Saudi Arabia: సౌదీ పర్యటనలో కేంద్ర మంత్రి మురళీధరన్.. సమస్యలను ఏకరువు పెట్టిన తెలుగు ప్రవాసులు
ABN, First Publish Date - 2023-05-02T17:15:20+05:30
సొంతూరికి తీసుకెళ్లాల్సిన ప్రవాస భారతీయుడి మృతదేహం గురించి ఒకరు.. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు అందాల్సిన బకాయిల గురించి మరొకరు.. విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్‌తో సమస్యలను చెప్పుకున్నారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: సొంతూరికి తీసుకెళ్లాల్సిన ప్రవాస భారతీయుడి మృతదేహం గురించి ఒకరు.. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు అందాల్సిన బకాయిల గురించి మరొకరు.. దేశం కాని దేశంలో పిల్లల ఫీజులకు వెచ్చిస్తున్న అధిక ఫీజుల గురించి ఇంకొకరు.. మహిళల అక్రమ రవాణా గురించి ఒకరు.. అక్రమ కేసుల్లో సౌదీ జైళ్లల్లో మగ్గిపోతున్న ప్రవాస భారతీయుల గురించి మరొకరు.. ఇలా ఒక్కొక్కరూ ఒక్కో విషయం గురించి విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్‌తో సమస్యలను చెప్పుకున్నారు. ఆయా సమస్యలను పరిష్కరించాల్సిందిగా సౌదీలోని ప్రవాస భారతీయులంతా వినతి పత్రాలను కేంద్ర మంత్రికి అందించారు. సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న మురళీధరన్‌ను సోమవారం సాయంత్రం పలువురు తెలుగు ప్రవాసీయులు కలిశారు. సామాన్యుడి సాధక బాధకలను తెలుసుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ అధిక ప్రాధాన్యత ఇస్తారని.. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని తాను కూడా సౌదీలోని సగటు భారతీయుల సమస్యలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఈ సందర్భంగా మురళీధరన్ చెప్పారు.
సరైన ఎంప్లామెంట్ అగ్రిమెంట్లు లేకుండా వచ్చి సౌదీలో ఇరుక్కుపోతున్న మహిళల గురించి మంత్రితో ఏపీ ఎన్నారై కోర్టినేటర్, సాటా ప్రధాన కార్యదర్శి ముజమ్మీల్ శేఖ్ ప్రస్తావించారు. ఇలా మోసపోతున్న మహిళలు నేరుగా ఉపాధి వీసాపై రాకుండా ఇతర దేశానికి విజిట్ వీసాపై వచ్చి పొరపాటు చేస్తున్నారన్నారని మురళీధరన్ వ్యాఖ్యానించారు. విజిట్ వీసాపై వచ్చి అక్కడి నుండి అడ్డదారిన ఎంప్లామెంట్ వీసాను తీసుకుని వారంతట వారే మోసపోతున్నారని ఆయన వాపోయారు. ఈ విషయంలో ప్రవాసీ భారతీయులందరూ.. తమ తమ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చి పోలీసు కేసులను నమోదు చేయించాలని సూచించారు. ఏజంట్ల మోసాలు అనేవి పోలీసు పని అనీ.. ఈ అంశాలు రాష్ట్రాల పరిధిలోని అంశమని మంత్రి వివరించారు. సౌదీ అరేబియాలో కార్మిక సమస్యలకు సంబంధించి అదనపు లేబర్ అటాచీల నియామకం పురోగతిలో ఉందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ప్రవాసీ భీమా పరధిలో సహజ మరణాలకు ఏలాంటి పరిహారమూ అందే ఆవకాశం లేదని, దీన్ని సవరించి సహాజ మరణాలకు కూడా భీమా పరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని మురళీధరన్‌కు ముజమ్మీల్ శేఖ్ విన్నవించారు.
హురూబ్ కేసుల పరిష్కారానికి కౌంటర్ల సంఖ్యను పెంచవల్సిందిగా సౌదీ అధికారులను కోరాలని భారతీయ స్టీరింగ్ కమిటీ మురళీధరన్‌ను కోరింది. ఈ భారతీయ స్టీరింగ్ కమిటీలో తెలుగు ప్రముఖుడైన అంటోనీ కూడా ఓ సభ్యుడు కావడం గమనార్హం. భారతీయుల సాంస్కృతిక కార్యకలాపాలు, సమావేశాల నిర్వహణ కొరకు రియాధ్ నగరంలో ఓ ఆడిటోరియాన్ని నెలకోల్పడానికి కేంద్రం చర్యలు తీసుకోవాలని కూడా ఈ బృందం విన్నవించుకుంది. ఎన్నారై విద్యార్ధులకు ‘దసా’ పథకం క్రింద వైద్య విద్యను కూడా చేర్చాలని తమ బృందం కోరినట్లుగా అంథోని పేర్కోన్నారు. అరబ్బు యాజమానుల తప్పిదానికి ఉద్యోగాలు కోల్పోయిన భారతీయులు చాలా ఇబ్బందులు పడుతున్నారనీ.. అసలు ప్రవాసుల తప్పు లేకుండా వాళ్లెందుకు శిక్ష అనుభవించాలని ఈ సందర్భంగా మంత్రి ఎదుట భారతీయ స్టీరింగ్ కమిటీ బృందం వాపోయింది. వీరు నేరుగా విమానాశ్రాయాల నుంచి తిరిగి వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
సౌదీ అరేబియాలో పది, పన్నెండు తరగతులు ఉత్తీర్ణత సాధించిన ప్రవాస భారతీయ విద్యార్ధులకు డిగ్రీ చదువుకునే ఆవకాశాలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని మురళీధరన్‌కు సాటా మహిళ అధ్యక్షురాలు సుచరిత కందుల ఫిర్యాదు చేశారు. పైగా స్వదేశానికి తిరిగి వెళ్తున్న విద్యార్ధులను ఎన్నారై కోటా క్రింద అయిదు రెట్లు ఎక్కువగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఆమె వాపోయారు. భారత దేశంలో ఆమోద యోగ్యత పొందిన అనేక కోర్సుల డిగ్రీలు, డిప్లోమాలను సౌదీ అరేబియా ప్రభుత్వం గుర్తించడం లేదని, బ్యాచిలర్ డిగ్రీ తప్పనిసరి అనే నిబంధనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు సాటా రియాధ్ నగర అధ్యక్షుడు జి.ఆనందరాజు మంత్రికు ఫిర్యాదు చేశారు.
మరణించిన ప్రవాసీయుల కుటుంబాలకు ఎండ్ సర్వీస్ బెనిఫిట్, ఇతర బకాయిలు అందడంలో జాప్యం జరుగుతోందని తెలంగాణ ఎన్నారై ఫోరం అధ్యక్షుడు మోహమ్మద్ అబ్దుల్ జబ్బార్ మంత్రికి ఫిర్యాదు చేశారు. బకాయిలను సత్వరమే చెల్లించే విధంగా ఎంబసీ అధికారులకు ఆదేశాలను జారీ చేయాలని ఆయన మంత్రికు విజ్ఞప్తి చేశారు.
కాగా.. కేరళకు చెందిన మురళీధరన్ సహాయ మంత్రిగా గల్ఫ్ దేశాలకు ఇన్ చార్జీగా ఉన్నారు. కొద్ది నెలల క్రితమే రియాధ్‌కు వెళ్లాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. మంత్రి మురళీధరన్ ప్రస్తుతం మిషన్ కావేరిలో భాగంగా సుడాన్ నుండి భారతీయులను తరలించే కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.
Updated Date - 2023-05-02T17:21:38+05:30 IST