Khammam Politics : పొంగులేటి కాంగ్రెస్‌లో చేరుతుండటంతో.. అన్ని పార్టీల చూపు ఖమ్మం వైపే.. కేసీఆర్ ఏం చేయబోతున్నారంటే..!?
ABN, First Publish Date - 2023-06-26T13:28:45+05:30
తెలంగాణ రాజకీయాలు చేరికలతో హీటెక్కాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అధిష్టానాలు కీలక నేతలను చేర్చుకునే పనిలో బిజిబిజీగా ఉంటున్నాయి. బీఆర్ఎస్ బహిష్కృత నేతలైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావును కాంగ్రెస్ చేర్చుకుంటూ ఉండటంతో.. గులాబీ బాస్ కేసీఆర్ కూడా వ్యూహరచన చేసుకుంటూ వెళ్తున్నారు. ఎవరైతే కాంగ్రెస్ బడా నేతలు అసంతృప్తిగా ఉన్నారో.. వారందరికీ గాలం వేసే పనిలో ఉన్నారు..
తెలంగాణ రాజకీయాలు (TS Politics) చేరికలతో హీటెక్కాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) అధిష్టానాలు కీలక నేతలను చేర్చుకునే పనిలో బిజిబిజీగా ఉంటున్నాయి. బీఆర్ఎస్ బహిష్కృత నేతలైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) , జూపల్లి కృష్ణారావును (Jupally Krishna Rao) కాంగ్రెస్ చేర్చుకుంటూ ఉండటంతో.. గులాబీ బాస్ కేసీఆర్ కూడా వ్యూహరచన చేసుకుంటూ వెళ్తున్నారు. ఎవరైతే కాంగ్రెస్ బడా నేతలు అసంతృప్తిగా ఉన్నారో.. వారందరికీ గాలం వేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే సీనియర్ నేతలు జానారెడ్డి (Janareddy) , ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) , జగ్గారెడ్డి(Jagga Reddy) లకు కండువా కప్పడానికి కేసీఆర్ సిద్ధమయ్యారు. మరోవైపు బీజేపీలో చేరిన నేతలు, సీనియర్లతో కూడా కేసీఆర్ టచ్‌లోకి వెళ్లారని కూడా బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నాయి. అయితే.. ఇప్పుడు పొంగులేటి కాంగ్రెస్‌లో చేరుతుండటంతో ఖమ్మంలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో గెలిచి తీరాల్సిందేనని గులాబీ బాస్ వ్యూహరచన చేస్తున్నారు. ఇంతకీ కేసీఆర్ ఏం చేయబోతున్నారు..? ఖమ్మంలో కాంగ్రెస్, బీజేపీల పరిస్థితేంటి..? ఈ రెండు పార్టీలు ఏంచేయబోతున్నాయి..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..
పొంగులేటి ఇలా..!
చాలా రోజుల తర్వాత ఏ పార్టీలో చేరాలనేదానిపై పొంగులేటి, జూపల్లి ఇద్దరూ ఓ నిర్ణయానికొచ్చేశారు. హైదరాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్ వేదికగా అనేకసార్లు సమావేశాల తర్వాత కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఈ ఇద్దరు కీలక నేతలు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా కలవబోతున్నారు. ఈ భేటీ అనంతరం రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు పొంగులేటి ప్రకటన చేయనున్నారు. అదేవిధంగా జూలై మొదటి వారంలో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ బహిరంగ సభ ఉంటుందని.. రాహుల్, ఇతర ముఖ్యనేతలు హాజరుకానున్నారు. మరోవైపు.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy), పలువురు సీనియర్ నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలతో పాటు.. జానారెడ్డి, షబ్బీర్ అలీ, రేణుకా చౌదరి సహా 12 మంది సీనియర్ నేతలతో పార్టీ పెద్దలు ప్రత్యేకంగా భేటీ అవుతారు. ఈ ఇద్దరి చేరిక తర్వాత మరికొందరు కీలక నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని నేతలు చెబుతున్నారు. అయితే.. పొంగులేటి కాంగ్రెస్‌లో చేరుతుండటంతో ఖమ్మం రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
కేసీఆర్ ప్లాన్ ఇదీ..!
హాట్ కేక్‌గా పొంగులేటిని చేర్చుకోవడానికి బీజేపీ, కాంగ్రెస్‌లు పోటాపోటీగా మంతనాలు జరిపాయి. అయితే కన్నడనాట కాంగ్రెస్ అఖండ విజయంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. పొంగులేటి కాంగ్రెస్ చేరుతుండటంంతో ఖమ్మం రాజకీయాలు హీటెక్కాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల మధ్య హోరా హోరీగా పోటీకి అవకాశం ఉంది. ఈ క్రమంలో ఖమ్మంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఫుల్ ఫోకస్ పెట్టాయి. ఈ పరిస్థితుల్లో రంగంలోకి దిగిన కేసీఆర్.. గత రెండు ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు మళ్ళీ రిపీట్ కావద్దని.. 10కి పది స్థానాలు గెలవాలని జిల్లా ముఖ్య నేతలను కేసీఆర్ హెచ్చరించారు. ఇప్పట్నుంచీ అన్ని పక్కాగా చేసుకుంటూ వెళ్లాలని నేతలకు గులాబీ బాస్ హెచ్చరించారట. ఎలాగైనా సరే కాంగ్రెస్‌కు చెక్ పెట్టే విధంగా కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. కాంగ్రెస్ భారీ బహిరంగ సభ ఏర్పాటుకు ప్లాన్ చేస్తుండగా.. కేసీఆర్‌తో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు, భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తయితే ఇదివరకే భారీబహిరంగ సభను రద్దు చేసుకున్న బీజేపీ.. మరోసారి కేంద్రహోం మంత్రితో భారీగా ప్లాన్ చేయాలని కమలనాథులు భావిస్తున్నారు.
సిట్టింగ్‌లకు ఎసరేనా..?
ఉమ్మడి ఖమ్మం విషయంలో కేసీఆర్ చాలా వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నట్లు బీఆర్ఎస్ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాలు నేపథ్యంలో జిల్లా లోని బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కొందరిని మార్చే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో సిట్టింగ్‌లో ఎవరికి ఎసరు పడుతుందో అని నేతల్లో అలజడి మొదలైంది. ఈ మధ్యనే కేసీఆర్ జులై-15న 80 అభ్యర్థులతో తొలిజాబితాను జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. మిగిలిన సీట్లలో సర్దుబాటు, కొత్తవారికి టికెట్లు ఇవ్వడం, పొత్తు ఇలాంటివి ఉంటాయని వార్తలు బయటికి వచ్చాయి. అయితే.. ఆ జాబితాలో ఖమ్మం జిల్లా సిట్టింగ్‌ల పేర్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది. అందుకే ఈ విషయం పసిగట్టిన బీజేపీ, కాంగెస్ ఖమ్మంపై సీరియస్‌గా దృష్టి పెడుతున్నాయి.
మొత్తానికి చూస్తే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాపై పట్టు సాధించడానికి అధికార, ప్రతిపక్షాలు ఎవరి వ్యూహాల్లో వారు ఉంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఫైనల్‌గా పొంగులేటిని నమ్ముకుని పార్టీలో చేర్చుకుంటున్న కాంగ్రెస్‌కు ఏ మాత్రం కలిసొస్తుంది..? ఈసారి 10కి 10 గెలవాలనే లక్ష్యంతో ఉన్న బీఆర్ఎస్ వ్యూహాలు ఎంతమేరకు వర్కవుట్ అవుతాయి..? కమలనాథుల వ్యూహ రచన ఏమాత్రం బీజేపీకి కలిసొస్తుందో వేచి చూడాల్సిందే మరి.
ఇవి కూడా చదవండి..
YSRCP : పవన్‌పై అక్కసు వెళ్లగక్కుతూ అసలు విషయం చెప్పేసిన ముద్రగడ.. అదేంటో కాపులకు తెలిస్తే..?
Vijayasai Retirement : వైసీపీలో పెను సంచలనం.. అయ్యో పాపం సాయిరెడ్డి.. జగన్ ఇలా తీసిపడేశారేంటి..!
Updated Date - 2023-06-26T13:43:42+05:30 IST