America: కారణం లేకున్నా అరెస్ట్ చేస్తారు.. ఆ దేశం నుంచి వెంటనే వచ్చేయండి.. దేశ పౌరులకు అమెరికా అలెర్ట్..!
ABN, First Publish Date - 2023-02-14T19:06:40+05:30
రష్యాను వీడాలంటూ అమెరికా పౌరులకు సూచించిన అగ్రరాజ్యం.
ఎన్నారై డెస్క్: ‘‘కారణం లేకున్నా అరెస్ట్ చేస్తారు.. ఆ దేశం నుంచి వెంటనే వచ్చేయండి.. ’’అంటూ అమెరికా ప్రభుత్వం రష్యాలోని(Russia) తన పౌరులను తాజాగా అలర్ట్ చేసింది. అక్కడి అమెరికన్లు వెంటనే స్వదేశానికి తిరుగుప్రయాణం ప్రారంభించాలని సూచించింది. రష్యాకు రావాలనుకుంటున్న వారు ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాలని కూడా తేల్చి చెప్పింది.
ఉక్రెయిన్‌తో(Russia-Ukraine war) యుద్ధం మొదలెట్టిన రష్యాకు, అమెరికాకు(USA) మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో..రష్యాలో అమెరికా పౌరుల(American Citizens) భద్రతపై అగ్రరాజ్యం ఆందోళన చెందుతోంది. రష్యాలోని అమెరికన్లను అన్యాయంగా అరెస్టు చేసే అవకాశం ఉందంటూ మాస్కోలోని యూఎస్ ఎంబసీ హెచ్చరించింది. గతంలో రష్యాలో కొందరు అమెరికన్లు అన్యాయంగా అరెస్టయ్యారనీ గుర్తుచేసింది. అంతేకాకుండా.. రష్యన్ అధికారులు చట్టాల సాకుతో అమెరికన్ల న్యాయబద్ధమైన కార్యకలాపాలకు అడ్డుపడుతున్నారని చెప్పింది. మతపరమైన కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెరికన్లపై అనుమానాస్పద రీతిలో క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ కూడా నిర్వహిస్తున్నట్టు ఆరోపించింది. అమెరికా ప్రభుత్వం గతేడాది కూడా ఇలాంటి హెచ్చరికలు జారీ చేసింది. రష్యాను వీడాలంటూ అక్కడున్న అమెరికన్లను కోరింది(US Advisory).
అమెరికా ఎంబసీ ప్రకటనపై రష్యా తనదైన రీతిలో స్పందించింది. అమెరికా తరచూ ఇలాంటి ప్రకటనలు చేస్తుంటుందంటూ కొట్టి పారేసింది. ఇదిలా ఉంటే.. రష్యాపై గూఢచర్యం చేసిన కేసులో అమెరికాకు చెందిన బాస్కెట్ బాల్ ప్లేయర్ బ్రిటనీ గ్రిన్నర్ రష్యాలో జైలుపాలయ్యాడు. అయితే.. అమెరికాతో కుదిరిన ఖైదీల పరస్పర బదిలీల్లో భాగంగా రష్యా.. గ్రీనర్‌ను అమెరికాకు అప్పగించింది. అమెరికా మాత్రం గ్రీనర్‌పై ఆరోపణలు తోసిపుచ్చింది. అతడు ఎలాంటి గూఢచర్యానికి పాల్పడలేదని స్పష్టం చేసింది.
Updated Date - 2023-02-14T19:06:41+05:30 IST