NRI: విమానంలో అనూహ్య ప్రమాదం .. సాటి ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన భారతీయ వైద్యుడు..
ABN, First Publish Date - 2023-01-07T18:04:24+05:30
విమానంలో ప్రాణాపాయ స్థితికి చేరుకున్న తోటి ప్రయాణికుడిని కాపాడి రియల్ లైఫ్ హీరో అయ్యాడో భారతీయ సంతతి వైద్యుడు.
ఎన్నారై డెస్క్: విమానంలో ప్రాణాపాయ స్థితికి చేరుకున్న తోటి ప్రయాణికుడిని కాపాడి రియల్ లైఫ్ హీరో అయ్యాడో భారతీయ సంతతి వైద్యుడు. రెండు మార్లు మరణం అంచుల వరకూ వెళ్లిన అతడిని ఐదు గంటల పాటు శ్రమించి కోలుకునేలా చేశాడు. బెంగళూరు చెందిన డా. విశ్వరాజ్ వేమల(Dr. Vishwaraj Vemala) బర్మింగ్‌హామ్‌లోని(బ్రిటన్) క్వీన్స్ ఎలిజబెత్ హాస్పిటల్‌లో హెపటాలజిస్టుగా చేస్తున్నారు. ఇటీవల ఆయన విమానంలో లండన్ నుంచి బెంగళూరుకు వస్తుండగా ఓ ప్రయాణికుడి గుండె కొట్టుకోవడం ఆగిపోవడంతో(Cardiac Arrest) అచేతనావస్థలోకి వెళ్లిపోయారు. విమానం ఐయల్‌లో నడుస్తూ కుప్పకూలిపోయారు. సిబ్బంది ద్వారా విషయం తెలుసుకున్న డా. విశ్వరాజ్ వెంటనే రంగంలోకి దిగారు. గంటపాటు శ్రమించి ప్రయాణికుడిని స్పృహలోకి తెచ్చారు.
విమాన సిబ్బంది ఇచ్చిన ఎమర్జెన్సీ కిట్, సాటి ప్రయాణికుల నుంచి సేకరించిన హార్ట్ రేట్ మానిటర్, బీపీ మెషీన్, పల్స్ ఆక్సీమీటర్, గ్లూకో మీటర్ సాయంతో ప్రయాణికుడి స్థితిగతులు గమనిస్తుండగా..రెండో మారు గుండె ఆగిపోవడంతో అతడికి మళ్లీ స్పృహతప్పింది. వైద్యుడితో మాట్లాడుతూనే అచేతనావస్థలోకి వెళ్లిపోయారు. దీంతో.. డాక్టర్ మరో నాలుగు గంటల పాటు శ్రమించి కోలుకునేలా చేశారు. ‘‘అతడి ప్రాణాలు రక్షించేందుకు 5 గంటల పాటు తీవ్రంగా కష్టపడ్డాము. రక్తపోటు, రక్తంలోని గ్లూకోజ్ స్థాయి నియంత్రణలోకి రాక రెండు గంటల పాటు తెగ ఆందోళనకు గురయ్యాము. ఆ సమయంలో విమానంలోని వారందరూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు’’ అని చెప్పారు. డాక్టర్ కృషి ఫలించి రోగి సాధారణ స్థితికి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈలోపు..విమానం ముంబైలో అత్యవసరంగా ల్యాండయ్యాక రోగిని ఆస్పత్రికి తరలించారు. 40 వేల అడుగుల ఎత్తులో(Mid-Air), తగిన వైద్యపరికరాలేవీ లేకుండా ఓ ప్రయాణికుడికి చికిత్స అందించడం తన జీవితంలో మర్చిపోలేని అనుభవమని డా. విశ్వరాజ్ మీడియాతో వ్యాఖ్యానించారు.
Updated Date - 2023-01-07T18:06:26+05:30 IST