Adani Row: అదానీ వ్యాపార పునాది దుబాయ్.. నలుగురు తెలుగు ప్రవాసులతో కలిసి ప్రారంభం
ABN, First Publish Date - 2023-02-04T07:30:00+05:30
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ నివేదిక నేపథ్యంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న గౌతమ్ అదానీ గ్రూప్ వ్యాపార సామ్రాజ్య పునాది దుబాయ్‌లో ఉంది.
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి వీరిలో ఒకరి యత్నాలు
ఇటీవలి ఎఫ్‌పీవోలో ఆదుకున్న పాకిస్థానీ మిత్రుడు
వైఎస్ ప్రాధాన్యమిచ్చిన ఎమ్మార్‌తోనూ పరిచయం
అప్పట్లో తెలుగునాట రాజకీయాలతో దొరకని వీలు
గుజరాత్‌లో మోదీ.. కేంద్రంలో అహ్మద్ పటేల్ అండ
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి): హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ నివేదిక నేపథ్యంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న గౌతమ్ అదానీ గ్రూప్ వ్యాపార సామ్రాజ్య పునాది దుబాయ్‌లో ఉంది. అక్కడినుంచే తొలుత కార్యకలాపాలకు శ్రీకారం చుట్టి రూ.లక్షల కోట్ల స్ధాయికి ఎదిగింది. ఇందులో తెలుగువారి పాత్ర కొంత ఉండడం గమనార్హం. అదానీ సోదరులు వినోద్, గౌతమ్.. దుబాయ్‌లో నలుగురు తెలుగు ఉద్యోగులతో కలిసి వ్యాపారం ప్రారంభించారు. వీరిలో ముగ్గురు త్వరగానే వెళ్లిపోయారు. ఒకరు మాత్రం సుదీర్ఘ కాలం పనిచేసి.. ఇప్పుడు సొంతంగా వ్యాపారం చేసుకుంటున్నారు. ఈ ప్రవాసీ వచ్చే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సంసిద్ధమవుతున్నారు. కాగా, అదానీలు గుజరాత్ నుంచి రసాయనాలు, ఆహార సామగ్రి, విద్యుత్తు పరికరాలను తీసుకొచ్చి గల్ఫ్ వ్యాపారులకు విక్రయించేవారు. తర్వాత గుజరాత్, ఇతర రాష్ట్రాల్లో విద్యుత్తు ప్రాజెక్టులను పొందేందుకు ప్రయత్నించారు.
అనేకమంది గుజరాతీ వ్యాపారుల్లానే.. అదానీలూ దుబాయ్‌లో వజ్రాల వ్యాపారమూ చేశారు. అయితే, అది మోస్తరు స్థాయిలోనే సాగిందని చెబుతారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దుబాయ్ సంస్ధ ఎమ్మార్ ప్రాపర్టీ్‌సకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. అదే సమయంలోగౌతమ్ అదానీకి ఎమ్మార్ అధినేత మొహమ్మద్ అల్ బార్‌తో పరిచయమైంది. కానీ, అదానీలకు ఎమ్మార్ ఎక్కడా ఏ రకమైన ఆవకాశమూ ఇవ్వలేదు. దీనికి తెలుగునాట స్థానిక రాజకీయాలూ తోడయ్యాయి. అదానీ ఇన్వె్‌స్టమెంట్ పోర్ట్‌ఫోలియా దృష్ట్యా అటు ఎమ్మార్ కూడా పట్టించుకోలేదు. అయినప్పటికీ అందివచ్చిన అనేక వ్యాపారాలతో, గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ తోడ్పాటు ఇవ్వడంతో అనతి కాలంలోనే అభివృద్ధి చెందారు.
నాడు మోదీ తిరిగింది అదానీ విమానంలోనే
మోదీ కంటే ముందే అదానీని కాంగ్రెస్ దివంగత నేత అహ్మద్ పటేల్ అన్నివిధాల ఆదుకున్నారు. గుజరాత్‌లో మోదీ, కాంగ్రెస్ హయాంలో కేంద్రంలో పటేల్ అండగా నిలిచారు. విద్యుత్తు ప్రాజెక్టుల పేరిట భారీగా బ్యాంకు రుణాలు పొందడాన్ని నేర్చుకున్న అదానీ దానిని కొనసాగించారు. తాజాగా చేసిన రూ.వేల కోట్ల ఫాలోఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీవో) కూడా విద్యుత్తు ప్రాజెక్టులకు సంబధించినదే. కాగా, మోదీని బీజేపీ 2014లో ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆయన దేశమంతా అదానీకి చెందిన విమానంలో పర్యటనలు చేశారు. ఆసక్తికర విషయం ఏమంటే.. ఆ విమానంలో మోదీ ఏ రాష్ట్రంలోనూ ఒకటి, రెండు రోజులు కూడా బస చేయలేదు. రోజూ రాత్రి అహ్మదాబాద్ వెళ్లిపోయేవారు. దానికి కారణం విమానశ్రయాల్లో పార్కింగ్ బిల్లు విమాన ఇంధనం కంటే ఎక్కువగా ఉండడమే.
ఇలా విమాన పార్కింగ్ ఫీజుకు వెరసిన వ్యక్తి ప్రస్తుతం విమానయాన రంగంలో ఆసియా ఖండంలోనే ప్రముఖుడిగా ఉన్న తెలుగు వ్యాపారవేత్త గ్రంథి మల్లికార్జునరావు (జీఎంఆర్) గ్రూప్‌నకు అవరోధాలు కల్పిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎలాంటి అహంకారం లేకుండా సాదాసీదాగా కలగొలుపుగా ఉండే గౌతమ్ అదానీ ఇతరులతో కలిసేందుకు ఇష్టపడతారు. అయితే, హిండెన్ బర్గ్ రీసెర్చి సంస్థ కథనం తర్వాత అదానీ గ్రూప్‌నకు కష్టాలు మొదలయ్యాయి. అయినా గ్రీన్ ఎనర్జీపై అదానీ సంస్ధ జారీ చేసిన రూ.వేల కోట్ల ఎఫ్‌పీవో పూర్తిగా సబ్‌స్ర్కైబ్ అయింది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే.. ఈ విషయంలో అదానీని ఆదుకున్నది సంస్థాగత మదుపరులు. అందులో మిలియన్ డాలర్లు పెట్టింది ఆబుధాబిలోని ఒక సంస్ధ. ఆబుధాబి పెద్దలకు చెందిన ఈ సంస్థకు సీఈవో పాకిస్థాన్ జాతీయుడైన సయ్యద్ బషర్ షుయెబ్. అదానీకి ఈయన అత్యంత ఆప్తుడు.
Updated Date - 2023-02-04T07:57:59+05:30 IST