Bathukamma: దుబాయిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ABN, First Publish Date - 2023-10-19T12:20:02+05:30
దుబాయిలో తెలంగాణ ప్రవాసీయులు బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. పరాయి గడ్డపై పరిమళ పూల వనాలు, అరబ్బు నాట ఆడబిడ్డల ఆటపాటల కోలాటాలు, అడవి పూల బతుకమ్మ వేడుకలతో దుబాయిలోని ప్రముఖ క్రీడా స్టేడియం కిక్కిరిసిపోయింది.
దుబాయిలో పరిమళ పూల వనాలు
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: దుబాయిలో తెలంగాణ ప్రవాసీయులు బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. పరాయి గడ్డపై పరిమళ పూల వనాలు, అరబ్బు నాట ఆడబిడ్డల ఆటపాటల కోలాటాలు, అడవి పూల బతుకమ్మ వేడుకలతో దుబాయిలోని ప్రముఖ క్రీడా స్టేడియం కిక్కిరిసిపోయింది. బతుకమ్మ చుట్టు చేరి గౌరమ్మ పాటలు పాడిన వారు కొందరయితే, స్టేడియంలో అడుగు పెట్టె స్ధలం లేక వెనుదిరిగిన వారు అనేక మంది. తెలంగాణ ఇంటింటా రంగురంగుల పూలతో జరుపుకోనే బతుకమ్మ పండుగను తెలంగాణ ప్రవాసీయులు పెద్ద సంఖ్యలో నివసించే దుబాయిలోనూ ఘనంగా నిర్వహించారు. 15 సంవత్సరాల క్రితం బతుకమ్మ లేదా మరేతర తెలంగాణ సంప్రదాయ పండుగలను నిర్వహించడానికి సంకోచించే స్ధాయి నుండి నేడు సగర్వంగా తెలంగాణ సంస్కృతికు ప్రతీక అయిన బతుకమ్మను అత్యంత వైభవంగా నిర్వహించే స్థాయికి చేరడం గర్వకారణం. దుబాయితో పాటు యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్‌లోని అన్ని ప్రాంతాలలో కనువిందులుగా జరుపుకోవడంతో ఆత్మగౌరవంతో పాటు ఆత్మ విశ్వాసం పెరిగింది.
తెలంగాణ ప్రవాసీ ప్రముఖులు దుబాయి తెలుగు అసోసియేషన్ సౌజన్యంతో నిర్వహించిన బతుకమ్మ పోటీలు అంగరంగ వైభవంగా జరిగాయి. బతుకమ్మ పాటలతో, నృత్యాలతో ఆడపడుచులందర్ని గాయని మధుప్రియ ఉత్తేజపరిచారు. ఇక తన మధుర స్వరంతో గాయకుడు అష్ట గంగాధర్ ఆలపించిన గీతాలు సభికులను ఉర్రూతలూగించాయి. తమ వాగ్దాటి, సన్నివేశాల సందర్భానుసారం స్రవంతి చేసిన వ్యాఖ్యాలు కూడా అందర్ని ఆకట్టుకున్నాయి. దుబాయిలో బతుకమ్మను ఈ సారి మరింత ఘనంగా నిర్వహించాలనే దృఢ సంక్పలంతో జగిత్యాలకు చెందిన ఉట్నూరి రవి అన్ని తానై ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే దుబాయి తెలుగు అసోసియేషన్ సభ్యులు పూర్తి సహకారమందించారు. యూఏఈ చరిత్రలోనే తొలిసారి 9 అడుగుల బతుకమ్మ రూపొందించడం ఒక మరుపురాని అనుభూతి అని రవి పేర్కొన్నారు.
తెలంగాణ సంప్రదాయం కులమతాలకు అతీతంగా అందరిదని నిరూపిస్తూ తెలుగు అసోసియెషన్ ఉపాధ్యక్షుడు మసియోద్దీన్ స్వాగతోపన్యాసంతో మోదలయిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ ప్రవాసీయులు కూడ ఉత్సహాంగా పాల్గోంటూ పూర్తి సహాకారంతో తమ పెద్ద మనస్సును చాటారు. తెలుగు అసోసియేషన్ పక్షాన బలుస వివేకానంద, డైరెక్టర్ వెంకట సురేశ్, ఫహీం, నూకల మురళీ కృష్ణ, సుంకు సాయిప్రకాశ్, దామర్ల శ్రీధర్, యెండూరి శ్రీనివాస్, లత, సౌజన్య, విమల, ఉష, విజయ భాస్కర్, భీం శంకర్, శరత్ చంద్ర, చైతన్య, శివ, మోహన్ కృష్ణా బతుకమ్మ నిర్వహణను సమన్వయం చేశారు. ఈ వేడుకలకు ఆరియల్ కన్సల్టింగ్ ప్రధాన సమర్పకులుగా.. ట్రాన్స్ ఏసియా (ప్లాటినియం), యస్ఆర్ఆర్ బిల్డింగ్ మెటెరియల్స్, మలబార్ గోల్డ్ (గోల్డ్) మరియు ఇతర వాణిజ్య సంస్ధలు స్పాన్సర్లుగా వ్యవహరించారు.
Updated Date - 2023-10-19T12:20:02+05:30 IST