Maharashtra: షిండేతో 33 మంది ఎమ్మెల్యేల సంప్రదింపులు, మంత్రి సంచలన వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2023-04-28T17:50:10+05:30
మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారబోతోందా? శివసేన ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తో రెండు విపక్షాలకు చెందిన...
ముంబై: మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారబోతోందా? శివసేన ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde)తో రెండు విపక్షాలకు చెందిన 33 మంది ఎమ్మెల్యేలు సంప్రదింపులు జరుపుతున్నారా?. అవునంటూ మహారాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్ సామంత్ (Uday Samant) శుక్రవారంనాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. షిండే వర్గంతో కలిసి బీజేజీ కూటమి మహారాష్ట్రలో ప్రస్తుతం అధికారంలో ఉండగా, దేవేంద్ర ఫడ్నవిస్ తిరిగి సీఎం పగ్గాలు చేపట్టనున్నారని, ఆయన డిప్యూటీగా షిండే ఉండబోతున్నారని, ఎన్‌సీపీ నేత అజిత్ పవార్, ఆయన మద్దతుదారులైన పలువురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోతున్నారంటూ ఊహాగానాలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో మహారాష్ట్ర మంత్రి తాజా వ్యాఖ్యలు మరింత సంచలనమవుతున్నాయి.
ఉద్ధవ్ థాకరే వర్గానికి చెందిన 13 మంది ఎమ్మెల్యేలు, నేషనల్ కాంగ్రెస్ పార్టీ (NCP)కి చెందిన మరో 20 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేతో సంప్రదింపులు సాగిస్తున్నారని ఉదయ్ సావంత్ వెల్లడించారు. ఆసక్తికరంగా మహేబలేశ్వర్‌లో షిండేతో మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే రహస్యంగా సమావేశం జరిపినట్టు కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే, సావంత్ వ్యాఖ్యలపై ఇంతవరకూ అటు ఉద్ధవ్ వర్గం నుంచి కానీ ఎన్‌సీపీ నుంచి కానీ ఎలాంటి స్పందన రాలేదు.
నాడు అవిభక్త శివసేన...
2019 అసెంబ్లీ ఎన్నికల్లో అవిభక్త (Undivided) శివసేన, భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేశాయి. బీజేపీ 100కి పైగా సీట్లు గెలుచుకుంది. రెండు పార్టీలు కలిసి 288 మంది సభ్యుల అసెంబ్లీలో 150కి పైగా సీట్లు సాధించాయి. అయితే గత ఏడాది జూన్‌లో శివసేనలో చీలక ఏర్పడింది. ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు శివసేన నేతగా ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వాన్ని కుప్పకూల్చారు. బీజేపీతో కలిసి షిండే ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటైంది. శివసేన పార్టీ పేరు, గుర్తును కూడా ఇటీవల షిండే వర్గానికి ఎన్నికల కమిషన్ కేటాయించింది.
వ్యూహం మార్చిన బీజేపీ?
ఈ క్రమంలోనే బీజేపీకి ఉన్న బలాబలాలను మదింపు వేసుకున్న బీజేపీ... వచ్చే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని షిండే నుంచి తిరిగి సీఎం పగ్గాలను ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు అప్పగించేందుకు పావులు కదుపుతున్నట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం. షిండేకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనే యోచనలో కూడా ఆ పార్టీ ఉంది. 2024లో అత్యధిక ఎంపీ సీట్లు గెలుచుకోవాలన్నా, తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పట్టు సాధించాలన్నా అధికార మార్పు (సీఎం మార్పు) అనివార్యమని ఆ పార్టీ భావిస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం కర్ణాటక బీజేపీ నేతలు కూడా అధిష్ఠానం వద్ద బలమైన వాదనలు వినిపించడంతో కర్ణాటక ఎన్నికల (మే 10) వరకూ ఆగాల్సిందిగా అధిష్ఠానం వారిని బుజ్జగించినట్టు వార్తలు వచ్చాయి.
అజిత్ పవార్ సైతం...
మరోవైపు, కర్ణాటకలో గట్టి పట్టున్న నేతగా పేరున్న శరద్ పవార్ ఎన్‌సీపీ పార్టీలో సైతం లుకలుకలు మొదలయ్యాయరనే ప్రచారం జరుగుతోంది. ఇందుకు తగినట్టుగానే శరద్ పవార్ మేనల్లుడు, ఎన్‌సీపీ నేత అజిత్ పవార్ ఇటీవల సీఎం కావాలనే ఆకాంక్షను బహిరంగంగానే ప్రకటించారు. ఇందుకోసం 2024 అసెంబ్లీ ఎన్నికల వరకూ వేచిచూడాల్సిన పని లేదని కూడా అన్నారు. దీంతో ఆయన, ఆయన అనుచరం వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడం ఖాయమనే ప్రచారం ఊపందుకుంది. ఈ ప్రచారాన్ని అజిత్ పవార్ వెంటనే ఖండించినప్పటికీ, దీని వెనుక బీజేపీ వ్యూహం ఉందని ఎన్‌సీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. శరద్ పవార్ సైతం నేరుగా అజిత్ పవార్ పేరు ప్రస్తావించకుండా ఎన్‌సీపీని చీల్చే ప్రయత్నాలను సాగనీయమని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ క్రమంలో ఎన్‌సీపీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు షిండేతో సంప్రదింపులు జరుపుతున్నారంటూ మహారాష్ట్ర మంత్రి స్వయంగా ప్రకటించడం మరోసారి ఎన్‌సీపీ వర్గాలనే కాకుండా, ఉద్ధవ్ థాకరే వర్గాన్ని కూడా ఉలిక్కిపడేలా చేసింది. ఒకవేళ అజిత్ పవార్ పార్టీ మారిస్తే, ఆయన ఆశించిన విధంగా ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టేందుకు బీజేపీకి సుముఖంగా ఉంటుందా? షిండేతో పాటు ఆయనకు కూడా ఉప ముఖ్యమంత్రి పదవి కట్టుబెడుతుందా? దేవేంద్ర ఫడ్నవిస్‌ను మరోసారి కాదని అజిత్‌కు సీఎం పగ్గాలు అప్పగిస్తే అప్పుడు కూడా ఫడ్నవిస్ పార్టీ విధేయతను చాటుకుంటారా? అనేవి ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశాలవుతున్నాయి.
Updated Date - 2023-04-28T17:50:10+05:30 IST