Donate for Desh: కాంగ్రెస్ విరాళాలు ఎందుకు సేకరిస్తోంది? నేతలేమంటున్నారు?
ABN, Publish Date - Dec 18 , 2023 | 01:13 PM
దేశవ్యాప్తంగా క్రౌడ్ ఫండింగ్(Crowdfunding Drive) కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టిన విషయం విదితమే. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikharjuna Kharge) సోమవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఢిల్లీ: దేశవ్యాప్తంగా క్రౌడ్ ఫండింగ్ (Crowdfunding Drive) కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టిన విషయం విధితమే. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikharjuna Kharge) సోమవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పరిణామంపై అధికార బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. దీంతో దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. మరి క్రౌండ్ ఫండింగ్‌పై కాంగ్రెస్ నేతలు ఏమన్నారో చూద్దాం.
"కాంగ్రెస్ (Congress) దేశం కోసం ప్రజల నుంచి విరాళాలు సేకరించడం ఇదే తొలిసారి. ధనవంతులపై ఆధారపడి పని చేస్తే, వారి విధానాలను అనుసరించాలి. స్వాతంత్ర్య పోరాటంలో మహాత్మా గాంధీ కూడా ప్రజల నుంచి విరాళాలు తీసుకున్నారు" అని విరాళాల సేకరణ ప్రారంభం సందర్భంగా మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. ఈ మేరకు కాంగ్రెస్ ఎక్స్ హ్యాండిల్ ఓ పోస్ట్ చేసింది.
"అట్టడుగు వర్గాల ప్రజల హక్కులను కాపాడటానికి, అసమానతలను తొలగించడానికి, సంపన్నులకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక బలీయమైన ప్రతిపక్షంగా నిలబడటానికి ఈ క్రౌడ్ ఫండింగ్ ఉపయోగపడుతుంది" అని రాసుకొచ్చింది. 138 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీకి కొన్నేళ్లుగా విరాళాలు రావడం భారీగా తగ్గింది. 2024 పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆ పార్టీ ఈ ప్రచార, నిధుల సమీకరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. దేశ వ్యాప్తంగా కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, ప్రజల నంచి రూ.138, రూ.1,380, రూ.13,800... చొప్పున విరాళాలు సేకరించాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది.
కాంగ్రెస్ అఫిషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి దాతలు విరాళాలను ఇవ్వవచ్చు. ఎక్కువ అమౌంట్ ఇవ్వాలనుకునే వారు వెబ్ సైట్ లోకి వెళ్లి Other ఆప్షన్ ఎంచుకోవచ్చు. దీనిపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. "పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, జిల్లా, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులు, ఏఐసీసీ సభ్యులు కనీసం రూ.1,380 చొప్పున విరాళం ఇవ్వాలని సూచిస్తున్నాం. ఇది దేశంలోనే అతి పెద్ద క్రౌడ్ పుల్లింగ్ ఫండ్ క్యాంపెయిన్ అవుతుంది. పార్టీ 138వ వ్యవస్థాపక దినోత్సవం డిసెంబరు 28న నాగ్‌పూర్‌లో 10 లక్షల మందితో భారీ ర్యాలీని నిర్వహిస్తాం" అని అన్నారు.
దేశాన్ని దోచుకున్న కాంగ్రెస్...
కాంగ్రెస్ క్రౌడ్ ఫండింగ్‌పై బీజేపీ(BJP) స్పందిస్తూ.. 60 ఏళ్లుగా దేశాన్ని దోచుకున్నవారు ఇప్పుడు విరాళాలివ్వాలని అంటున్నారని ఎద్దేవా చేసింది. కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహూ ఇంట్లో దొరికిన నోట్ల కట్టల వ్యవహారం నుంచి దేశం దృష్టి మరల్చడానికే ఆ పార్టీ ఇలాంటి పనులు చేస్తోందని విమర్శిస్తోంది. ప్రజా ధనాన్ని గాంధీ కుటుంబానికి సమర్పించడానికే ఇలాంటి పనులు చేస్తున్నారని బీజేపీ నేతలు అంటున్నారు.
"మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి"
Updated Date - Dec 18 , 2023 | 01:39 PM