USA Ambajipeta : అమెరికాలో అంబాజీపేట కబుర్లు !
ABN, First Publish Date - 2023-10-31T08:50:20+05:30
ప్రపంచం సెల్‌ఫోనంతగా మారిపోయింది కానీ.. మనుషుల మధ్య బంధాలు మాత్రం ఆకాశమంత దూరమయ్యాయి. ఒకే ఇంట్లో ఉంటున్నా చాలామందికి మాట్లాడే తీరిక కూడా ఉండటం లేదు.
ఉద్యోగాల్లో బిడ్డలు.. సేవామార్గంలో తల్లిదండ్రులు
అరుగు మీద ముచ్చట్లు.. పార్కుల్లో కాలక్షేపం
పరిచయాలు పెంచుకోవడానికి, సాయమందించడానికి ప్రత్యేకంగా అసోసియేషన్
తూర్పు గోదావరి జిల్లా వాసుల వినూత్న సేవా మార్గం
ఇప్పుడన్నీ న్యూక్లియర్ ఫ్యామిలీలే ( Nuclear families ) ! నాలుగు గోడల మధ్యనే నలుగురూ కాలక్షేపం చేస్తున్నారు. ఎప్పుడో ఒకప్పుడు హాస్పిటల్ అనో, లేదంటే మనవళ్లను చూడాలనో.. ఊళ్ల నుంచి పెద్దవాళ్లు వస్తుంటారు. అయితే.. పిల్లలు ఆఫీసులు, స్కూళ్లకు వెళ్లగానే ఇంట్లో ఒంటరిగా ఇబ్బంది పడుతుంటారు. సిటీలో ఉన్నంత కాలం ఏదో కోల్పోయినట్లే ఉంటుంటారు. మూడు నాలుగు రోజులు చూసి, ఈ కాంక్రీట్ జంగిల్‌లో ఉండే కంటే.. ఊరెళ్లిపోవడం బెటర్ అంటూ ప్రయాణానికి సిద్ధమవుతుంటారు. కొంతమంది మాత్రం, పార్కుల్లో వాకింగ్, ఇంకాస్త దూసుకుపోయే వారైతే సిటీ టూర్‌లతో కాలక్షేపం చేస్తుంటారు.
మన భాష, మన యాస, మన వేషం ఉన్న చోటనే ఈ పరిస్థితి... మరి మనది కాని దేశంలో, మనకు తెలియని మనుషుల మధ్య, మనకు రాని భాషలో మాట్లాడాల్సిన వేళ?.. ‘అబ్బే... మీరేమీ ఇబ్బంది పడకండి. మేమున్నాం కదండీ!.. ఇదిగో మీ అబ్బాయి ఆఫీసుకు వెళ్లినవెంటనే ఆ పార్క్‌కు వచ్చేయండి... మనోళ్లు చాలామంది వస్తారు’ అని భరోసా కల్పిస్తే..! అవును.. అవోండలే వాలర్ రిజర్వ్ వెస్ట్ రిడ్జ్ (ఏవీఆర్‌డబ్ల్ల్యూ) పేరెంట్స్ అసోసియేషన్ సభ్యుల పని అదే!!. అమెరికాలోని డల్లాస్‌తో మొదలుపెట్టి వీరు పలు ప్రాంతాల్లో ఇండియా నుంచి చుట్టపు చూపుగా వచ్చిన తల్లిదండ్రులకు అవసరమైన సహాయం చేస్తూ ఆకట్టుకుంటున్నారు.
(హైదరాబాద్ సిటీ-ఆంధ్రజ్యోతి): ప్రపంచం సెల్‌ఫోనంతగా మారిపోయింది కానీ.. మనుషుల మధ్య బంధాలు మాత్రం ఆకాశమంత దూరమయ్యాయి. ఒకే ఇంట్లో ఉంటున్నా చాలామందికి మాట్లాడే తీరిక కూడా ఉండటం లేదు. ఇక డబ్బు సంపాదనే ధ్యేయంగా యూఎస్ ( USA ) కు వెళ్లిన కుర్రకారు, వారాంతాల్లో మాత్రమే తల్లిదండ్రులతో కలిసి తిరుగుతామంటే, మరి మిగిలిన రోజుల్లో ఏం చేయాలి? ఇంట్లో ఒంటరిగా ఉండలేరు.. అలాగని తెలియని చోట రోడ్ల మీదకు వెళ్లలేరు.. అలాంటప్పుడు మనకు తెలిసిన వారు కాకపోయినా ఫర్వాలేదు కానీ, మన భాష వారు కనబడితే చాలనుకుంటారు. అలాంటి వారికి అండగా ఉంటోంది అవోండలే వాలర్ రిజర్వ్ వెస్ట్ రిడ్జ్ (ఏవీఆర్‌డబ్ల్ల్యూ) పేరెంట్స్ అసోసియేషన్.
అసోసియేషన్ ఏర్పడింది ఇలా!
తెలుగు రాష్ట్రాల వాసులు భూతల స్వర్గంగా భావిస్తున్న అమెరికా సంయుక్త రాష్ట్రాలకు వెళ్లడం ఇటీవలి కాలంలో మరింతగా పెరిగిందన్నది తెలిసిందే! విద్యార్థి వీసాల సంగతి ఎలాగున్నా తమ పిల్లల దగ్గరకు వెళ్లి ఆరు నెలలు గడిపి రావడమనేది తెలుగు రాష్ట్రాలలో ( Telugu States ) చాలామంది తల్లిదండ్రులకు ఒక గౌరవంగా మారిపోయింది. ‘మా పిల్లలిద్దరూ అమెరికా ( America ) లోనే ఉన్నారు. వచ్చే నెల అక్కడకు వెళ్తున్నామ’నే మాటలు తెలుగు రాష్ట్రాలలో సర్వసాధారణంగా మారిపోయాయి. ఇలా వెళ్లిన వారు అమెరికాలో తమ పిల్లల దగ్గర ఆరు నెలలు గడిపి రావడం వరకూ మాత్రమే పరిమితం కాకుండా అసోసియేషన్‌లనూ ప్రారంభిస్తున్నారు. అలా ఏర్పడినదే ఏవీఆర్‌డబ్ల్యూ అని చెబుతున్నారు. అసోసియేషన్ వ్యవస్థాపకులు, అంబాజీపేట ( Ambajipeta) కు చెందిన మేడిది కాశీ. 2019లో కేవలం 25 మంది సభ్యులతో ఏర్పాటైన ఈ అసోసియేషన్‌లో ప్రస్తుతం 100 మందికి పైగా క్రియాశీల సభ్యులుంటే, పిల్లల దగ్గరకు వచ్చి పోయే వారు ఆ తరువాత కూడా అసోసియేషన్‌తో సంబంధ బాంధవ్యాలు కొనసాగిస్తుండటం గమనార్హం.
ఇటీవలి కాలంలో యూఎస్ వస్తున్న వారి సంఖ్య పెరిగింది. పిల్లలు ఆఫీసులకు వెళ్లిన తరువాత ఇంట్లో ఒంటరిగా ఉండటం వీరికి కష్టమే! అందునా తెలుగు వారికి నలుగురితోనూ కలిసుండటమంటే ఇష్టం. అందుకే, పిల్లలు ఆఫీసులకు వెళ్లిన వెంటనే తల్లిదండ్రులు దగ్గరలోనే ఉన్న పార్కులకు వచ్చేస్తారు. నిత్యం సమీప పార్క్‌ల్లో కలుసుకోవడం, ఆత్మీయంగా పలకరించుకోవడం..కష్టసుఖాలు మాట్లాడుకోవడం, వీలైతే బంధాలు.. బాంధవ్యాలు కలుపుకోవడం!. రోజువారీ మీటింగ్‌లు ఎలాగున్నా, వారాంతాల్లో మాత్రం గెట్ టు గెదర్‌లు ఉంటాయి. అక్కడ మరింతగా పరిచయాలు పెంచుకోవడం సాధ్యమవుతుందంటున్నారు అంబాజీపేట వాసి కాశీ.
కబుర్లు.. కలుపుకోవడాలేనా... ?
అమెరికాలో అంబాజీపేట కబుర్లు మాత్రమేనా, ఇంకేమైనా చేస్తున్నారా.. అని అంటే, ‘చేయకపోవడమేంటండీ, వీలైనంత ఎక్కువగానే సేవా కార్యక్రమాలను చేస్తున్నామ’న్నారు కాశీ. తమ అసోసియేషన్ ద్వారా తొలిసారి యుఎస్‌ఏ వచ్చిన తెలుగు వాళ్లకు పలు అంశాల పట్ల అవగాహన కల్పించడంతో పాటుగా వారికి బీమా తదితర అంశాల్లో సహాయపడుతున్నామన్నారు అసోసియేషన్‌లో సభ్యులైన వెంకటరావు, రమణయ్య, జోగారావు. దీనితో పాటుగా వివాహ పరిచయ వేదికలనూ ఏర్పాటు చేస్తున్నామని, ఈ సేవా కార్యక్రమాలను ఇండియాలో కూడా విస్తరించే ఆలోచనలో ఉన్నామని తెలిపారు.
Updated Date - 2023-10-31T08:52:36+05:30 IST