Bottle Guard Carry : సొరకాయ రుచులు ఊహించ తరమా!
ABN , First Publish Date - 2023-12-09T04:03:29+05:30 IST
’తీగ చెట్టుకు తీపి సొరకాయలుండవు కానీ.. ఆ సొరకాయలతో వంట చేస్తే మాత్రం రుచి మాత్రం అదరహో. నీటిశాతం ఎక్కువ
’తీగ చెట్టుకు తీపి సొరకాయలుండవు కానీ.. ఆ సొరకాయలతో వంట చేస్తే మాత్రం రుచి మాత్రం అదరహో. నీటిశాతం ఎక్కువ ఉండే సొరకాయతో చికెన్, మటన్, హల్వాలను ఇట్టే చేసేయవచ్చు. తిన్న తర్వాత మనసొక సొర రాగం పాడక తప్పదు మరి!
సొరకాయ హల్వా
కావాల్సిన పదార్థాలు
సొరకాయ- కేజీ (గ్రేటర్‌తో ఆకుపచ్చగా ఉండే పదార్థాన్ని సన్నగా తురమాలి. లోపల ఉండే తెల్లని పదార్థాన్ని వదిలేయాలి), నెయ్యి- నాలుగు టేబుల్ స్పూన్లు, జీడిపప్పు- 15, కిస్మిస్- 15, పాలు- 2 కప్పులు, చక్కెర- 300 గ్రాములు, యాలకుల పొడి- టీస్పూన్
తయారీ విధానం
ప్యాన్‌లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేయాలి. నెయ్యి కరిగాక జీడిపప్పు, కిస్మిస్ వేసి ఫ్రై చేసుకోవాలి. రంగు మారిన తర్వాత వీటిని ప్లేట్‌లో వేసి పక్కన ఉంచుకోవాలి. ఇందులో సొరకాయ తురుమును వేసి హైఫ్లేమ్‌లో ఉంచి ఐదు నిముషాల పాటు ఉంచాలి. ఇలా చేయటం వల్ల సొరకాయలో నీటి శాతం తగ్గిపోతుంది. ఆ తర్వాత రెండు కప్పులు పాలు పోిసి మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచాలి.
గరిటెతో తిప్పుతూ ఉడికించాలి. పాలన్నీ ఇమిరిపోయేంత వరకూ కనీసం పది నిముషాల పాటు ప్యాన్ మూత ఉంచాలి. అయితే రెండు నిముషాలకు ఒకసారి గరిటెతో తిప్పుతూ ఉడికించాలి. పాలన్నీ క్రమంగా తగ్గిపోతాయి. సొరకాయ బాగా ఉడికి మెత్తగా అవుతుంది. వెంటనే చక్కెర వేసి కలపాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకుని బాగా ఉడికించాలి. హల్వా రెడీ అయినట్లు కనిపిస్తుంది. వెంటనే రెండు టీస్పూన్లు నెయ్యి వేసిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్‌తో పాటు యాలకుల పొడి వేసి బాగా కలపాలి. వీలైతే జీడిపప్పుతో గార్నిష్ చేసుకుని తినాలి. ఎంతో రుచిగా ఉంటుంది.
సొరకాయ మటన్
కావాల్సిన పదార్థాలు
సొరకాయ ముక్కలు- 1 కప్పు, ఉడికించిన మటన్- పావు కిలో, ఉల్లిపాయ- 1 (సన్నగా తరగాలి), నూనె- 3 టేబుల్ స్పూన్లు, అల్లం, వెల్లుల్లి పేస్ట్- టీస్పూన్, ధనియాల పొడి- టీస్పూన్, ఎండుకొబ్బరి- టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్- టీస్పూన్, పసుపు- చిటికెడు, కొత్తిమీర- టేబుల్ స్పూన్, పుదీనా- కొద్దిగా, ఉప్పు- రుచికి తగినంత, టొమాటో పేస్ట్- అరకప్పు
తయారీ విధానం
ముందుగా మటన్‌లో పసుపు, ఉప్పు వేసి రెండు గ్లాసుల నీళ్లు పోసి ఉడకబెట్టుకోవాలి. ఉడికిన మటన్‌ను కప్పులో ఉంచుకోవాలి. ఆ తర్వాత ప్యాన్‌లో టేబుల్ స్పూన్ నూనె వేసి సొరకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. మగ్గిన తర్వాత వీటిని పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్‌లో మిగతా నూనె వేసి తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయటంతో పాటు పుదీనా వేసి కలియబెట్టాలి. అల్లం, వెల్లుల్లి పేస్ట్‌తో పాటు చిటికెడు పసుపు వేసి కలపాలి. రెండు నిముషాల తర్వాత సిమ్‌లో ఉంచుకుని టొమాటో పేస్ట్ వేసి గరిటెతో కలపాలి. మటన్ ముక్కలు వేసి నిముషం పాటు కలిపి ప్యాన్ మూత పెట్టుకోవాలి. బాగా మగ్గుతుంది. ఇందులో పచ్చిమిర్చి వేసి కలపాలి. సరిపడ ఉప్పు వేసి బాగా కలపాలి. ఇందులో పులుసుకు సరిపడ నీళ్లు పోసుకోవాలి. ఇందులో కొబ్బరి పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలపాలి. చివరగా వేయించిన సొరకాయ ముక్కలు వేసి ప్యాన్ మూత ఉంచాలి. కొద్దిసేపటి తర్వాత చూస్తే ముక్కలు బాగా ఉడుకుతాయి. దీన్ని సర్వ్ చేసుకునే ముందు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి.
సొరకాయ చికెన్
కావాల్సిన పదార్థాలు
సొరకాయ ముక్కలు- 1 కప్పు, చికెన్- పావు కిలో, ఉల్లిపాయ- 1 (సన్నగా తరగాలి), తరిగిన టొమాటోలు- 2, పచ్చిమిర్చి-2 (సన్నగా తరగాలి), అల్లం, వెల్లుల్లి పేస్ట్- 1 టీస్పూన్, కారం- తగినంత, పసుపు- కొద్దిగా, ఉప్పు- తగినంత, జీలకర్ర పొడి- టీస్పూన్, ధనియాల పొడి- టీస్పూన్, గరం మసాలా- టీస్పూన్, కొత్తిమీర- కొద్దిగా, నూనె- 3 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం: ప్యాన్‌లో నూనె వేసి కాస్త వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేయాలి. కడిగి పెట్టుకున్న చికెన్ వేసిన తర్వాత వెంటనే పసుపు వేయాలి. దీన్ని గరిటెతో మూడు నిముషాలు కలిపిన తర్వా సొరకాయ ముక్కలు వేయాలి. సొరకాయ ముక్కల్లో నీళ్లు ఉంటాయి కాబట్టి ప్రత్యేకంగా నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. కొద్దిసేపు కలిపాక ప్యాన్ మూత పెట్టి చికెన్ ముక్కలు ఉడికేంత వరకూ కుక్ చేయాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు వేసి ప్యాన్‌పై మూత ఉంచాలి. కొద్దిసేపు కుక్ చేయాలి. టొమాటోలు మగ్గిన తర్వాత ప్యాన్ మూత తీసి కారం, ఉప్పు వేసి కలిపాక.. ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి. ఆ తర్వాత గరం మసాలా వేసి కలపాలి. ఇందులో కొద్దిగా నీళ్లు పోసిన తర్వాత కొత్తిమీర వేయాలి. కొద్దిసేపు ఉంచిన తర్వాత దీన్ని సర్వ్ చేసుకోవాలి. రైస్ లేదా చపాతీలోకి సొరకాయ చికెన్ బావుంటుంది.