OHRK Jitender Reddy: మోదీకి కేసీఆర్ భయపడ్డాడేమో..!
ABN, First Publish Date - 2023-07-10T02:18:59+05:30
నమస్తే.. ఆర్కే గారు. పార్టీ అన్నాక ఒడిదుడుకులు ఉంటాయి. వాటికి భయపడేది కాదు బీజేపీ. 2 సీట్లతో మొదలై 303 స్థానాలను గెలుచుకున్న పార్టీ ఇది.
అందుకే ఆయన సైలెంట్ అయి ఉండొచ్చు
రెండోసారి సీఎం అయ్యాక కేసీఆర్‌కు మదం
బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటేనని ప్రజల భావన
ఇతర పార్టీల అవలక్షణాలు బీజేపీకి వచ్చాయి
కొత్త నేతలు ఆ సంస్కృతిని అంటిస్తున్నారు
సంజయ్‌ను అధ్యక్షుడిగా తప్పిస్తారనుకోలేదు
‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో జితేందర్ రెడ్డి
ఆర్కే: నమస్తే జితేందర్ రెడ్డి గారూ. ఏంటి మీ పార్టీ అంత బాగున్నట్టు లేదే..?
జితేందర్ రెడ్డి: నమస్తే.. ఆర్కే గారు. పార్టీ అన్నాక ఒడిదుడుకులు ఉంటాయి. వాటికి భయపడేది కాదు బీజేపీ. 2 సీట్లతో మొదలై 303 స్థానాలను గెలుచుకున్న పార్టీ ఇది.
ఆర్కే: కాంగ్రెస్‌లో ఉండే అవలక్షణాలు, ఎక్కువ కాలం అధికారంలో ఉండే ప్రాంతీయ పార్టీలో ఉండే అవలక్షణాలు బీజేపీకి వచ్చినట్టున్నాయ్..?
జితేందర్ రెడ్డి: బీజేపీ పాత నాయకులకు నిజంగా హ్యాట్సాఫ్. సిద్ధాంతం కోసం ఏళ్ల తరబడి పార్టీలో పనిచేస్తున్న లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, సమ్మయ్య లాంటి వాళ్లు కూడా ఏం అనుకున్నారంటే.. ‘మనం ఇన్నేళ్లు కష్టపడ్డాం. ఎన్నికల నిర్వహణ రాదు. మనం చేయలేకపోతాం అనే బద్నాం ఉంది. కాబట్టి ఇతర పార్టీల నుంచి వచ్చిన జితేందర్ రెడ్డి, డీకే అరుణ, రాజగోపాల్, ఈటల వంటి వారికి పగ్గాలు ఇద్దాం. వాళ్లు పైన, మేం కింద కూర్చుంటాం’ అని రాజీ పడి కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చారు. దురదృష్టం ఏంటంటే కొత్త వాళ్లమంతా కలిసి మా కల్చర్‌ను వాళ్లకు అంటగడుతున్నామేమోనని అనిపిస్తోంది. పాత నేతలు ఏమాత్రం మారలేదు.
రాత్రికి రాత్రి అధికారంలోకి రావాలనే పాలసీని మీ కేంద్ర నాయకులు తీసున్నారు. అదే ఇప్పుడు తెలంగాణలో మీ పార్టీ కొంప ముంచుతోంది..
అలా ఏం లేదు. నిజానికి ఇక్కడ ఆ అవసరం స్పష్టంగా కనిపించింది. 2014 నుంచి 2018 వరకు కేసీఆర్ చాలా గొప్ప పాలన అందించారు. కానీ, 88 స్థానాలు వచ్చిన తర్వాత కేసీఆర్‌కు మదమొచ్చింది. ఆయన కూర్చునే స్టైలే మారిపోయింది. పరేడ్ గ్రౌండ్‌లో ఆయన కూర్చున్న తీరు పట్ల జనం అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు పొగరొచ్చిందని ఆయన వ్యవహార శైలి పట్ల వ్యతిరేకత వచ్చింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కేసీఆర్ అహాన్ని బయటపెట్టుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో జనం దెబ్బకొట్టారు. తర్వాత కేసీఆర్ అవినీతి, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడం వంటివి చూసి ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. దీంతో ఈ స్థానంలో మనం గెలవగలుగుతామని భావించిన మోదీ, అమిత్ షా తెలంగాణ బీజేపీలో ఉత్సాహాన్ని తీసుకొచ్చి మాలాంటి నేతలను బలపరిచారు. ఆ ఉత్సాహాన్ని మేం ప్రజల్లోకి తీసుకెళ్లాం. బండి సంజయ్ అధ్యక్షుడయ్యాక యువతకు పార్టీని బాగా చేరువ చేశారు.
ఆర్కే: మరి సంజయ్‌ని ఎందుకు తీసేశారు..?
జితేందర్ రెడ్డి: అధ్యక్షుడిగా మూడేళ్ల పదవీ కాలం అయిపోయింది. అది అధిష్ఠానం నిర్ణయం. ఏది ఏమైనా అధ్యక్షుడిగా సంజయ్ చాలా బాగా పనిచేశారు. కిషన్‌రెడ్డి గారూ అనుభవజ్ఞులు. ఈ ఊపును ఆయన కొనసాగిస్తారని ఆశిస్తున్నా. ప్రజలు కేసీఆర్‌ను ఓడించాలనుకున్నప్పుడు.. వాళ్లకు బీజేపీనే కనిపిస్తుంది.
ఆర్కే: కేసీఆర్ సూచన ప్రకారమే కిషన్‌రెడ్డి నియామకం జరిగిందని, బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య ఒప్పందం కుదిరాకే అలా చేశారనే ఆరోపణలున్నాయి కదా..?
జితేందర్ రెడ్డి: బీఆర్‌ఎస్, బీజేపీకి బీ టీం అని ప్రచారం చేస్తున్నారు. వాళ్లతో కలవాల్సిన అవసరం మాకు లేదు. ప్రజలు కేసీఆర్ పట్ల వ్యతిరేకతతో ఉన్నారు. అలాంటి నేతతో మేం పొత్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అసెంబ్లీలో ఆయన కంటే మెరుగైన స్థానాలు మాకు వస్తాయి.
ఆర్కే: మీకు మోదీతో చనువు ఉంది కదా. ఈ టైంలో సంజయ్‌ని మార్చొద్దని చెబితే బాగుండేది కదా..?
జితేందర్ రెడ్డి: ప్రస్తుత పరిణామాలను బట్టి ఆయనను మార్చరని నేను అనుకున్నా. కిషన్‌రెడ్డికి కూడా కేబినెట్ ర్యాంకును వదులుకోవడం ఇష్టం లేదు. దానికి ఆయన ఒప్పుకోరని అనుకున్నా. అధినేతలు మాలాంటి సీనియర్లను పిలిచి అభిప్రాయం తీసుకుంటారని అనుకున్నా. కేసీఆర్‌ను ఓడించాలని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు. లేకపోతే మోదీ, షా, నడ్డా ఇన్నిసార్లు ఇక్కడికి రారు. ముగ్గురు ప్రధాన కార్యదర్శులను ఇక్కడ నియమించరు.
సంజయ్ అధ్యక్షుడయ్యాక రెండేళ్లుగా మీరంతా కేసీఆర్ అవినీతిపై మాట్లాడారు. ఆయన కుటుంబం జైలుకెళ్లడం తథ్యం అన్నారు.
పత్రికల్లో వార్తలు చూసే మేం నమ్మాం. అందులో నిజం ఉందనే గొంతు విప్పాం.
ఆర్కే: మరి ఏమైంది ఇప్పుడు..?
జితేందర్ రెడ్డి: లిక్కర్ స్కాం కేసు ఈడీ చేతికి వెళ్లింది కదా. వారు పక్కాగా ఆధారాలు సేకరిస్తున్నారు. దోషులకు కనీసం 90 రోజుల వరకు బెయిల్ రాకుండా ఉండేలా పక్కాగా డాక్యుమెంటేషన్ చేస్తున్నామని ఈడీ వాళ్లు చెప్పారు.
మనీష్ సిసోడియాతో సహా చాలా మందిని అరెస్టు చేశారు కదా. కవిత విషయం వచ్చేసరికే డాక్యుమెంటేషన్ అంత పకడ్బందీగా చేయాలా..?
సిసోడియా అడ్డంగా దొరికిపోయాడు. కవిత విషయంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది. కొంత మందికి బయట ఇంకా నూకలు ఉండి ఉంటాయి.
ఆర్కే: కవిత అరెస్టు విషయంలో నాన్చుడు ధోరణి వల్లే బీజేపీపై విశ్వాసం పోతోంది. బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటేననే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడిందని ఈటల, విశ్వేశ్వర్‌రెడ్డి, రాజగోపాల్ అన్నారు కదా..?
జితేందర్ రెడ్డి: వాళ్లు ప్రజల వాణిని వినిపిస్తున్నారు.
ఆర్కే: కేసీఆర్ గతంలో మోదీని విపరీతంగా తిట్టేవారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు..?
జితేందర్ రెడ్డి: మోదీ పిలిచి ‘నిన్ను లోపలేస్తా అంటే భయపడ్డాడేమో’..? అలా ఎందుకు కాకూడదు. మీరు దోస్తానా అనుకుంటున్నారేమో..? నేను అలా కాదని అంటా. మోదీ ఘటికుడు. ఇక్కడ తండ్రీ కొడుకులు తిట్టే వార్తలు ఆయనకు చేరతాయి.
ఆర్కే: మోదీ కేసీఆర్‌ను బెదిరించారా. నోరు మూయకపోతే లోపలేస్తానని..?
జితేందర్ రెడ్డి: బెదిరించి ఉండొచ్చు. ప్రజలు మెచ్చనోడు, అవినీతిపరుడు, అక్రమాలు చేస్తున్న వ్యక్తిని క్లీన్ చిట్ ఉన్న మోదీ వంటి నాయకుడు కౌగిలించుకుంటారని మీరెలా అనుకుంటారు. ఇంగిత జ్ఞానం ఉన్న ఎవరూ దగ్గరికి తీయరు.
ఆర్కే: మోదీ పాలనలో అవినీతి లేదని అంటున్నారు కదా.. మంత్రులను మోదీ అదుపు చేశారు. కానీ, అధికారుల్లో అవినీతి పెరిగింది కదా..?
జితేందర్ రెడ్డి: అధికారుల్లో చాలా పెరిగింది. అవినీతిని నియంత్రిస్తూనే.. దేశాభివృద్ధిపైనా మోదీ దృష్టిసారించారు. రైల్వేలు, విమానాశ్రయాలు, రహదారులు, గ్రామాలు ఎలా అభివృద్ధి చెందుతున్నాయో మనం చూస్తున్నాం. ఇవాళ బిచ్చగాళ్లు, కూరగాయలు అమ్ముకునేటోళ్లు కూడా క్యూ ఆర్ కోడ్ పెట్టుకుంటున్నారు.
కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఒక్కసారిగా పైకి లేచింది. తెలంగాణలో ఇప్పుడు బాగా పుంజుకుంది.
కాంగ్రెస్‌ది వాపు. బలుపు కాదు. టైం ఉంటే ఒక ఉప ఎన్నికకు చాలెంజ్ చేసే వాడిని.
ఆర్కే: మళ్లీ టీఆర్‌ఎ్‌సలోకి వెళతారా..?
జితేందర్ రెడ్డి: లేదు. నా కుమారుడు షాద్‌నగర్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడు. అతడికి టికెట్ రావాలంటే నేను ఈ పార్టీలో యాక్టివ్‌గా ఉండాలి కదా.
ఆర్కే: మీ ఫాంహౌ్‌సలో మీటింగ్ అయిందంటే.. ఏదో ఒకటి జరిగిపోతోంది..?
జితేందర్ రెడ్డి: అక్కడ చేసిందేం లేదు. చేవెళ్లలో విగ్రహావిష్కరణకు దత్తాత్రేయ వచ్చారు. నేను ఆయనను భోజనానికి ఆహ్వానించా. ఆయనతో పాటు పార్టీ రాష్ట్ర ముఖ్య నేతలను కూడా పిలిచా. ఈటల కూడా వచ్చారు. అక్కడ రాజకీయ సమావేశం జరగలేదు. ఈటలకు, నాకూ దోస్తీ కుదిరిందని మీడియా ఏదేదో చెప్పింది.
ఆర్కే: ఈటలతో వివాదం సద్దుమణిగిందా..?
జితేందర్ రెడ్డి: అసలు పంచాయితీనే లేదు. పార్టీలో ఎవరెవరో లీకులు ఇస్తున్నారు. ఏదేదో చేస్తున్నారు. అంతలోనే ఓ దున్నపోతు వీడియో నా దగ్గరికి వచ్చింది. మా వాళ్లకు కూడా ఇలాంటి ట్రీట్‌మెంట్ ఇస్తే అంతా సెట్ అవుతారని భావించి ఆ ట్వీట్ చేశా. దానిని ఎవరికి నచ్చినట్టు వారు అర్థం చేసుకున్నారు.
ఆర్కే: ఈటల ముఖ్యమంత్రి అభ్యర్థా..?
జితేందర్ రెడ్డి: పార్టీ నిర్ణయిస్తుంది. కేసీఆర్ పాలన చూసిన ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కాంగ్రెస్‌ది వాపు అని చెప్పేందుకు ఒక ఉదాహరణ చెప్తా. ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నిజామాబాద్, అదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఆ పార్టీకి అసలు అభ్యర్థులే లేరు.
ఆర్కే: అసలు మీకు అభ్యర్థులు ఎక్కడున్నారు..?
జితేందర్ రెడ్డి: ఎందుకు లేరు. మొన్న 119 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టలేదా? 19 ఎస్సీ స్థానాలకు నేను చైర్మన్‌ను.
ఆర్కే: ఎస్సీలు మీకు ఓటు వేయరు..
జితేందర్ రెడ్డి: ఇప్పుడంతా మాకే వేస్తున్నారు. వాళ్లకు తెలిసిపోయింది. కేసీఆర్ దళిత బంధు ఇవ్వడని, రేవంత్ హవా ఉత్తదేనని.
ఆర్కే: వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదా మీకు..?
జితేందర్ రెడ్డి: మహబూబ్‌నగర్ ఎంపీగా పోటీ చేసి రిటైరవుతా.
ఆర్కే: తరుణ్ ఛుగ్, సునీల్ బన్సల్, శివప్రకాశ్ ఎవరో ఇక్కడి ప్రజలకు తెలియదు. వాళ్లను చూసి ఎవరు ఓటేస్తారు..?
జితేందర్ రెడ్డి: వాళ్లు ప్రజల కోసం కాదు. పార్టీని వ్యవస్థాగతంగా నిర్మిస్తారు. ముగ్గురు ప్రధాన కార్యదర్శులు ఉన్నారంటే.. ప్రజలు వాళ్ల ముఖాలు చూసి ఓట్లు వేస్తారని కాదు. వాళ్లు ఆర్గనైజేషన్‌ను పర్యవేక్షిస్తారు.
Updated Date - 2023-07-30T13:17:21+05:30 IST