Modi-Biden : మోదీ-బైడెన్ ద్వైపాక్షిక చర్చలు న్యూఢిల్లీలో ఈ నెల 8న : శ్వేత సౌధం
ABN, First Publish Date - 2023-09-02T11:42:40+05:30
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) వచ్చే వారం న్యూఢిల్లీ రాబోతున్నారు. జీ20 సదస్సులో పాల్గొనేందుకు వస్తున్న ఆయన ఈ నెల 8న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.
న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) వచ్చే వారం న్యూఢిల్లీ రాబోతున్నారు. జీ20 సదస్సులో పాల్గొనేందుకు వస్తున్న ఆయన ఈ నెల 8న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ వివరాలను శ్వేత సౌధం (White House) శనివారం ప్రకటించింది.
జీ20 సదస్సుకు భారత దేశం అధ్యక్షత వహిస్తోంది. ఈ సమావేశాలు న్యూఢిల్లీలో ఈ నెల 9, 10 తేదీల్లో జరుగుతాయి. వైట్ హౌస్ శనివారం విడుదల చేసిన ప్రటకనలో, జో బైడెన్ జీ20 నేతల సమావేశంలో పాల్గొనేందుకు ఈ నెల 7న బయల్దేరుతారని తెలిపింది. ప్రధాని మోదీ నాయకత్వాన్ని బైడెన్ ప్రశంసిస్తారని తెలిపింది. మోదీతో ఈ నెల 8న ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని తెలిపింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం వల్ల ఏర్పడే ఆర్థిక, సాంఘిక ప్రభావాన్ని తగ్గించడంపై చర్చిస్తారని పేర్కొంది. ప్రపంచ బ్యాంకు సహా మల్టీలేటరల్ డెవలప్‌మెంట్ బ్యాంకుల సామర్థ్యాన్ని పెంచడంపై చర్చిస్తారని తెలిపింది. అంతర్జాతీయ సవాళ్లకు పరిష్కారం, పేదరికంపై పోరాటం గురించి కూడా వీరు మాట్లాడతారని వెల్లడించింది.
ప్రధాని మోదీ జీ20 నాయకత్వాన్ని బైడెన్ ప్రశంసిస్తారని, జీ20కి ప్రధాన ఆర్థిక సహకార వేదికగా అమెరికా నిబద్ధతను పునరుద్ఘాటిస్తారని వివరించింది. 2026లో జీ20 సదస్సుకు అమెరికా ఆతిథ్యమిస్తుందని తెలిపింది.
ప్రపంచంలోని అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలుగల దేశాల ఇంటర్‌గవర్నమెంటల్ ఫోరం జీ20. దీనిలోని సభ్య దేశాలు రొటేషన్ పద్ధతిలో ఒక్కొక్క సంవత్సరం దీనికి ఆతిథ్యం ఇస్తూ ఉంటాయి. దీనిలో సభ్యత్వం ఉన్న దేశాల్లో... అర్జంటైనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, భారత దేశం, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, ది రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, తుర్కియే, బ్రిటన్, అమెరికా, యూరోపియన్ యూనియన్ ఉన్నాయి. ఈ సదస్సుకు అతిథులుగా వస్తున్న దేశాలు... బంగ్లాదేశ్, ఈజిప్ట్, మారిషస్, నెదర్లాండ్స్, నైజీరియా, ఒమన్, సింగపూర్, స్పెయిన్, యూఏఈ.
ఇవి కూడా చదవండి :
Supreme Court : తల్లిదండుల పెళ్లి చెల్లకపోయినా పిల్లలకు వారసత్వ హక్కు ఉంటుంది : సుప్రీంకోర్టు
RSS : మన దేశాన్ని ‘భారత్’ అని పిలవాలి : మోహన్ భగవత్
Updated Date - 2023-09-02T11:42:40+05:30 IST