నాడు కనిపించిన హడావుడి, ఉత్సాహం నేడు ఎందుకు లేదు..
ABN, First Publish Date - 2023-03-16T10:07:18+05:30
రాష్ట్ర ప్రజలకు చక్కటి భవిష్యత్తును అందించే దిశగా తమ ప్రభు త్వం ప్రాధాన్యతా పథకాలను అమలు చేస్తోందని, అయితే వాటిని ప్రారంభించినప్పుడు
చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రజలకు చక్కటి భవిష్యత్తును అందించే దిశగా తమ ప్రభు త్వం ప్రాధాన్యతా పథకాలను అమలు చేస్తోందని, అయితే వాటిని ప్రారంభించినప్పుడు అధికారుల్లో కనిపించే హడావుడి, ఉత్సాహం వాటిని అమలు చేయడంలో కనిపించడం లేదని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) పేర్కొన్నారు. నామక్కల్ కవింజర్ మాళిగై పదో అంతస్థులోని మీటింగ్ హాలులో బుధవారం ఉదయం ప్రభుత్వ ప్రాధాన్యతా పథకాల అమలుపై వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. ఈ నెల 13న తొలి విడత సమావేశం జరిగింది. బుధవారం జరిగిన మలివిడత సమీక్షా సమావేశంలో స్టాలిన్ ప్రసంగిస్తూ.. ప్రత్యేక పథకాలను పటిష్ఠంగా అమలు చేయడానికి అధికారులు ప్రతినెలా రెండు జిల్లాల్లో తప్పనిసరిగా పర్యటించి క్షేత్రపరిశీలన జరపాలని, అప్పుడు పథకాల ఫలితాలు లబ్ధిదారులకు అందుతాయన్నారు. ప్రాధాన్యతా పథకాల అమలుపై రెండుసార్లు నిర్వహించిన సమీక్షా సమావేశాలు రాష్ట్రాభివృద్ధి దోహదం చేస్తాయన్నారు. కొన్ని శాఖల్లో పథకాలు చురుకుగా అమలు కావడం లేదని తాను జరిపిన జిల్లాల వారీ క్షేత్ర పరిశీలనల్లో వెల్లడైందన్నారు. ఏ శాఖకు చెందిన పథకమైనా దాని ఫలితాలు లబ్ధిదారులందరికీ చేరినప్పుడే ప్రభుత్వ ఉద్దేశం నెరవేరుతుందని చెప్పారు. ప్రస్తుతం పథకాల అమలులో నెలకొన్న ప్రతిష్టంభనను ఆయా శాఖల అధికారులు పరిశీలించి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
టాస్మాక్ ఉద్యోగి కుటుంబానికి రూ.10లక్షలు...
శివగంగ(Sivaganga) జిల్లా పల్లత్తూరు టాస్మాక్ దుకాణంపై పెట్రోలు బాంబుతో జరిపిన దాడిలో హతమైన ఉద్యోగి అర్జునన్ కుటుంబీకులకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రూ.10లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ నెల 3న జరిగిన పెట్రోలు బాంబుదాడిలో అర్జునన్ (46) అనే ఉద్యోగి తీవ్రంగా గాయపడ్డాడని, టాస్మాక్ సంస్థ వెంటనే అతడి చికిత్స కోసం రూ.3లక్షలను మంజూరు చేసిందన్నారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి అర్జునన్ మృతి చెందినట్లు తెలియగానే తీవ్ర దిగ్ర్భాంతి చెందానని స్టాలిన్(Stalin) పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అర్జునన్ కుటుంబీకులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ.10లక్షలను అందించనున్నట్టు తెలిపారు. అంతేకాకుండా ఆయన కుటుంబంలో ఒకరికి కారుణ్య ప్రాతిపదికన ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని పేర్కొన్నారు.
Updated Date - 2023-03-16T10:07:18+05:30 IST