UAE Residence Visa: రెసిడెన్స్ వీసా ఉంటే చాలు.. యూఏఈలో ఈ ఏడు పనులు ఇట్టే అయిపోతాయి..
ABN, First Publish Date - 2023-02-24T11:44:10+05:30
యునైటెడ్ అరబ్ ఏమిరెట్స్ (UAE) వెళ్లే ఆలోచనలో ఉన్నారా? అయితే, మీరు ఆ దేశ రెసిడెన్సీ వీసా (Residence Visa) వల్ల కలిగే ప్రయోజనాల గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే.
దుబాయ్: యునైటెడ్ అరబ్ ఏమిరెట్స్ (UAE) వెళ్లే ఆలోచనలో ఉన్నారా? అయితే, మీరు ఆ దేశ రెసిడెన్సీ వీసా (Residence Visa) వల్ల కలిగే ప్రయోజనాల గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే. ఈ వీసాతో ముఖ్యంగా ఏడు లాభాలు ఉన్నాయి. అవి మనల్ని యూఏఈలో ఎంతో మేలు చేస్తాయి. పరాయి గడ్డపై మనల్ని చాలా ఇబ్బందుల నుంచి గట్టేక్కిస్తాయి. యూఏఈ రెసిడెన్సీ వీసా వల్ల కలిగే ఆ ఏడు ప్రయోజనాలెంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం...
1. బ్యాంక్ ఖాతా తెరిచేందుకు
యూఏఈలో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ప్రాథమిక ధృవీకరణ ప్రతాలలో ఎమిరేట్స్ ఐడీ తప్పనిసరి. మీకు ఈ ఐడీ కావాలంటే రెసిడెన్సీ వీసా ఉండాల్సిందే. అప్పుడు మాత్రమే మీకు అక్కడి బ్యాంకుల్లో కొత్త ఖాతాలు తెరిచేందుకు వీలు కలుగుతుంది. ఒకవేళ మీకు యూఏఈ రెసిడెన్సీ వీసా లేకపోయిన బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేందుకు నాన్-రెసిడెంట్ బ్యాంక్ ఖాతా రూపంలో మరో అవకాశం ఉంటుంది. కానీ, దీనికి బోలేడు పరిమితులు ఉంటాయి. మినిమం శాలరీ పరిమితి చాలా అధికంగా ఉంటుంది. అంటే హై శాలరీ ఉన్నవారికే ఇది వీలు పడుతుంది. అలాగే కేవలం సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసేందుకు మాత్రమే అవకాశం ఉంటుంది. చెక్‌బుక్, ఇతర సౌకర్యాలు ఈ అకౌంట్ ద్వారా మనకు దొరకవు అన్నమాట.
2. ఆర్థిక లావాదేవీలకు ఈజీ యాక్సెస్
రెసిడెన్సీ వీసాతో ఈజీగా బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ కాకుండా ఇతర ఆర్థిక లావాదేవీలకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఉదాహరణకు లోన్స్‌కు సంబంధించిన సేవలకు దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు. ఇంటి లోన్లు, కార్ లోన్, ఇతర సర్వీసులకు అన్నమాట.
3. డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుకు..
ఒకవేళ మీరు యూఏఈ రెసిడెంట్ అయితే, అక్కడి డ్రైవింగ్ లైసెన్స్ పొందడం చాలా సులువు. మన జాతీయత, రెసిడెన్సీ కంట్రీ తదితర విషయాల ఆధారంగా ప్రస్తుతం మన దగ్గర ఉండే డ్రైవింగ్ లైసెన్స్‌నే యూఏఈ డ్రైవింగ్ లైసెన్స్‌గా కన్వర్ట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అంటే.. మిగతా ఏ ప్రాసెస్ లేకుండానే మనకు యూఏఈ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేస్తుంది.
4. ప్రభుత్వ ఆరోగ్య సేవలు, హెల్త్ ఇన్సూరెన్స్ యాక్సెస్
యూఏఈలో దేశ పౌరులైనా, నివాసితులైనా ఆరోగ్య బీమా ఉంటే అత్యావసర, దీర్ఘకాలిక చికిత్సల సమయంలో ఉపయోగకరంగా ఉంటుంది. ఇలాంటి ప్రభుత్వ ఆరోగ్య సేవలను తక్కువ వ్యయంతో పొందేందుకు రెసిడెన్సీ వీసా ఉంటే చాలా ఈజీ అవుతుంది. దీనికి హెల్త్ కార్డు తప్పనిసరి. ఎమిరేట్స్ హెల్త్ సర్వీసెస్ జారీ చేసే ఈ కార్డు మన దగ్గర ఉంటే ప్రభుత్వ ఆరోగ్య సర్వీసులను తక్కువ ఖర్చుతో పొందవచ్చు. ఈ కార్డు కావాలంటే ఇతర ధృవపత్రాలతో పాటు రెసిడెన్సీ వీసా ఉంటే సరిపోతుంది.
5. మీ పిల్లలను ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో జాయిన్ చేసేందుకు..
యూఏఈ (UAE) ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ అయిన u.ae ప్రకారం ప్రవాస విద్యార్థులు 2001 నుండి మెరిట్ ఆధారంగా నిర్దిష్ట ఫీజులు, ఇతర షరతుల ఆధారంగా ప్రభుత్వ పాఠశాలలకు హాజరు కావడానికి అనుమతించబడుతున్నారు. అయితే, ప్రవాసులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో జాయిన్ చేయాలని నిర్ణయించుకునే ముందు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ప్రవాస విద్యార్థులకు వర్తించే నిబంధనల ప్రకారం ట్యూషన్ ఫీజులు వసూలు చేస్తారు. ఇక ప్రైవేట్ పాఠశాలలు పిల్లల జాయినింగ్ సమయంలో అడిగే అత్యావసరమైన పత్రాలలో తల్లిదండ్రుల ఎమిరేట్స్ ID కార్డ్ ఒకటి.
6. పని, పెట్టుబడి
యూఏఈ నివాసిగా మీరు ఆ దేశంలో పని చేయడానికి, పెట్టుబడి పెట్టడానికి అనేక అవకాశాలు ఉంటాయి. వాస్తవానికి యూఏఈ ఇటీవల కొన్ని ప్రత్యేక కేటగిరీలకు చెందిన నివాస వీసాలను ప్రవేశపెట్టింది. నిర్దిష్ట నిపుణులు, పెట్టుబడిదారులకు దీర్ఘకాలిక రెసిడెన్సీ వీసాలను అందిస్తోంది.
7. ప్రయాణ వీసా– కొన్ని గమ్యస్థానాలకు ఉచితం
మీరు యూఏఈ నివాసి అయితే, అనేక దేశాలు వీసా ఫ్రీ సందర్శనకు, వీసా ఆన్ అరైవల్ సౌకర్యాలను అందిస్తాయి. అయితే, మీ జాతీయతను బట్టి ఇమ్మిగ్రేషన్ అవసరాలు కొద్దిగా మారుతాయి. మీరు మీ ట్రిప్ ప్లాన్ చేసుకునే ముందు ఆ దేశంలోని విదేశీ రాయబార కార్యాలయాలను సంప్రదించడం బెటర్.
ఇది కూడా చదవండి: గతేడాది రూ.25 కోట్ల లాటరీ గెలిచిన ఈ ఆటో డ్రైవర్.. ఇప్పుడు ఏం చేస్తున్నాడో.. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలిస్తే..
Updated Date - 2023-02-24T11:46:47+05:30 IST