NRI: పంజాబ్‌లో ఘోరం.. దుబాయ్ నుంచి తిరిగొచ్చిన ఎన్నారై అల్లుడు.. అత్తారింట్లో చేసిన దారుణం ఇదీ!
ABN, First Publish Date - 2023-01-22T11:04:09+05:30
పంజాబ్‌లో దారుణం జరిగింది. దుబాయ్ నుంచి తిరిగొచ్చిన ఓ ఎన్నారై అల్లుడు ఘాతుకానికి ఒడిగట్టాడు.
ఎన్నారై డెస్క్: పంజాబ్‌లో దారుణం జరిగింది. దుబాయ్ నుంచి తిరిగొచ్చిన ఓ ఎన్నారై అల్లుడు ఘాతుకానికి ఒడిగట్టాడు. భార్యపై కోపంతో అత్తారింట్లో తీవ్ర విషాదాన్ని నింపాడు. తన మామ, బావమర్దిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనలో మరో ముగ్గురు కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదు మేరకు ముక్‌స్తర్ పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న అతడి కోసం గాలిస్తున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్ రాష్ట్రం ముక్‌స్తర్ జిల్లా పన్నీవాలా అనే గ్రామంలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడు బల్వీందర్ సింగ్ (Balwinder Singh) అదే రోజు ఉదయం దుబాయ్ నుంచి అత్తగారి ఊరు అయిన పన్నీవాలాకు వచ్చాడు. అత్తారింటికి వచ్చాక మామ గజ్జన్ సింగ్, బామ్మర్ది నరీందర్ సింగ్‌తో గొడవ పడ్డాడు. వారి మధ్య మాటమాట పెరిగి ఒకరిపై ఒకరు చేయి చేసుకునే వరకు వెళ్లింది. ఈ క్రమంలో బల్వీందర్ సింగ్ తన చేతికి అందిన ఓ పదునైన వస్తువుతో గజ్జన్ సింగ్, నరీందర్ సింగ్‌పై దాడికి పాల్పడ్డాడు. దాంతో వారు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఈ గొడవలో అడ్డు వచ్చిన రచ్‌పాల్ కౌర్, రవీందర్ సింగ్, గుర్పాల్ సింగ్‌ను కూడా బల్వీందర్ గాయపరిచి అక్కడి నుంచి పరారయ్యాడు.
కాగా, గజ్జన్ సింగ్ కూతురు రమణదీప్ కౌర్‌కు రెండేళ్ల క్రితం అతడితో వివాహం అయింది. అయితే పెళ్లైన నాలుగు నెలలకే అతడు దుబాయ్‌కి వెళ్లిపోయాడు. ఆ తర్వాత తిరిగి రాలేదు. తన భర్త కట్నం కోసమే తనను విడిచిపెట్టి వెళ్లిపోయాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. పెళ్లయిన తర్వాత బల్వీందర్ ఈరోజే దుబాయ్ నుంచి తిరిగి వచ్చి తన కుటుంబంపై దాడి చేశాడని రమణదీప్ కన్నీరుమున్నీరుగా విలపించింది. ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేశామని మలౌట్ డీఎస్పీ బాల్కర్ సింగ్ తెలిపారు. అలాగే పరారీలో ఉన్న బల్వీందర్ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
Updated Date - 2023-01-22T11:04:16+05:30 IST