సౌదీ అరేబియాలో ఓ తెలుగు మహిళకు అరుదైన గౌరవం.. 17 ఏళ్లుగా ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంటే ఇన్నాళ్లకు..
ABN, First Publish Date - 2023-03-02T17:10:37+05:30
సౌదీ అరేబియాలోని రియాధ్ నగరంలోని కింగ్ ఫహాద్ మెడికల్ సిటీలోని అత్యవసర విభాగంలో నర్సింగ్ విభాగానికి లక్ష్మి దేవి అధిపతిగా పనిచేస్తున్నారు. ఏటా అయిదు లక్షల ఔట్ పేషంట్లు, 30 వేల ఇన్ పేషంట్లతో 1200 బెడ్ల సామర్ధ్యం కల్గిన ఆస్పత్రి అది. ఆ ఆస్పత్రిలోని భారతీయ నర్సులు చాలా మంది పనిచేస్తూ ఉన్నారు
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: సౌదీ అరేబియాలో ఓ తెలుగు మహిళకు అరుదైన గౌరవం లభించింది. రోగులకు అత్యున్నత సేవలు అందించినందుకు గానూ అంతర్జాతీయంగా డేసీ(Daisy Award - డీసిస్ అటాకింగ్ అండ్ ఇమ్యూన్ సిస్టమ్) అవార్డును ఇస్తూ ఉంటారు. ఆ అవార్డును వైద్య విభాగంలో పనిచేసే నర్సులంతా అత్యున్నతమైనదిగా భావిస్తుంటారు. అలాంటి ప్రతిష్టాత్మకమైన అవార్డును సౌదీ అరేబియాలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో పని చేసే కడప జిల్లా మద్దనూర్ కు చెందిన రాచమల్లు లక్ష్మీదేవికు ప్రదానం చేశారు.
సౌదీ అరేబియాలోని రియాధ్ నగరంలోని కింగ్ ఫహాద్ మెడికల్ సిటీలోని అత్యవసర విభాగంలో నర్సింగ్ విభాగానికి లక్ష్మి దేవి అధిపతిగా పనిచేస్తున్నారు. ఏటా అయిదు లక్షల ఔట్ పేషంట్లు, 30 వేల ఇన్ పేషంట్లతో 1200 బెడ్ల సామర్ధ్యం కల్గిన ఆస్పత్రి అది. ఆ ఆస్పత్రిలోని భారతీయ నర్సులు చాలా మంది పనిచేస్తూ ఉన్నారు. అందరితోనూ లక్ష్మీదేవి కలుపుగోలుగా ఉంటూ, రోగులకు సేవలు చేస్తూ అత్యుత్తమ పనితీరును కనపరిచారు. కోవిడ్ కష్ట కాలంలో అనేక మంది భారతీయులకు ఆమె సేవలందించారు.
అనేక మంది నిరుపేదలకు కరోనా పట్ల అవగాహన కల్పించి వారిలో మనోస్ధైర్యాన్ని నింపి వారి ప్రాణాలను కాపాడారు. గతంలో 33 రోజులు ఐసీయూలో గడిపిన ఒక విదేశీ రోగికి ఆమె అందించిన సేవను చూసి అంతా అబ్బురపడ్డారు. 17 ఏళ్లుగా రోగులకు ఆమె అందిస్తున్న సేవలను గుర్తించిన సౌదీ అధికారులు ఆమెను ‘డేసీ’ అవార్డుకు ఎంపిక చేశారు. ఆ అవార్డును ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఆమెకు అందించారు. ఇదిలా ఉండగా గతంలో తెలుగు సంఘాలతో పాటు ఆసుపత్రి వర్గాలు కూడా ఆమెను సన్మానించాయి.
Updated Date - 2023-03-02T17:10:37+05:30 IST