Chhattisgarh: కాంగ్రెస్ గెలిస్తే సీఎం ఎవరో చెప్పిన డిప్యూటీ సీఎం
ABN, First Publish Date - 2023-12-01T16:27:31+05:30
ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరవుతారు? భూపేష్ బఘెల్‌నే తిరిగి ముఖ్యమంత్రి పదవి వరిస్తుందా? దీనిపై ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత టీఎస్ సింగ్ దేవ్ శుక్రవారంనాడు స్పష్టత ఇచ్చారు. అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు.
రాయపూర్: ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లో కాంగ్రెస్ (Congress) పార్టీ రెండోసారి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరవుతారు? భూపేష్ బఘెల్‌నే తిరిగి ముఖ్యమంత్రి పదవి వరిస్తుందా? దీనిపై ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత టీఎస్ సింగ్ దేవ్ (TS Singh Dev) శుక్రవారంనాడు స్పష్టత ఇచ్చారు. కాంగ్రెస్ అధిష్ఠానమే సీఎం ఎవరనే దానిపై ఒక నిర్ణయం తీసుకుంటుందని, దానికి తామంతా కట్టుబడి ఉంటామని చెప్పారు.
అధికారం రెండున్నరేళ్ల పాటు పంచుకునే విషయంపై అడిగినప్పుడు, రెండున్నరేళ్ల పాటు అధికారం పంచుకోవడం అనేది గత అనుభవాల దృష్ట్యా మంచిది కాదనేది తన అభిప్రాయమని చెప్పారు. అధిష్ఠానం తీసుకునే నిర్ణయమే అంతిమ నిర్ణయం అవుతుందన్నారు. ''మేము ఊహాగానాలు చేయదలచుకోలేదు. అందువల్ల వ్యక్తుల మధ్య సంబంధాలు చిక్కుల్లో పడతాయి. ఏదిఏమైనా అధిష్ఠానం నిర్ణయానికి విడిచిపెట్టాలని మేమంతా నిర్ణయించుకున్నాం'' అని సింగ్ దేవ్ చెప్పారు. బీజేపీ కంటే ముందంజలో కాంగ్రెస్ ఉందని ఎగ్జిట్ పోల్స్ జోస్యంపై మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని తాను బలంగా నమ్మతున్నట్టు చెప్పారు. పార్టీ 60 సీట్ల వరకూ గెలుచుకుంటుందన్నారు. అధిష్ఠానం ఎవరిని సీఎంగా నిర్ణయించినా తమకు సమ్మతమేని సింగ్ దేవ్ స్పష్టం చేశారు.
రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సింగ్ దేవ్ గత జూన్‌లో ఉప ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. 2018లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థుల విషయంలో సింగ్ దేవ్ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. అయితే, భూపేష్ బఘెల్‌కు సీఎం పదవి దక్కగా, క్యాబినెట్ మంత్రిగా సింగ్ దేవ్ బాధ్యతలు చేపట్టారు.
Updated Date - 2023-12-01T16:27:33+05:30 IST