Cold icy winds: గడ్డకట్టిన అగ్రరాజ్యం.. చంపేస్తున్న మంచు.. అసలు అమెరికాలో ఏం జరుగుతుంది..!
ABN, First Publish Date - 2023-02-05T07:59:44+05:30
ఈశాన్య అమెరికా రాష్ట్రాలు శీతలగాలులతో గజగజలాడుతున్నాయి.
కనీవిని ఎరుగని స్థాయిలో కోల్డ్ బ్లాస్ట్
మౌంట్ వాషింగ్టన్‌లో -76 డిగ్రీలు
న్యూయార్క్ , 6 రాష్ట్రాల్లో తీవ్ర గాలులు!
న్యూయార్క్: ఈశాన్య అమెరికా రాష్ట్రాలు శీతలగాలులతో గజగజలాడుతున్నాయి. గంటకు 140 కి.మీ. వేగంతో ఆర్కిటిక్ నుంచి వీస్తున్న అతి బలమైన చలి గాలులతో న్యూయార్క్ సహా ఏడు రాష్ట్రాలు గడ్డకట్టుకుపోయాయి. మౌంట్ వాషింగ్టన్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో -76 డిగ్రీలకు పడిపోయాయి. శనివారం రాత్రి ఈ పరిస్థితి వచ్చిందని నేషనల్ వెదర్ సర్వీస్ (NWS) తెలిపింది. ఇదివరకు -74 డిగ్రీలే అత్యంత కనిష్ట రికార్డుగా ఉండేది. ఇప్పుడు ఆ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. మిగతా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత మైనస్ 43 డిగ్రీల సెల్సియస్‌కి పడిపోయింది. గంటకు 177 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలుల కారణంగా అమెరికన్లు గడ్డకట్టుకుపోతున్నారు. కెనడా సరిహద్దులో దక్షిణాన ఉన్న ఫ్రెంచ్ విల్లే పట్టణంలో ఉష్ణోగ్రత మైనస్ 51 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.
పైచిత్రంలో తీవ్రమైన చలిగాలులతో మౌంట్ వాషింగ్టన్‌లోని ఓ పరిశోధన కేంద్రం పూర్తిగా మంచుతో కప్పబడిపోవడం మనం గమనించవచ్చు. న్యూయార్క్ రాష్ట్రంలో అతిశీతల గాలులు వీస్తున్నాయి. విండ్ చిల్ వార్నింగ్ జారీ చేశారు. న్యూయార్క్ నగరంలో కోడ్ బ్లూ అమల్లోకి వచ్చింది. కోడ్ బ్లూ అంటే.. ఎవరైనా సరే, షెల్టర్ లేకుండా బయట ఉండనివ్వరు. అలా ఎవరైనా ఉంటే.. వారికి అధికారులు షెల్టర్ ఇస్తారు. న్యూయార్క్‌లో కొంతమంది అడుక్కునేవారు షెల్టర్ లేకుండా జీవిస్తుంటారు. అలాంటి వారికి ఇప్పుడు తగిన ఏర్పాట్లు ఉంటాయి. మసాచుసెట్స్, కనక్టికట్, రోడ్ ఐలాండ్, న్యూహ్యాంప్‌షైర్, వెర్మోంట్, మెయిన్ రాష్ట్రాల్లో ఉన్న సుమారు 1.6 కోట్ల మంది చలికి వణికిపోతున్నారు. బోస్టన్, వార్‌సెస్టర్, మసాచుసెట్స్, న్యూ ఇంగ్లాండ్ లాంటి పట్టణాల్లో పాఠశాలలు పూర్తి మూతపడ్డాయి.
1982, 1988లో ఇలాగే ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోయాయి. మళ్లీ ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది. చాలా వాతావరణ కేంద్రాల్లో దశాబ్ద కాలంలో కనిష్ట ఉష్ణోగ్రతలు ఇప్పుడే నమోదవుతున్నాయి. అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దనీ.. ఒకవేళ వచ్చినా.. తల నుంచి పాదం వరకూ పూర్తిగా క్లాత్స్ కప్పుకొని మాత్రమే రావాలని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రాణాలు తీసేంత దారుణ చలి బయట ఉందని తెలిపారు.
Updated Date - 2023-02-05T08:32:26+05:30 IST