Israel-Hamas war: యావత్ అరబ్బు ప్రపంచం ఉలిక్కిపడేలా హమాస్ దాడి.. దహిస్తున్న దారుణ ద్వేషాగ్ని
ABN, First Publish Date - 2023-10-18T07:20:06+05:30
సుదీర్ఘ విరామం తరువాత పశ్చిమాసియా మళ్లీ కల్లోల మయింది. శాంతి చర్చల పేరుతో దశాబ్దాల పాటు కొనసాగిన తతంగంలో చివరకు పాలస్తీనియన్లు సాధించింది ఏమి లేకపోవడంతో పెల్లుబిక్కిన ఆక్రోశంతో ఉగ్రవాదం జడలు విప్పింది.
సుదీర్ఘ విరామం తరువాత పశ్చిమాసియా మళ్లీ కల్లోల మయింది. శాంతి చర్చల పేరుతో దశాబ్దాల పాటు కొనసాగిన తతంగంలో చివరకు పాలస్తీనియన్లు సాధించింది ఏమి లేకపోవడంతో పెల్లుబిక్కిన ఆక్రోశంతో ఉగ్రవాదం జడలు విప్పింది. శాశ్వత విరోధులుగా వ్యవహరిస్తున్న ఇజ్రాయిల్, అరబ్బు దేశాల మధ్య ఇటీవల మెల్లిగా మైత్రి చిగురిస్తోంది. ఈ ఆశావహ పరిస్థితులలో పాలస్తీనా ఉగ్రవాదులు ఉరుము లేని పిడుగులా ఇజ్రాయిల్‌పై భయానక దాడి జరిపారు. ఈ భీకర ఘటన, దానికి ఇజ్రాయిల్ ప్రతిస్పందన పశ్చిమాసియాలో కొత్త కల్లోల పరిస్థితులను సృష్టించాయి.
ప్రపంచ ప్రధాన మతాలు అయిన జుడాయిజం, క్రైస్తవం, ఇస్లాంలకు పాలస్తీనా–ఇజ్రాయిల్ పుట్టినిల్లు. జర్మనీ, ఇతర యూరోపియన్ దేశాలలో యూదుల పట్ల క్రైస్తవులు చాలా అమానుషంగా వ్యవహరించేవారు. ద్వితీయ ప్రపంచ యుద్ధానంతరం అరబ్బు భూభాగంలో యూదులు తమ కొక ప్రత్యేక దేశాన్ని సృష్టించుకున్నారు. అదే ఇజ్రాయిల్. ఏడున్నర దశాబ్దాల క్రితం ఈ ప్రత్యేక యూదు దేశం ఏర్పడింది మొదలు అక్కడ దాడులు, ప్రతిదాడులు నిత్యకృత్యమయ్యాయి. అరబ్బు దేశాలన్నీ ముక్తకంఠంతో తమ భూభాగంలో ఇజ్రాయిల్ ఏర్పాటును ప్రతిఘటించాయి. మహాత్మాగాంధీ కూడ అరబ్బులను సమర్థించారు. కొత్త దేశంపై ఇరుగు పొరుగు అరబ్బు దేశాలన్నీ కలిసికట్టుగా పలుమార్లు దాడి చేశాయి. అయితే ప్రతీ పర్యాయమూ అమెరికా, బ్రిటన్‌ల సహాయంతో ఇజ్రాయిల్ తనను తాను కాపాడుకోవడమే కాకుండా అరబ్బు దేశాల భూభాగాలను ఆక్రమించుకుని తన భౌగోళిక వైశాల్యాన్ని రెట్టింపు చేసుకున్నది. 1970వ దశకంలో అమెరికా, బ్రిటన్ దేశాల వైఖరికి వ్యతిరేకంగా అరబ్బు దేశాలు తమ పెట్రోలు విక్రయాలను నిలిపివేశాయి. అమెరికాలో వీధులలోనే వాహనాలు ఆగిపోయాయి! సమస్త దేశాలు ఇంధన కొరతతో అతలాకుతలమయ్యాయి.
ఈజిప్టు గత్యంతరం లేక ఇజ్రాయిల్‌తో శాంతి ఒడంబడిక చేసుకున్నది. ఆ శాంతి ఒప్పందానికి ప్రధాన కారకుడు అయిన ఈజిప్టు అధ్యక్షుడు అన్వర్ సాదత్‌ను ఉగ్రవాదులు కాల్చిచంపారు. తమ భూభాగాలను దురాక్రమించి, తమను అణిచివేయడం పాలస్తీనియన్లను కలచివేసింది. సమస్యకు ఎంతకూ రాజకీయ పరిష్కారం లేకపోవడంతో పాలస్తీనా పోరులో ఉగ్రవాదం పెట్రేగిపోయింది, శక్తిమంతమైన ఇజ్రాయిల్‌ను గెరిల్లా పోరాట విధానంలో పాలస్తీనా యువత ప్రతిఘటించడం మామూలయిపోయింది. ఆ రకంగా ప్రపంచంలో ప్రప్రథమంగా ఇస్లామిక్ ఉగ్రవాదానికి అంకురార్పణ జరిగింది. వాస్తవానికి పాలస్తీనా ఉద్యమ అగ్రనేతలు, మేధావులలో క్రైస్తవులు కూడ కీలకంగా ఉన్నారు. అయినా ఓర్పు నశించిన ముస్లిం యువత ఉగ్రవాద బాట పట్టింది. శాంతిదూత యేసు ప్రభువు జన్మించిన పుణ్యభూమి రణభూమిగా మారింది. ఇది అత్యంత బాధాకరమైన విషయం.
పాలస్తీనా విమోచన ఉద్యమానికి భారత్ కూడా మొదటి నుంచీ సంఘీభావం తెలుపుతూ వచ్చింది. పాలస్తీనా విమోచన సమితి అధ్యక్షుడు యాసర్ అరాఫత్‌కు ఒక దేశాధినేతకు ఇచ్చే గౌరవ మర్యాదలు ఇచ్చేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒక నాయకుడు అప్పట్లో అరాఫత్ సిఫార్సుతో రాజ్యసభ సభ్యత్వాన్ని పొందగలిగారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం అరాఫత్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.
లక్ష్య సాధనకు అహింసామార్గంలో పయనిస్తే లాభం లేదని పాలస్తీనియన్లు గ్రహించారు. మొత్తం అరబ్బు భూ భాగంలో సుప్రతిష్ఠితమైన ఇజ్రాయిల్ తన మేధాపటిమకు తోడుగా అగ్రరాజ్యాల మద్దతుతో అన్ని రంగాలలోనూ పురోగమించింది. 1993లో ఓస్లోలో శాంతి చర్చల అనంతరం ఇజ్రాయిల్‌ను ఒక దేశంగా గుర్తించడానికి పాలస్తీనా విమోచన సంస్థ అంగీకరించింది. ఆ తర్వాత ఇజ్రాయిల్, పాలస్తీనాలను రెండు ప్రత్యేక దేశాలుగా గుర్తించడానికి అరబ్బులూ అంగీకరించారు. అయితే ఓస్లో ఒప్పందానికి విరుద్ధంగా గాజా, వెస్ట్ బ్యాంకులను ఇజ్రాయిల్ మరింతగా ఆక్రమించుకోవడంతో అరబ్బులలో మళ్లీ నైరాశ్యం నెలకొన్నది. ఇజ్రాయిల్‌తో శాంతి ఒప్పందం చేసుకున్న పాలస్తీనా విమోచన సంస్ధ ప్రజలలో పట్టు కోల్పోయింది. ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు దేశీయ రాజకీయాలలో తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికై పాలస్తీనా విమోచన సంస్ధను నిర్వీర్యం చేశారు. ఆయన అతివాద వైఖరితో హమాస్ మరింత బలపడింది.
ఇదిలావుండగా వివిధ అరబ్ దేశాలతో ఇజ్రాయిల్ మైత్రీ సంబంధాలను నెరపడాన్ని పాలస్తీనియన్ అరబ్‌లు హర్షించలేకున్నారు. గల్ఫ్‌లోని బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్‌తో ఇజ్రాయిల్ ఒడంబడికలు కుదుర్చుకున్నది. కీలకమైన సౌదీ అరేబియాతో సంధి చేసుకునేందుకు ఇజ్రాయిల్ సంసిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో యావత్ అరబ్బు ప్రపంచం ఉలిక్కిపడేలా హమాస్ క్షిపణిదాడులతో ఇజ్రాయిల్‌పై విరుచుకుపడింది. రక్తపాతం చిందించింది. తమ దాడులకు ప్రతిగా ఇజ్రాయిల్ పదింతలు రెట్టింపుతో ఎదురు దాడులు చేస్తూ అమాయకులను ఊచకోత కోస్తుందని హమాస్‌కు బాగా తెలుసు, అయినా ఒక ఉగ్రవాద సంస్ధ దాడికి బదులుగా ఒక సార్వభౌమ దేశంగా ఇజ్రాయిల్ అమాయకులపై సంహారకాండతో వ్యక్తమయ్యే సానుభూతి విషయమై హమాస్‌కు స్పష్టమైన అంచనా ఉంది. అందుకే అరబ్బు దేశాలేవీ కూడ హమాస్ దాడిని నేరుగా ఖండించకుండా పాలస్తీనా ప్రజలకు సంఘీభావాన్ని ప్రకటించాయి. హమాస్ దాడిని ఖండించిన భారతదేశం ఆ తర్వాత శాంతి స్ధాపనకై పాలస్తీనాను ఒక ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌కు కట్టుబడి ఉన్నామని ప్రకటించి తన వైఖరిని సవరించుకొంది. వీధులలో వ్యక్తమవుతున్న అరబ్బు ఆగ్రహావేశాల మధ్య ఇజ్రాయిల్‌కు స్నేహ హస్తం అందించడం ఇప్పుడు అరబ్బు పాలకులకు అంత సునాయసం కాదు.
మొహమ్మద్ ఇర్ఫాన్
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
Updated Date - 2023-10-18T07:20:06+05:30 IST