UK: బ్రిటన్ పరిశీలనలో కీలక ప్రతిపాదన.. విదేశీ విద్యార్థులు అదనంగా..
ABN, First Publish Date - 2023-01-29T16:36:29+05:30
బ్రిటన్‌లో కార్మికుల కొరత తీర్చే దిశగా అక్కడి ప్రభుత్వం ఓ కొత్త ప్రతిపాదనను పరిశీలిస్తోంది.
ఎన్నారై డెస్క్: బ్రిటన్‌లో(Britain) కార్మికుల కొరత(Labour Shortage) తీర్చే దిశగా అక్కడి ప్రభుత్వం ఓ కొత్త ప్రతిపాదనను పరిశీలిస్తోంది. దేశంలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు(Foreign students) మరింత సమయం పనిచేసుకునేందుకు(Work for Longer Periods) అనుమతిచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. ప్రస్తుతం విదేశీ విద్యార్థులు వారానికి 20 గంటల పాటు పార్ట్‌టైంగా పనిచేసుకోవచ్చు. ఈ పరిమితిని 30 గంటలకు పెంచే విషయమై ఇప్పటికే ప్రభుత్వంలో అంతర్గతంగా చర్చలు సాగుతున్నట్టు సమాచారం. అంతేకాకుండా.. వివిధ పార్ట్‌టైం జాబ్స్ చేసుకునే అవకాశాన్ని కూడా ఫారిన్ స్టూడెంట్లకు ఇచ్చే అంశాన్నీ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ చర్యలతో కార్మికుల కొరత నుంచి ఉపశమనం లభించడంతో పాటూ దేశానికి ఆర్థికంగా లాభిస్తుందని ప్రభుత్వం ఆలోచనగా ఉంది.
ప్రస్తుతం బ్రిటన్‌లో 6,80,000 మంది విదేశీ విద్యార్థులు చదువుకుంటున్నారు. గతేడాది బ్రిటన్‌కు సుమారు 11 లక్షల మంది విదేశీయులు వెళ్లారు. వీరిలో విద్యార్థుల సంఖ్య మూడు లక్షలకు పైనే. అంతేకాకుండా.. విదేశీ విద్యార్థుల్లో అధికులు భారతీయులే. బ్రిటన్‌లో 1.3 మిలియన్లు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ప్రధాని రిషి సునాక్ ఇటీవల తెలిపారు. ఉద్యోగుల కోసం వ్యాపారస్థులు ఎలుగెత్తి పిలుస్తున్నారని ఆయన అప్పట్లో వ్యాఖ్యానించారు. ఇక కార్మికుల కొరత తీర్చేందుకు పలు పరిష్కారాలను పరిశీలిస్తున్నామని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. విదేశీ విద్యార్థుల పనిగంటల పరిమితి పెంపు కూడా ఇందులో భాగమని పేర్కొన్నాయి. అయితే.. ఈ ప్రతిపాదనపై ప్రస్తుతం పరిశీలన ప్రాథమిక స్థాయిలోనే ఉందని చెప్పాయి. ఇదిలా ఉంటే..వలసలకు అడ్డుకట్ట వేయాలనుకుంటున్న హోం సెక్రెటరీ సుయెల్లా బ్రెవర్మన్ రూపంలో ఈ పనిగంటల పెంపు యోచనకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. గతేడాది బ్రిటన్‌లోకి నికర వలసలు 5 లక్షల మార్కును దాటాయి. దీనికి బ్రేకులు వేసేందుకు సుయెల్లా బ్రెవర్మన్ ఇప్పటికే పలు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. విదేశీ విద్యార్థులు చదువు పూర్తయ్యాక స్వల్ప కాలంపాటే దేశంలో ఉండేలా నిబంధన విధించడం, ‘లో క్వాలిటీ’ కోర్సుల్లో చేరే విదేశీయులను తగ్గించడం తదితర అంశాలను ఆమె ప్రతిపాదించారు. విదేశీ విద్యార్థుల వెంట వచ్చే వారి సంఖ్యపై పరిమితులు విధించాలని సూచించారు. అయితే..విదేశీ నిధులపై అధికంగా ఆధారపడే బ్రిటన్ విశ్వవిద్యాలయాలు ఈ చర్యలతో దివాళా తీసే అవకాశం ఉందని బ్రిటన్ విద్యాశాఖ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
Updated Date - 2023-01-29T16:38:42+05:30 IST