Royal family woman: రాజకుటుంబం మహిళను ఆలయ నుంచి ఈడ్చుకెళ్లారు.. వీడియో వైరల్
ABN, First Publish Date - 2023-09-09T17:35:25+05:30
జన్మాష్టమి సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని పన్నాలో ఒకప్పటి రాజకుటుంబానికి చెందిన మహిళకు ఊహించని అనుభవం ఎదురైంది. బుందేల్‌ఖండ్ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన శ్రీ జుగల్ కిషోర్ ఆలయంలోకి వెళ్లినప్పుడు ఆమెను అధికారులు అడ్డుకోగా, పోలీసులు బలవంతంగా ఆలయం బయటకు ఈడ్చుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
పన్నా: జన్మాష్టమి సందర్భంగా మధ్యప్రదేశ్ (Madhya pradesh) లోని పన్నా(Panna)లో ఒకప్పటి రాజకుటుంబానికి చెందిన మహిళకు (Royal Family woman) ఊహించని అనుభవం ఎదురైంది. బుందేల్‌ఖండ్ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన శ్రీ జుగల్ కిషోర్ ఆలయంలోకి వెళ్లినప్పుడు ఆమెను అధికారులు అడ్డుకోగా, పోలీసులు బలవంతంగా ఆలయం బయటకు ఈడ్చుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఏటా సంప్రదాయ రీతిలో శ్రీ జుగల్ కిషోర్ ఆలయంలో అర్థరాత్రి జన్మాష్టమి వేడుకలు జరుగుతుంటాయి. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు రాజకుటుంబం మహిళ జితేశ్వరి దేవి ఆలయంలోకి వెళ్లినప్పుడు అధికారులు నిబంధనల పేరుతో అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని ఆలయ ఆవరణ నుంచి వెళ్లిపొమ్మనడంతో జితేశ్వరి దేవి తిరిగి వాదనకు దిగారు. దాంతో పోలీసులు ఆమెను ఆలయం నుంచి బయటకు లాక్కుంటూ వెళ్లారు.
కాగా, నిబంధనలకు విరుద్ధంగా గర్భగుడిలోకి ప్రవేశించేందుకు జితేశ్వరి దేవి ప్రయత్నించినట్టు అధికారులు తెలిపారు. పూజాకార్యక్రమాలు జరుగుతుండగా తాను స్వయంగా హారతి ఇస్తానంటూ ఆమె పట్టుబట్టారని, గర్భగుడిలోకి చొరబడే ప్రయత్నం చేశారని తెలిపారు. ఆ గందరగోళంలోనే ఆమె కాలుజారి పడినట్టు చెప్పారు. కాగా, జితేశ్వరి దేవి మద్యం మత్తులో ఆలయ అధికారులతో గొడవకు దిగారని కొందరు భక్తులు ఆరోపించారు.
పోలీసు సూపరింటెండెంట్ వివరణ...
ఈ ఘటనపై పన్నా పోలీస్ సూపరింటెండెంట్ సాయి కృష్ణ ఎస్ తోట వివరణ ఇచ్చారు. ఆలయ సంప్రదాయం ప్రకారం, రాజకుటుంబంలోని మగవారు మాత్రమే జన్మాష్టమి రోజున చీపురుకట్టతో ఆలయాన్ని శుభ్రపరచే తంతులో పాల్గొనేందుకు అనుమతి ఉంటుందని చెప్పారు. జితేశ్వరి దేవి కుమారుడు ఆలయానికి రాలేకపోవడంతో ఆమె ఆలయానికి వచ్చారని అన్నారు. కాగా, ఆలయ నిబంధనల ఉల్లంఘన కింద జితేశ్వరి దేవిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
జితేశ్వరి దేవి సంచలన ఆరోపణ
పన్నాలో రక్షణ సంక్షేమ నిధి నుంచి 65,000 కోట్ల నిధులు దుర్వినియోగం జరిగినట్టు జితేశ్వరి దేవి ఆరోపించారు. ఈ కుంభకోణంపై తాను నిలదీసినందుకే తనను ఆలయంలో అడ్డుకుని, అరెస్టు చేశారని చెప్పారు.
Updated Date - 2023-09-09T17:35:25+05:30 IST