AP CS Jawahar Reddy: ఏపీ సీఎస్ జవహర్‌రెడ్డి మరీ ఇంత ఖాళీగా ఉన్నారా..? ఈ డౌట్ ఎందుకొచ్చిందంటే..
ABN, First Publish Date - 2023-02-04T12:43:43+05:30
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విధులేంటి..? ఇదేదో జనరల్ నాలెడ్జ్ కోసం అడిగిన ప్రశ్న అనుకుంటే పొరపాటే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి (AP Chief Secretary Jawahar Reddy) తీరు చూశాక రాజకీయాల్లో..
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విధులేంటి..? ఇదేదో జనరల్ నాలెడ్జ్ కోసం అడిగిన ప్రశ్న అనుకుంటే పొరపాటే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి (AP Chief Secretary Jawahar Reddy) తీరు చూశాక రాజకీయాల్లో తలలు పండిన వారిలో కూడా తలెత్తిన ప్రశ్న. సీఎస్ వ్యవహారశైలి అంతుచిక్కక తల గోక్కుంటున్న వారిలో మెదిలిన ప్రశ్న. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి (AP CM Jagan) సొంత సామాజిక వర్గం, సొంత నియోజకవర్గం పులివెందుల (Pulivendula) చెందిన జవహర్‌రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కంటే కూడా జగన్‌కు సొంత మనిషిగా, నమ్మిన బంటులా పనిచేసేందుకే ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారని తాజా పరిణామాలు చూశాక రాజకీయ వర్గాలు గుసగులాడుకుంటున్నాయి. అంతెందుకు.. జవహర్ రెడ్డి ప్రవర్తనపై వైసీపీలోనే ఆసక్తికర చర్చ నడుస్తోంది.
వివేకా హత్య కేసులో (Viveka Murder Case) విచారణ ఎదుర్కొన్న సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి (CM Jagan OSD KrishnaMohan Reddy), సతీమణి భారతి (Jagan Wife Bharathi) వద్ద సహాయకుడిగా పనిచేసే నవీన్‌ను (Naveen) సీఎస్ కంటికి రెప్పలా కాపాడుకుంటూ రావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి శుక్రవారం కడప జిల్లా సింహాద్రిపురం మండలం భానుకోటలో పార్వతీ సమేత సోమేశ్వరాలయ పునరుద్ధరణ వేడుకల్లో వైఎస్ అవినాశ్‌రెడ్డితో (YS Avinash Reddy) కలిసి పాల్గొన్నారు. కార్యక్రమం ముగించుకుని సాయంత్రం 5.30గంటల ప్రాంతంలో కడప సెంట్రల్ జైలు మీదుగా సీఎస్ రేణిగుంటకు బయల్దేరారు. ఆ తర్వాత ఐదు నిమిషాలకే... కృష్ణమోహన్ రెడ్డి, నవీన్‌ల విచారణ ముగిసింది. అక్కడి నుంచి కొద్దిదూరంలో సీఎస్ వేచి చూస్తుండగా... ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. ఇద్దరూ కలిసి ఒకే వాహనంలో రేణిగుంటకు, అక్కడి నుంచి విమానంలో విజయవాడకు వెళ్లినట్లు తెలిసింది. వీరితో పాటు నవీన్ కూడా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఈ పరిణామాలన్నీ నిశితంగా పరిశీలిస్తే.. ఏపీ సీఎస్ వ్యవహారశైలిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం జగన్ సొంత బాబాయ్ హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తులను వెంటబెట్టుకుని మరీ తాడేపల్లికి సీఎస్ తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటనే అనుమానాలు తలెత్తుతున్నాయి. వైఎస్ వివేకా హత్య రెండు తెలుగు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసింది. అలాంటి కీలక హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తులను కడప నుంచి తాడేపల్లికి తరలించేంత ఖాళీగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉండటం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. ప్రభుత్వంలో పాలనాపరంగా ముఖ్యమంత్రి తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిదే కీలక పాత్ర. ప్రభుత్వపరంగా సీఎం తీసుకునే ప్రతీ నిర్ణయం అమలులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రమేయం తప్పనిసరిగా ఉంటుంది. అలాంటి స్థానంలో ఉన్న జవహర్ రెడ్డి.. సీఎం సతీమణి భారతి అటెండర్ నవీన్ కోసం, సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి కోసం వేచి ఉండేంత ఖాళీగా ఉండటంతో పాటు, అంత అవసరం ఏంటనే చర్చ కూడా నడుస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే.. ఆ పికప్ సర్వీస్‌ను ఏపీ సీఎస్ భుజానికెత్తుకోవడం రాజకీయ వర్గాలను విస్తుపోయేలా చేసింది.
వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు వైఎస్ వివేకా హత్య కేసు విచారణ ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కుటుంబ సభ్యుడైన కడప ఎంపీ అవినాష్ రెడ్డిని, సీఎం జగన్ ఓఎస్డీని, సతీమణి భారతి వద్ద సహాయకుడిగా పనిచేసే నవీన్‌ను సీబీఐ అధికారులు విచారించడంతో వివేకా హత్య కేసు మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైఎస్ కుటుంబానికి వీర విధేయత చూపించడం జవహర్‌రెడ్డి వ్యక్తిగత విషయం కావొచ్చేమో కానీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తూ బాధ్యతలను విస్మరించి మరీ విధేయతను చాటుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పైగా.. సీఎస్ చేయాలే కానీ ప్రభుత్వపరంగా నిర్వర్తించాల్సిన విధులు చాలానే ఉన్నాయి. ‘‘ఉద్యోగులకు వేతన, ఆర్థిక చెల్లింపులకు ప్రభుత్వం చట్టం చేయాల్సిందే. గవర్నర్‌ను కలవడం సరైన నిర్ణయమే. క్లిష్ట సమయంలో ఉద్యోగులకు నాయకులు అండగా నిలబడాలి. ఈఎంఐలు కట్టుకోలేకపోతున్నాం. తిరుపతి వెంకన్ననైనా దర్శించుకోవచ్చేమో కానీ, ఈ ముఖ్యమంత్రిని కలవలేం’’ అని ఉద్యోగ సంఘాల నాయకులు నెత్తీనోరూ బాదుకుంటున్నారు. జగన్ ఓఎస్డీ, భారతి అటెండర్‌ను తాడేపల్లికి తీసుకెళ్లే విషయంలో చూపించే ఉత్సాహం ఏదో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చూపిస్తే ఏపీ సీఎస్ జవహర్‌రెడ్డిని ఉద్యోగులు గుర్తుంచుకుంటారు.
ఇదిలా ఉండగా.. అవినాశ్ రెడ్డిని వివేకా హత్య కేసులో విచారించినప్పటి నుంచీ వైసీపీ అధినేత జగన్‌లో గుబులు మొదలవడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. గత నెల 28వ తేదీన ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు హైదరాబాద్‌లో విచారించిన సంగతి తెలిసిందే. ఇందులో ఆయన కాల్‌డేటా కీలకంగా మారింది. వివేకానంద రెడ్డి హత్యకు గురైన రోజున, ఆ తర్వాత... భారతితో మాట్లాడేందుకు నవీన్‌కు, జగన్‌తో మాట్లాడేందుకు మరో నంబర్‌కు అవినాశ్ రెడ్డి పలుమార్లు కాల్ చేసినట్లు ఆ విచారణలో తేలింది. ఆ మరో వ్యక్తి ఇంకెవరో కాదని... జగన్ ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డేనని స్పష్టమైంది. దీంతో.. తాడేపల్లి ప్యాలెస్‌లో కలకలం రేగింది. ఆగమేఘాల మీద జగన్ ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి, భారతి అటెండర్ నవీన్‌ను సజ్జల వెనకేసుకొచ్చేందుకు ముందుకు రావడం గమనార్హం. అవినాష్‌రెడ్డి ఆ ఇద్దరికీ కాల్ చేస్తే తప్పేంటని మీడియానే సజ్జల ఎదురు ప్రశ్నించిన పరిస్థితి. ఈ మొత్తం ఎపిసోడ్‌లో సీఎస్ జవహర్‌రెడ్డి వ్యవహారశైలి వివాదాస్పదంగా మారింది.
2009 ఆగస్టులో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి స్పెషల్ సెక్రటరీగా జవహర్‌రెడ్డి నియమితులయ్యారు. 2014 ఫిబ్రవరిలో పరిశ్రమల శాఖ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. అనంతరం పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి, ముఖ్య కార్యదర్శిగా ఐదేళ్ల పాటు పని చేశారు. 2019లో జగన్ ప్రభుత్వం రాగానే వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా ఆయన్ను నియమించింది. ఆ సమయంలోనే స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పదోన్నతి లభించింది. తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) ఈవోగా ఆయన 19 నెలల పాటు పని చేశారు. అనంతరం ప్రభుత్వం జలవనరుల శాఖ స్పెషల్ సీఎస్‌గా బదిలీ చేసింది. అక్కడ మూడు నెలలు మాత్రమే విధులు నిర్వహించిన ఆయన.. 2022 ఫిబ్రవరిలో సీఎం స్పెషల్ సీఎస్‌గా.. 2022 నవంబర్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 31 ఏళ్లుగా ఆయన నిర్వహిస్తూ వచ్చిన ప్రతి పోస్టూ కీలకమైనదే కావడం విశేషం. వైఎస్ కుటుంబానికి అప్పటి నుంచీ ఇప్పటివరకూ జవహర్ రెడ్డి విశ్వాసపాత్రుడిగానే ఉన్నారు.
Updated Date - 2023-02-04T13:32:35+05:30 IST