అనువాద రచనలతో సాహితీమతల్లికి గౌరీ కృపానందన్ ఎనలేని సేవలు
ABN, First Publish Date - 2023-03-18T19:21:27+05:30
ఆ సంఘటన ఆమెను అనువాద రచయిత్రిగా శిఖరాలను అధిరోహించేందుకు శ్రీకారం చుట్టింది. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకునేందుకు దోహదం చేసింది...
చెన్నై (వేళచ్చేరి)
యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనలు కొందరికి మనసు మీద బలంగా ముద్ర వేస్తాయి. అవి వారి జీవితాలని మలుపు తిప్పుతుంటాయి. అనుకోకుండా చదివిన అనువాద కథ, దాని మూల కథని చదివిన అనుభూతి కలిగించకపోవడం ఆమెను అనువాద రచయిత్రిని చేసింది. ఆ సంఘటన ఆమెను అనువాద రచయిత్రిగా శిఖరాలను అధిరోహించేందుకు శ్రీకారం చుట్టింది. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకునేందుకు దోహదం చేసింది. ఆ అనువాద రచయిత్రి... కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత... గౌరీ కృపానందన్. ఆమె ఈనాటి మన ‘తరుణి’. ఆమె అనువాద రచనా ప్రస్థానం నేటి తమిళనాడు ఆంధ్రజ్యోతి ‘తరుణి’ ఫీచర్‌లో...
గౌరి జన్మించింది తమిళనాడులోని దిండుగల్‌లో. తండ్రి కృష్ణమూర్తి. తల్లి రాజ్యలక్ష్మి. పుట్టింది తమిళనాడైనా పెరిగింది మాత్రం ఆంధ్రప్రదేశ్‌లోనే. తండ్రి ఉద్యోగరీత్యా హైదరాబాద్, భువనగిరి, నల్గొండ తదితర ప్రాంతాల్లో ఉండడంతో ఆమె పాఠశాల విద్యాభ్యాసం తెలుగు మీడియంలో తెలుగు స్కూళ్లలోనే జరిగింది. ఆశ్చర్యం ఏమిటంటే ఆమె మాతృభాష తమిళం అయినా తెలుగు భాషే సొంత భాష అన్నట్లుగా సొంతం చేసుకున్నారు. బాల్యం నుంచి తెలుగు మేగజీన్లు, కథల పుస్తకాలు చదవడం అలవాటు కావడంతో ఆ భాషపై పట్టు సాధించారు. తమిళ భాష ఇంట్లో మాట్లాడుకోవడం వరకే పరిమితమైంది. పిల్లలకు చదువులో సాయపడడం కోసం ఆమె తల్లి కూడా తెలుగు నేర్చుకోవ డం విశేషం. రచనా వ్యాసంగం ప్రారంభించాలనుకున్న సమయం లో గౌరి తమిళ భాషను చదవడం, రాయడం నేర్చుకొని అనువాద రచనలు చేసే స్థాయికి ఎదిగారు.
రచనా వ్యాసంగం ప్రారంభమైంది ఇలా...
‘‘నేను అనువాద రచయిత్రిని కావాలని ముందుగా అనుకోలేదు. అది యాదృచ్ఛికంగా జరిగింది. ఒకసారి ఒక అనువాద కథను చదివా. దాని మూలంలో కూడా చదివి ఉండడం వలన అనువాద కథ మనసును హత్తుకోలేదు. మూల కథ ఇచ్చిన అనుభూతి అనువాద కథ ఇవ్వకపోవడం కొంత అసంతృప్తికి కారణమయింది. ఒకప్పుడు శరత్ నవలలు తెలుగులోనే రాసినవేమో అన్న అనుభూతి కలిగేది. మక్కికి మక్కి అనువాదం కాకుండా మనసుకు హత్తుకునే రీతిలో అనువాదం సాగేది. నేను చదివిన అనువాద కథ నాకు ఆ అనుభూతి కలిగించకపోవడంతో మూల కథతో సమానంగా ఉండే అనువాద రచన చేయాలన్న తపన నాలో మొదలైంది. అనువాద రచనా రంగంలో ప్రవేశించేందుకు కారణమైంది అలా నా అనువాద రచనకు ఇది ప్రేరణ అయింది’’ అని తన అనువాద రచనా ప్రస్థానానికి అంకురార్పణ గురించి గౌరి తెలిపారు. అంతకు ముందు ‘వనిత’ పత్రిక, తమిళ్ మాసపత్రిక ‘మంగైయర్ మలర్’లో వంటింటి చిట్కాలు రాశారు. తమిళ్, తెలుగు, హిందీ, ఇంగ్లీషు ఆమెకు తెలిసిన భాషలు. 25 సంవత్సరాలకు పైగా తమిళం నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి తమిళంలోకి అనువాద రచనలు చేస్తూ సాహితీ తల్లికి ఎనలేని సేవ చేస్తున్నారు.
అనువాద రచనా రంగంలో...
యండమూరి వీరేంద్రనాథ్ నవలలు 45 దాకా, యద్ధనపూడి సులోచనారాణి రచించిన వాటిలో 20 నవలలను, డి.కామేశ్వరి రాసిన నవలల్లో మూడింటిని, ఓల్గా 5 నవలలు, తదితరులవి 80కి పైగా నవలలను తెలుగు నుంచి తమిళ భాషలోకి అనువదించారు గౌరీ కృపానందన్.
చాగంటి సోమయాజులు రాసిన ‘కథల సంకలనం’, శ్రీవల్లీ రాధిక, విహారి, సింహప్రసాద్, కవనశర్మ, వారణాసి నాగలక్ష్మి, పీఎస్ నారాయణ తదితరుల కథలు యాభైకి పైగా గౌరీ అనువదించారు. యండమూరి వీరేంద్రనాఽథ్ కథ ‘ది బెట్’ ఆమె మొదటి అనువాద కథ. మొదటి అనువాద నవల యండమూరి రాసిన ‘అంతర్మథనం’ నవల.
తమిళం నుంచి ...
తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్ రాసిన నవల అనువాదం ‘పూనాచ్చి ఒక మేక పిల్ల కథ’. సుందరరామస్వామి నవల అనువాదం ‘చింత చెట్టు కథ’. తమిళ అనువాద కథలు, కథల సంకలనం, అళగిరిసామి గారి ‘బహుమతి’, ప్రపంచన్ గారి నవల ‘ఆకాశం నా వశం’ మొదలైనవి తమిళం నుంచి తెలుగుకు అనువదించినవి. ఇంకా 60కి పైగా కథలు తర్జుమా చేశారు. కొండపల్లి కోటేశ్వరమ్మగారి ఆత్మకథ ‘నిర్జన వారధి’ని తెలుగు నుంచి తమిళంలోకి అనువదించారు.
పురస్కారాలు...
2015వ సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం పొందారు గౌరీ కృపానందన్. ఓల్గా రచించిన ‘విముక్త’ కథా సంకలనానికి, దానికి గౌరీ చేసిన తమిళ అనువాద రచనకు ఒకే సంవత్సరం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు రావడం విశేషం. మూలరచనకు, అనువాద రచనకు ఒకేసారి బహుమతి రావడం అభినందనీయం. 2016లో స్పారో అవార్డు, 2021లో కృష్ణా జిల్లా రచయితల సంఘం అనువాద పురస్కారం, తిరుప్పూర్ లయన్స్‌క్లబ్ ‘శక్తి’ అవార్డు, హైదరాబాద్ లేఖిని అవార్డు మొదలైన ఎన్నో పురస్కారాలు అందుకున్నారు గౌరీ కృపానందన్.
పాల్గొన్న సభలు...
కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయం అనువాద సదస్సులలో రెండు సార్లు గౌరవ అతిథిగా పాల్గొన్నారు. సేలంలో పెరియార్ యూనివర్శిటీలో ‘తెలుగు-తమిళ్ ట్రాన్స్‌లేషన్ వర్క్‌షాప్’లో కూడా గౌరీ కృపానందన్ పాల్గొన్నారు. యూఎస్‌లో తానా సభలలో కాలిఫోర్నియా సదస్సులలో అనువాద రచయిత్రిగా పాల్గొన్నారు.
కుటుంబం: గౌరి భర్త కృపానందన్ బ్యాంకులో ఉన్నతోద్యోగిగా పదవీ విరమణ పొందారు. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు. గౌరీ కృపానందన్ అనువాదం చేసిన రాజనారాయణన్ గారి కథలు ‘గోమతి’, ‘మోడు బారిన చెట్టు’... ఆంధ్రజ్యోతిలో ప్రచురితం కావడం విశేషం.
‘తరుణి’తో సంభాషిస్తూ...
గౌరీ కృపానందన్ తన మనోభావాలు ఇలా పంచుకున్నారు. ‘‘ప్రతి మహిళ ఇల్లు చక్కదిద్దుకుంటూనే తన ప్రవృత్తికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. రెండింటిని సమన్వయపరచుకోవాలి. ప్రవృత్తిని పండించుకున్నప్పుడు కలిగే మానసిక ఆనందం వెలకట్టలేనిది’’. సాహిత్య అకాడమీ గురించి.. ‘‘అవార్డు వచ్చినందుకు చాలా సంతోషం. అయితే దానితో నా బాధ్యత కూడా పెరిగింది. పాఠకులకు నచ్చే, వారు మెచ్చే రచనలను అనువాదం చెయ్యాలి’’ అన్నారు గౌరీ కృపానందన్.
Updated Date - 2023-03-18T19:28:11+05:30 IST