడుకు 10,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రకటించగా.. రైతులు, కన్నడ అనుకూల సంఘాల నిరసనలు చేశారు.
తాజా వివాదం
ఇటీటల కావేరి బోర్డు తమిళనాడుకు 5 వేల క్యూసెక్కుల నీరు చొప్పున 15 రోజుల పాటు విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై కన్నడ వాసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమిళనాడుకు నీళ్లు విడుదల చేయొద్దని కర్ణాటక రైతులు నిరసనలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కన్నడ సంఘాలు, సంస్థలు బంద్‌ను చేపట్టాయి. దాదాపు 130 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ వివాదం.. ఎప్పుడు ముగుస్తుందో, ఇరు రాష్ట్రాల మధ్య శాంతి వాతావరణం ఎప్పుడు నెలకొంటుందో కాలమే సమాధానం చెప్పాలి.
Updated Date - 2023-09-26T20:35:23+05:30 IST