ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

OHRK BY Jonnavittula :అసభ్య పదజాలమే భాషైపోయింది

ABN, First Publish Date - 2023-08-14T02:32:05+05:30

‘ఏపీలో పరిస్థితులు చూస్తుంటే బాధగా ఉంది. రాష్ట్రమంటే అభివృద్ధి, పరిపాలన, ప్రజా జీవనం. ఆ వైభవమంతా ఇప్పుడు తుడిచిపెట్టుకుపోయింది’ అంటారు కవి, సినీ గేయ రచయిత, రాజకీయ నాయకుడు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు (Jonnavittula Ramalingeswara Rao). కవిగా పోరాటం చేయడం కష్టమని... అందుకే ఒక రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకున్నానని చెబుతున్న జొన్నవిత్తుల... ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ ‘ఓపెన్‌హార్ట్‌ విత్‌ ఆర్కే’('Openheart with RK')లో మనసు విప్పి మాట్లాడారు.

‘ఏపీలో పరిస్థితులు చూస్తుంటే బాధగా ఉంది. రాష్ట్రమంటే అభివృద్ధి, పరిపాలన, ప్రజా జీవనం. ఆ వైభవమంతా ఇప్పుడు తుడిచిపెట్టుకుపోయింది’ అంటారు కవి, సినీ గేయ రచయిత, రాజకీయ నాయకుడు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు (Jonnavittula Ramalingeswara Rao). కవిగా పోరాటం చేయడం కష్టమని... అందుకే ఒక రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకున్నానని చెబుతున్న జొన్నవిత్తుల... ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ ‘ఓపెన్‌హార్ట్‌ విత్‌ ఆర్కే’('Openheart with RK')లో మనసు విప్పి మాట్లాడారు.

రాజకీయ నాయకుడిగా మీరు చూడకపోయినా, మీ మనసు అంగీకరించినా, అంగీకరించకపోయినా నా మనసుకు తగ్గట్టుగా నేనుండాలి కదా? గత పదేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పరిస్థితి చూస్తుంటే బాధగా ఉంది. పదేళ్లుగా రాజకీయాలు భ్రష్ఠుపట్టిపోయాయి. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో వచ్చిన మార్పు ప్రజల మీద ఎంత ప్రభావాన్ని చూపించింది. రాష్ట్రమంటే అభివృద్ధి, పరిపాలన, ప్రజా జీవనం ఆ వైభవమంతా తుడిచిపెట్టుకుపోయింది. గత పదేళ్లుగా ఒక పెద్ద శూన్యం ఏర్పడిపోయింది. దీన్ని నేను ఒక కవిగా చెప్తే, ఒక కవిగా పాటలో, పద్యంలో ఏదో చెప్తున్నాడు అంటారు. దానికుండే ప్రభావం కూడా తక్కువ. పైగా కవి పోరాటం చేయడం కష్టం. ఒక రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకున్నట్లైతే ఆ భావజాలానికి స్పందించేవాళ్లు, ఒకే భావజాలం ఉన్నవాళ్లు, వీళ్లందరినీ కలుపుకుని, నాదైనటువంటి ఆలోచనను ప్రజలందరికీ తెలియజేసి, రాజకీయంగా ముందుకెళ్లాలని సంకల్పించి, ఈ నిర్ణయం తీసుకున్నాను.

ఆర్కే: వెల్‌కమ్‌ టు ఓపెన్‌ హార్ట్‌. నమస్తే జొన్నవిత్తులు గారూ!

జొన్నవిత్తుల : నమస్కారమండీ రాధాకృష్ణగారూ!

ఆర్కే: ఎలా ఉన్నారు, బాగున్నారా?

జొన్నవిత్తుల : చాలా బాగున్నాను.

ఆర్కే: అమెరికా పర్యటన ముగించుకుని వచ్చినట్టున్నారు? అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయి? అమెరికా బాగుందా? తెలుగువాళ్లు బాగున్నారా?

జొన్నవిత్తుల : అన్నీ బాగున్నాయి.

ఆర్కే: అమెరికాలో తెలుగువాళ్లు అనగానే మీటింగులు, గొడవలు లాంటివి చూస్తూ ఉంటాం ఇక్కడ.

జొన్నవిత్తుల : ఇక్కడ అవి చూస్తారు. కానీ నేనక్కడ ఉన్నాను. అక్కడ వాటిలో పాల్గొన్నాను. నాకు అలాంటి గొడవలేవీ కనిపిచంలేదు. బహుజన శతకం బాగా జరిగింది. నేను రాసిన యజ్ఞేశ్వర శతకం, కుమార వేంకటేశ్వర శతకం వాటి గురించి సభలు జరిగాయి. సీతారామ శాస్త్రి గారి పుస్తకాల ఆవిష్కరణ జరిగింది. అలా సభలన్నీ చక్కగా జరిగాయి.

ఆర్కే: అక్కడ బియ్యం నిండుకున్నాయని వార్తలు వింటున్నాం. మరి అక్కడ భోజనాలు అవీ బాగానే పెట్టారా?

జొన్నవిత్తుల : లేదండీ, మంచి తెలుగు భోజనమే తిన్నాం.

ఆర్కే: మీరు బాగా అభిమానించే ప్రధాని మోదీ బియ్యం ఎగుమతులను నిషేధించారు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి సరదాగా ఒక ప్యారడీ అందుకోకూడదూ?

జొన్నవిత్తుల : ప్యారడీ అనేది కూర్చుని, ఆలోచించి రాసేది.

ఆర్కే: అయితే ఆసువుగా ఏదైనా చెప్పండి.

జొన్నవిత్తుల : అవధానులైతే వెంటనే చెప్తారు. నేను ఆ రంగంలో ఉన్నప్పటికీ, ఆ రంగంలో విశేషంగా కృషి చేసిన వాడిని కాను. అయినా ఆసువుగా అన్నారు గనుక నేను ప్రయత్నం చేస్తాను.

ఆర్కే: బియ్యం, నిషేధం, అమెరికాలో తెలుగువాళ్లు షాపులు ముందు బారులు కట్టడం చూస్తున్నాం. అక్కడేమో బియ్యం దొరకడం లేదు. ఇక్కడేమో గిట్టుబాటు ధరలు దక్కడం లేదు. ఎగుమతులు లేనప్పుడు ఇంత పండించిన బియ్యం ఏం చేయాలి. ఇప్పటికే నిల్వలు ఎక్కువైపోయినయి కదా?

జొన్నవిత్తుల : మీరే కొంత క్లూ ఇచ్చేశారు. అమ్మ నాన్నలు, అతిధులు, అత్తమామ అందరొకసారె వచ్చిరి అమెరికాకు. వీళ్లెవరొచ్చినా ఆరు నెలలు ఉంటారండీ. అమ్మ నాన్నలు, అతిధులు, అత్తమామ అందరొకసారె వచ్చిరి అమెరికాకు. రొట్టె ముక్కలు వారికి పెట్టలేను. వెయ్యి డాలర్లకున్‌ కొందు బియ్యమిపుడు. ఒక బియ్యం మూట సహజంగా 20 లేదా 30 డాలర్లు ఉంటుంది. అది వెయ్యి డాలర్లైనా బియ్యం మూట కొనాల్సిందే. ఆరు నెలల వరకూ అత్తామామా, అమ్మానాన్నలు వెళ్లరు కాబట్టి కొనక తప్పదు. నాలాంటి వాళ్లు తానాకు వెళ్తే భాషాభిమానంతో మా ఇంటికి రండి, అని తీసుకెళ్తారు. కనుక వెయ్యి డాలర్లకున్‌ కొందు బియ్యమిపుడు.

ఆర్కే: కానీ మీరు అభిమానించే ప్రధానమంత్రి ఇప్పుడెందుకిలా చేశాడు?

జొన్నవిత్తుల : ప్రతి దానికీ వాళ్ల కారణం వాళ్లకు ఉంటుందండీ. ఆ కారణం నేను చెప్పలేను కదా?

ఆర్కే: మీ పిల్లలేం చేస్తున్నారు?

జొన్నవిత్తుల : నాకు ముగ్గురు పిల్లలు. అమ్మాయిలిద్దరూ కమల పిల్లలు. ఒకమ్మాయి ఎమ్‌టెక్‌. ఒకమ్మాయి ఎమ్‌బిఎ. అబ్బాయి బిటెక్‌. ముగ్గురూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మా పిల్లలు మూడో తరగతిలో మమ్మల్ని మమ్మీ, డ్యాడీ అని పిలవడం మొదలు పెట్టారు. నేను కేకలేసి అమ్మా, నాన్న అనమని చెప్పేవాడిని. అలా సంబోధిస్తే, స్కూల్ల్లో టీచర్లు కేకలేసేవాళ్లు. దాంతో పిల్లలు బిక్కమొఖం వేసేవాళ్లు. ఆలోగా ఫీజు కట్టే సందర్భం వచ్చింది. అప్పుడు వాళ్లను స్కూలు మాన్పించేశా. పద్యాలు, పాఠాలు నేనే నేర్పించాలని నిర్ణయించుకున్నా. అప్పట్లో నేను తెలుగు అధికారా భాష సంఘ సభ్యుడిని. అలా ఒక అంతర్మథనంతో పిల్లల్ని స్కూలు మాన్పించి, 60, 70 పద్యాలు నేర్పించా. అలా ఆ సంవత్సరం గడిచాక, నాలుగు నుంచి ఆరో తరగతిలోకి మార్చి బడిలో చేర్పించా. ఇప్పటికీ మా పిల్లలు లలితా సహస్రనామాలు చదువుకుంటారు. అలా తల్లితండ్రులు కూడా పిల్లలకు వారానికో పద్యం నేర్పిస్తే, 52 వారాలకూ 52 పద్యాలు వచ్చేస్తాయి. అలా ఒక ఐదేళ్లు నేర్పితే, పిల్లలకు 250 పద్యాలు వచ్చేస్తాయి.

ఆర్కే: మీరీమధ్య లౌక్యం బాగానే నేర్చుకున్నారు.

జొన్నవిత్తుల : లౌక్యం కాదు కానీ, జాగ్రత్త.

ఆర్కే: మొదట్లో ఈ లౌక్యం లేదు. ఈమధ్య రెండు ఎదురు దెబ్బలు తగలడం వల్ల లేదంటే తలనొప్పులు రావడం వల్ల నేర్చుకున్నారు.

జొన్నవిత్తుల : అలాంటి పరిస్థితుల్లో నా బదులు త్యాగరాజస్వామి వారు ఉన్నా కూడా, శాంతము లేక సౌఖ్యము లేదని రాసే పరిస్థితి ఇవ్వాళ. సమాజం అలా ఉంది కాబట్టి లౌక్యం కూడా అవసరమే!

ఆర్కే: ప్రతి వాళ్లూ లౌక్యమే అనుకుంటే, సమాజానికి మార్గదర్శకత్వం చేయవలసింది ఎవరు?

జొన్నవిత్తుల : లౌక్యంగా ఉంటూ మార్గదర్శకత్వం వహించాలి.

ఆర్కే: ఇవి రెండూ ఒక ఒరలో ఇమడవు కదా?

జొన్నవిత్తుల : ఇది కూడా ఒక సాధనే! లౌక్యం అంటే గోడ మీద పిల్లిలా ఉన్నా నయమే! అటో ఇటో, కానీ కొండ మీద కోతిలా ఉన్నారు.

ఆర్కే: పార్టీ పెడతామన్నాప్పుడు ఏమన్నారు మీ హితులు, సన్నిహితులు?

జొన్నవిత్తుల : మీరు చిరునవ్వులు నవ్వుతున్నారు. కానీ వాళ్లందరూ పకాపకా నవ్వారు.

ఆర్కే: ఈ భ్రష్ఠుపట్టిపోయిన రాజకీయ సుడిగుండంలో దూకి దాన్నెలా బాగుచేయగలుగుతారు?

జొన్నవిత్తుల : ఈ భ్రష్ఠుపట్టిన రాజకీయాల్లో కొన్ని విలువలతో కూడిన ఒక సమూహాన్ని ఏర్పాటు చేయగలిగితే, తేడాను ప్రజలు తప్పకుండా గమనిస్తారు. ముఖ్యంగా భాషా సంస్కృతి బాగా దెబ్బతింది. దీన్ని ఎవరూ గమనించరు. ఆర్థిక నష్టం జరిగితే బాధపడతారు. భాషా సంస్కృతుల విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న, జరిగిన అన్యాయం ఇంతా అంతా కాదు. దీని కోసం మాట్లాడకపోతే, అశ్లీలం, అసభ్య పదజాలమే భాషైపోయింది.


ఆర్కే: ఇప్పుడు మీరు తెలుగు భాష, సంస్కృతి గురించి ఇంత ఆవేదన చెందారు కదా? వీటి గురించి మాట్లాడేవాళ్లు పెత్తందారులు అంటున్నాడు ముఖ్యమంత్రి

జొన్నవిత్తుల :మనం మాట్లాడే కోణాన్ని బట్టి వాళ్లు మాట్లాడతారండి. నాతో మాట్లాడమనండి. ఆంగ్ల భాషా మాధ్యమంలో నేర్పిస్తున్నారు కదా? మీ పిల్లలకు చెప్పట్లేదా అంటారు? దానికెవరూ సమాధానం చెప్పలేరు.

ఆర్కే: ఎందుకు చెప్పలేరు. అసలు తెలుగు సబ్బెక్టులను తీసేయడం వల్లే కదా ఈ సమస్యంతా? ఇప్పుడు ఉన్న విద్యా విధానంలో తెలుగు లేదు.

జొన్నవిత్తుల :అయితే ఒక మీడియా అధినేతగా మీరు దీని మీద ప్రతి రోజూ ఒక కార్యక్రమం పెట్టాలి.

ఆర్కే: తమిళులు, కన్నడిగుల్లా ఇంగ్లీషుతో పాటు మాతృభాష కూడా నేర్చుకుని ఉండాలి.

జొన్నవిత్తుల :ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుకు మహా వైభవం తెచ్చినవాళ్లు తమిళనాడులోనే ఎక్కువ మంది ఉన్నారు. రాజకీయ రంగంలో చూస్తే ఉత్తరాంధ్రప్రదేశ్‌లో తెన్నేటి విశ్వనాథం లాంటి మహామహులున్నారు. గురజాడ, శ్రీశ్రీ, గిడుగు రామ్మూర్తి పంతులు, రావి శాస్త్రి, కారా మాష్టారు.... ఇలా వందల మంది ఉన్నారు. ఈ మహామహులనే వాళ్లు ఉన్నారనే విషయం కూడా ఇప్పుడు ఎవరికీ తెలియదు. ఉగాది, గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి నాడు మాత్రమే వీళ్లందర్నీ మేం గుర్తు చేసుకుంటూ ఉంటాం.

ఆర్కే: అధికారం, ప్రతిపక్షం కాదు అందరి భాషా దిగజారింది. అందరూ ఆ తానులో ముక్కలే!

జొన్నవిత్తుల : మీరు కరెక్టుగా చెప్పారు. నా ప్రధాన ఉద్దేశం ఏంటంటే, అటు రాజకీయ నాయకులకూ, ఇటు ప్రజలకూ భాషాసంస్కృతుల పట్ల అవగాహన ఏర్పరచడం. అందుకోసం నిలబడి పోరాడాలని అందుకు ఒక రాజకీయ వేదికగా దీన్ని ఏర్పాటు చేసుకున్నాను.

ఆర్కే: ఇప్పుడు మీరు రాజకీయాల్లోకి అడుగు పెడితే, అందరూ అయిపోయారు, ఇక ఈయన బయల్దేరాడు అని అంటారు.

జొన్నవిత్తుల :అది సహజం. అలా అనిపించుకోవడం నాకు అవసరమే! జాతి కోసం, భాష కోసం నేనొక దృఢమైన నిశ్చయంతో ఉన్నాను.

ఆర్కే: దానికి జై తెలుగు పార్టీ అని పెట్టారా?

జొన్నవిత్తుల :అవునండీ. మీకెందుకీ రాజకీయాలు అన్నారు కదా! అందుకు మీకో కథ చెప్తాను. బుద్ధుడి బోధనలన్నీ విన్న మంచి శిష్యుడు ఒక స్థాయికి వచ్చిన తర్వాత, బుద్ధుడికి నమస్కారం పెట్టి, గురువుగారూ, ప్రజలందరూ రకరకాల బాధల్లో ఉన్నారు. కాబట్టి నేను వాళ్ల దగ్గరకు వెళ్లి మీ బోధలన్నీ చెప్పి, రాగద్వేషాల నుంచి వాళ్లను విముక్తుల్ని చేస్తాను అన్నాడు. అప్పుడు బుద్ధుడు, పిచ్చివాడా, వాళ్లు ఇవన్నీ వినర్రా అని మీరు చెప్పినట్టే చెప్పాడు. అందుకు శిష్యుడు.. వినేవాడు వింటాడు, వినని వాడు వినడు. నేను వెళ్తాను అన్నాడు. అందుకు బుద్ధుడు, బౌద్ధారామంలో తన్ని తరిమేస్తే, ఇక్కడకొచ్చి మనకు బోధలు చేస్తానంటున్నాడు అని అనుమానిస్తారు అని కూడా చెప్పాడు. అలాగే అంతటితో వదలకుండా ప్రజల గురువు నీ ప్రాణాలను కూడా తీయవచ్చు. అని బుద్ధుడు చెప్పినప్పుడు శిష్యుడు, ధర్మం కోసం ప్రాణాలు పోయినా ఫర్వాలేదని అన్నాడు. అప్పుడు బుద్ధుడు, ప్రజలకు మంచి చేయడం కోసం ఈ స్థాయికి చేరుకోవడం అవసరం అని చెప్పి ప్రజల దగ్గరకు వెళ్లమని అన్నాడు. రాజకీయాల్లో కూడా ఇలాంటివన్నీ సహజం. భాష గురించి మాట్లాడడం వల్ల ప్రజల్లో నమ్మకం కలిగి, మద్దతిస్తారు. దాంతో జాతికి శ్రేయస్సు కలుగుతుంది అనే దృఢమైన విశ్వాసంతో నేను రాజకీయాల్లోకి వచ్చాను.

ఆర్కే: హైదరాబాద్‌లో ఉంటున్న ఆంఽధ్ర మూలాలున్నవాళ్లు, తెలుగు ప్రముఖులతో సంబంధమున్న ఆంధ్రులెవరూ కూడా ఏమీ మాట్లాడడం లేదు.

జొన్నవిత్తుల :సమాజంలో పలుకుబడి ఉన్నవాళ్లే మాట్లాడలేని పరిస్థితి ఉన్నప్పుడు, సామాన్యుడికి మనసులో ఉన్నా వాడెందుకు మాట్లాడతాడు?

ఆర్కే: మీరు పెళ్లిళ్లు, భార్యల మీద విపరీతంగా ప్యారడీలు రాశారు కదా?

జొన్నవిత్తుల : ఇప్పుడు అవేవీ గుర్తు లేవు. అయితే మనం పది రకాలుగా చూసిన సారాన్ని ఈ జాతికి అందించపోతే జాతి ఏమయిపోతుంది.

ఆర్కే: మీ ఆవేదన అర్థమైంది. ఇప్పుడు మీరు రాజకీయ పార్టీని కూడా ప్రకటించబోతున్నారు కనుక, ఆ వేదిక ద్వారా మీరు తెలుగు సంస్కృతి, భాష, వైభవాలను పునరుద్ధరించాలని కోరుకుంటూ థ్యాంక్యూ వెరీమచ్‌ అండీ.

Updated Date - 2023-08-15T12:04:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising