Bharat : దేశం పేరు మార్పుపై రాజకీయ పార్టీల స్పందనలు
ABN, First Publish Date - 2023-09-05T16:10:09+05:30
ఇండియా అంటే బానిసత్వ చిహ్నమని చెప్తూ, ప్రాచీన కాలంనాటి పేరు అయిన ‘భారత్’ను తిరిగి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ప్రచారం ఊపందుకోవడంతో వివిధ రాజకీయ పార్టీలు స్పందిస్తున్నాయి.
న్యూఢిల్లీ : ఇండియా అంటే బానిసత్వ చిహ్నమని చెప్తూ, ప్రాచీన కాలంనాటి పేరు అయిన ‘భారత్’ను తిరిగి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ప్రచారం ఊపందుకోవడంతో వివిధ రాజకీయ పార్టీలు స్పందిస్తున్నాయి. 28 పార్టీలతో ఏర్పాటైన ప్రతిపక్ష కూటమి ఇండియా (I.N.D.I.A)ను చూసి భయపడి, దేశం పేరును మార్చేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సిద్ధమవుతోందని విమర్శలు వస్తున్నాయి. మరోవైపు బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్, క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఈ ప్రతిపాదనను స్వాగతించారు.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్స్) జైరామ్ రమేశ్ మంగళవారం ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘అయితే ఈ వార్త నిజమే. సెప్టెంబరు 9న జరిగే జీ20 విందు కోసం ఆహ్వాన పత్రాలను రాష్ట్రపతి భవన్ పంపించింది. దీనిలో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ అని పేర్కొనడానికి బదులుగా, ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని రాశారు. ఇప్పుడు రాజ్యాంగంలోని అధికరణ 1 ఈ విధంగా ఉంటుంది : ‘భారత్, అంటే ఒకప్పటి ఇండియా, రాష్ట్రాల యూనియన్.’ కానీ ఇప్పుడు ఈ ‘రాష్ట్రాల యూనియన్’ దాడికి గురవుతోంది’’ అని ఆందోళన వ్యక్తం చేశారు.
జేపీ నడ్డా వ్యాఖ్యలు
బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందిస్తూ, దేశ గౌరవానికి, గర్వకారణంగా నిలిచేవాటికి సంబంధించిన ప్రతి అంశంపైనా కాంగ్రెస్ ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తోందని ప్రశ్నించారు. ‘భారత్ జోడో’ అంటూ రాజకీయ యాత్రలు చేయడమెందుకు? ‘భారత్ మాతా కీ జై’ నినాదాన్ని ద్వేషించడం ఎందుకు? అని నిలదీశారు. దేశం పట్ల, రాజ్యాంగం, రాజ్యాంగ వ్యవస్థల పట్ల కాంగ్రెస్ పార్టీకి గౌరవం లేదని స్పష్టమవుతోందన్నారు. ఆయన (జైరామ్ రమేశ్) ఓ కుటుంబం ముఖస్తుతి కోసమే మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ జాతి వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక ఉద్దేశాల గురించి యావత్తు దేశానికి తెలుసునని చెప్పారు.
నడ్డా స్పందన తర్వాత కొద్ది నిమిషాల్లోనే జైరామ్ రమేశ్ మరోసారి ప్రతిస్పందించారు. ప్రధాని మోదీ చరిత్రను వక్రీకరించడాన్ని కొనసాగించవచ్చునని, ఇండియా, అంటే భారత్, అంటే రాష్ట్రాల యూనియన్‌ను విభజించడాన్ని కొనసాగించవచ్చునని, కానీ తమను మాత్రం ఎవరూ ఆపలేరని అన్నారు.
అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘గణతంత్ర భారత్ - అమృత కాలం దిశగా మన నాగరికత సగర్వంగా దూసుకెళ్తున్నందుకు సంతోషంగా, గర్వంగా ఉంది’’ అని తెలిపారు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ స్పందిస్తూ, ‘భారత్’ అని రాయడం, మాట్లాడటం పట్ల ఎందుకంత అక్కసు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు ఎందుకు అంతలా తమను తాము ‘భారతీయులం’ అని పిలుచుకుంటున్నారు? కొన్నిసార్లు ‘వందేమాతరం’ గురించి రభస సృష్టిస్తారు, మరికొన్నిసార్లు జాతీయవాదంతో మీకు (కాంగ్రెస్ పార్టీ నేతలకు) సమస్యలు ఉంటాయి.. అని దుయ్యబట్టారు.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నేత ఎస్ గురుమూర్తి మాట్లాడుతూ, ‘భారత్’ అనేది దాదాపు 2,000 సంవత్సరాలనాటిదని చెప్పారు. ఇది మన దేశపు ప్రాచీన సాహిత్యంలో ఉందన్నారు. ఇండియా పేరును భారత్ అని మార్చడం సరైనదేనని చెప్పారు. తాను ఈ చర్యను స్వాగతిస్తున్నానని తెలిపారు.
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా ఇచ్చిన ట్వీట్‌లో, జీ20 సదస్సు అధికారిక ఆహ్వాన పత్రికల్లో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కు బదులుగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని మార్చుతూ బీజేపీ చేపట్టిన చర్య ఆశ్చర్యంగా ఉందన్నారు. దీనిపై బహిరంగ చర్చ ప్రారంభమైందన్నారు. ఇండియాను బీజేపీ ఏవిధంగా రద్దు చేస్తుందన్నారు. ఈ దేశం ఓ రాజకీయ పార్టీకి చెందినది కాదన్నారు. ఇది 135 కోట్ల మంది భారతీయులకు చెందినదని తెలిపారు. మన జాతీయ గుర్తింపు బీజేపీ వ్యక్తిగత ఆస్తి కాదన్నారు. అది తన ఊహలకు అనుగుణంగా మార్చదగినది కాదన్నారు.
కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం స్పందిస్తూ, ఇక నుంచి కొత్త పాస్‌పోర్టులు అవసరమవుతాయా? అని ప్రశ్నించారు.
ఆర్జేడీ రాజ్యసభ సభ్యుడు మనోజ్ ఝా స్పందిస్తూ, బీజేపీ ఇంత బలహీనమైన పార్టీ అని తమకు తెలియదన్నారు. ఇంత తొందరగా టెన్షన్‌కు గురవుతున్నారా? అన్నారు. కొద్ది వారాల క్రితమే ప్రతిపక్షాలు ఇండియా కూటమిగా ఏర్పడ్డాయన్నారు. వెంటనే మీరు మీ ఆట మొదలెట్టేశారన్నారు.
వీరేంద్ర సెహ్వాగ్ స్పందన
క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇచ్చిన ట్వీట్‌లో, పేరు మనకు గర్వకారణంగా నిలిచేదిగా ఉండాలని తాను ఎల్లప్పుడూ విశ్వసిస్తానని తెలిపారు. మనం భారతీయులమని, ఇండియా అనే పేరును బ్రిటిషర్లు పెట్టారని తెలిపారు. మన అసలు పేరు ‘భారత్’ను అధికారికంగా చాలా కాలం క్రితమే తిరిగి తీసుకుని రావలసిందని అన్నారు. ఈసారి ప్రపంచ కప్ క్రికెట్ పోటీల్లో ఆడే భారతీయ క్రికెటర్ల జెర్సీలపైన ‘భారత్’ అని ముద్రించే విధంగా చర్యలు తీసుకోవాలని బీసీసీఐ, జయ్ షాలను కోరుతున్నానని తెలిపారు.
బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ స్పందన
అమితాబ్ బచ్చన్ మంగళవారం ఇచ్చిన ట్వీట్‌లో, భారత్ మాతా కీ జై అని నినదించారు. దీనికి భారత దేశ జాతీయ పతాకం మువ్వన్నెల జెండాను జత చేశారు. అమితాబ్ ట్వీట్‌కు చాలా మంది నెటిజన్లు సానుకూలంగా స్పందించారు. జైహో, జై హింద్-జై భారత్... అంటూ ట్వీట్ చేశారు.
ఈ ప్రచారానికి కారణం ఏమిటంటే..
జీ20 దేశాధినేతల సదస్సు న్యూఢిల్లీలోని ప్రగతి మైదానంలో ఈ నెల 9, 10 తేదీల్లో జరుగుతుంది. ఈ ఏడాది జీ20 దేశాల కూటమికి భారత దేశం అధ్యక్షత వహిస్తోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) జీ20 దేశాధినేతలకు ఈ నెల 9న రాష్ట్రపతి భవన్‌లో విందు ఇస్తున్నారు. ఈ విందుకు హాజరుకావాలని కోరుతూ అతిథులకు పంపిన ఆహ్వాన పత్రికల్లో మన దేశం పేరును ఇండియా అని కాకుండా భారత్ అని పేర్కొన్నారు. సాధారణంగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ అని పేర్కొంటారు, కానీ ఈ ఆహ్వాన పత్రికల్లో ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని రాశారు. దీంతో కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్స్) జైరామ్ రమేశ్ మంగళవారం ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘అయితే ఈ వార్త నిజమే. సెప్టెంబరు 9న జరిగే జీ20 విందు కోసం ఆహ్వాన పత్రాలను రాష్ట్రపతి భవన్ పంపించింది. దీనిలో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ అని పేర్కొనడానికి బదులుగా, ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని రాశారు. ఇప్పుడు రాజ్యాంగంలోని అధికరణ 1 ఈ విధంగా ఉంటుంది : ‘భారత్, అంటే ఒకప్పటి ఇండియా, రాష్ట్రాల యూనియన్.’ కానీ ఇప్పుడు ఈ ‘రాష్ట్రాల యూనియన్’ దాడికి గురవుతోంది’’ అని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి :
Teachers’ Day : ఉపాధ్యాయులకు వందనం : మోదీ
Updated Date - 2023-09-05T16:10:09+05:30 IST