మరీ ఇంత దారుణమా..? తినడానికి తిండి లేక భర్త, తల్లి మృతి.. అంత్యక్రియలకు డబ్బుల్లేకపోవడంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ABN, First Publish Date - 2023-02-14T17:19:27+05:30
సిరి సంపదలకు, పాడి పంటలకు పెట్టిన పేరు భారత దేశం. అలాంటి నేలపై ఆకలి చావుల వార్తలు గుండెల్ని పిండేస్తున్నాయి. తాజాగా చోటుచేసుకున్న ఈ హృదయ విదారకరమైన సంఘటన మనసుల్ని కలిచి వేస్తోంది.
ప్రతి మనిషికి అవసరమైనవి మూడే మూడు. ఒకటి కూడు, రెండు గూడు, మూడు గుడ్డ. ఇవి ప్రతి మనిషికి అవసరం. ఇందులో ఏదిలేకున్నా మనిషి బ్రతకలేడు. మన దేశం అభివృద్ధిలో దూసుకెళ్లిపోతుందని నేతలు ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. ఇలా చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. గానీ వాస్తవంలోకి తొంగి చూస్తే అవన్నీ ఒట్టిమాటలని చెప్పొచ్చు. ఓ వైపు శాస్త్ర, సాంకేతిక, విజ్ఞానంలో దేశం పరుగులు పెడుతోంది. అంతమాత్రమే కాదు సిరి సంపదలకు, పాడి పంటలకు పెట్టిన పేరు భారత దేశం (India). అలాంటి నేలపై ఆకలి చావుల వార్తలు గుండెల్ని పిండేస్తున్నాయి. తాజాగా చోటుచేసుకున్న ఈ హృదయ విదారకరమైన సంఘటన మనసుల్ని కలిచి వేస్తోంది.
తినడానికి తిండి లేక ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన సంఘటన తమిళనాడు (Tamil Nadu)లోని ఈరోడ్ జిల్లా (Erode district) లో చోటుచేసుకుంది. ఆకలితో అలమటిస్తూ భర్త, తల్లి ప్రాణాలు కోల్పోయారు. అటు తర్వాత మృతదేహాల (bodies)ను పాతి పెట్టేందుకు కూడా చేతిలో చిల్లిగవ్వ లేక వారం పాటు ఇంట్లోనే పెట్టుకోవాల్సిన దుస్థితి రావడం హృదయాలను పిండేస్తోంది.
ఇది కూడా చదవండి: రోజూ సందడిగా ఉండే ఇంట్లో అంతా సైలెంట్.. రాత్రి 9 గంటల సమయంలో అనుమానంతో పక్కింటి వాళ్లు వెళ్లి చూస్తే..
గోపిచెట్టిపాలయంలోని శాంతి (Shanthi), మోహనసుందరం (Mohanasundaram) దంపతులు. వీరికి మానసిక దివ్యాంగుడైన కుమారుడు శరవణకుమార్, కుమార్తె శశిరేఖ ఉన్నారు. శశిరేఖ పెళ్లయ్యేంత వరకూ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించింది. ఆమె అత్తారింటికి వెళ్లిపోవడంతో కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. కుటుంబ పోషణ భారమైపోయింది. ఇంట్లో శాంతి, ఆమె తల్లి కనకంబాళ్, భర్త, కుమారుడు ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తినడానికి తిండి లేక కుటుంబమంతా పస్తులుంటూ వస్తున్నారు. ఇక అప్పుడప్పుడూ ఇరుగు పొరుగు వారు పెడితే తినడం.. లేదంటే ఆకలితో మాడిపోవడం పరిపాటిగా మారింది. వారం రోజుల క్రితం ఆకలి బాధను భరించలేక తల్లి కనకంబాళ్, భర్త మోహనసుందరం ప్రాణాలు కోల్పోయారు. అనంతరం మృతదేహాలను ఖననం చేయడానికి కూడా శాంతికి స్తోమత లేక పోవడంతో ఇంట్లోనే ఉంచేసింది. దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం అనంతరం ఖననం చేశారు. ఈ హృదయ విదారకరమైన సంఘటన స్థానికులను కలిచి వేసింది. మేకిన్ ఇండియాలో ఇలాంటి ఆకలి చావులు ఇంకెంత కాలం అంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Newly Married Couple: ఈ కొత్త జంటకు దేవుడెంత అన్యాయం చేశాడంటే.
Updated Date - 2023-02-14T17:36:44+05:30 IST