PK Vs SK : ఈ ఒక్కటీ జరిగితే ‘పీకే’ పని అయిపోయినట్టేనా.. ఇక ఫ్యూచర్ అంతా ‘ఎస్కే’దేనా.. ఇంతకీ ఎవరీయన.. బ్యాగ్రౌండ్ ఏంటి..!?
ABN, First Publish Date - 2023-06-02T17:23:52+05:30
సునీల్ కనుగోలు (Sunil Kanugolu) .. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరు ఓ రేంజ్‌లో వినిపిస్తోంది.. ఏ ఇద్దరు కలిసినా ఈయన గురించే చర్చించుకుంటున్నారు.. నిన్న, మొన్నటి వరకూ ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లోనే..
సునీల్ కనుగోలు (Sunil Kanugolu) .. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరు ఓ రేంజ్‌లో వినిపిస్తోంది.. ఏ ఇద్దరు కలిసినా ఈయన గురించే చర్చించుకుంటున్నారు.. నిన్న, మొన్నటి వరకూ ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లోనే (Telugu States) కాస్తో కూస్తో తెలుసేమో గానీ ఇప్పుడు మాత్రం దేశ వ్యాప్తంగా మోతెక్కిపోతోంది.. ఇందుకు కారణం ఈయన కన్నడనాట తన వ్యూహ రచనతో కాంగ్రెస్ (Congress) పార్టీని గెలిపించడమే. అటు కేంద్రంలో.. ఇటు కర్ణాటకలో (Karnataka) అధికారంలో ఉన్న బీజేపీని ‘40 శాతం కమిషన్ సర్కారు’, ‘పేసీఎం’ (Pay CM) అస్త్రాలను సంధించి గ్రాండ్ సక్సెస్ అయ్యారు. ఇవన్నీ ఒక ఎత్తయితే కాంగ్రెస్ ఇచ్చిన 5 హామీలను ప్రజలకు చేరువ చేయడంలో టార్గెట్ చేరుకున్నారు. కాంగ్రెస్ అంటేనే కొట్లాటలకు మారుపేరుగా ఉంటుందనే ఆరోపణల నుంచి ఎక్కడా నేతల మధ్య పొరపచ్చాలు రాకుండా చూసుకుంటూ చేయాల్సినవన్నీ చేస్తూ సాయశక్తులు వొడ్డి.. పార్టీని అధికారంలో తెచ్చారు సునీల్. దీంతో అసలు ఎవరీ సునీల్..? ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి..? ఈయన బ్రాగ్రౌండ్ ఏంటి..? అసలు ఈయన వ్యూహకర్తగా ఎలా మారారు..? అని కన్నడనాట ఫలితాల తర్వాత అందరూ గూగుల్‌లో తెగ వెతకడం మొదలెట్టారు. తాజాగా.. సీఎం సిద్ద రామయ్యకు సునీల్‌ను ప్రధాన సలహాదారుగా క్యాబినెట్ (Karnataka Cabinet) హోదాతో హైకమాండ్ నియమించింది. దీంతో జనాలంతా ఎందుకింత ప్రియార్టీ ఇస్తున్నారు..? ఈయన గురించి తెలుసుకుని తీరాల్సిందేనని మరోసారి గూగుల్ (Google) బాట పట్టారు.
పీకే ఇలా..!?
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) (Prashant Kishor) గురించి ప్రత్యేకించి పరిచయం చేయనక్కర్లేదు. వ్యూహకర్తగా ఈ పేరు మాత్రమే దేశ వ్యాప్తంగా వినిపించేది. ‘ఐ-ప్యాక్’ పేరుతో ఈయన ఏ పార్టీకి వ్యూహకర్తగా పనిచేసినా ఒకట్రెండు తప్పితే అన్నింట గెలిచి నిలిచారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానిగా మోదీ గెలుపు వెనుక ప్రచారకర్త, వ్యూహకర్త బాధ్యతలను పీకేనే నిర్వహించారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని, 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ని, 2021 పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీని, అదే ఏడాది జరిగిన తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసి గెలిపించారు. ఇప్పుడు రెండోసారి వైసీపీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎవరీ సునీల్ కనుగోలు..!?
పీకే (PK) అత్యంత సహచరుడే సునీల్ కనుగోలు (ఎస్కే). కర్ణాటకలోని బళ్లారిలో జన్మించిన సునీల్.. తెలుగు మూలాలున్న వ్యక్తి. పీకేతో కలిసి ఎస్కే కొన్నేళ్లపాటు కీలక రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో పనిచేశారు. దీనికంటే ప్రధాని నరేంద్ర మోదీకి వ్యక్తిగత వ్యూహకర్తగా వ్యవహరించిన అనుభవం కూడా సునీల్‌కు ఉంది. అయితే ఎక్కవ రోజులు పీకేతో కలిసి ప్రయాణం చేయలేకపోయారు. పీకే-ఎస్కే మధ్య కొన్ని విషయాల్లో విభేదాలు రావడంతో సునీల్ సైడ్ అయ్యారు. బయటికొచ్చాక ‘అసోసియేషన్ ఆఫ్ బిలియన్ మైండ్స్’ అనే సంస్థను లక్నో కేంద్రంగా స్థాపించారు. నాటి నుంచి నేటి వరకూ దేశంలోని 14 ఎన్నికల్లో వివిధ పార్టీలకు వ్యూహకర్తగా పనిచేసిన అను భవం ఉంది. 2017 ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీకి వ్యూహకర్తగా సునీల్ పనిచేసి పార్టీని అధికారంలోకి తెచ్చారు. అంతేకాదు.. ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ తరఫున పని చేసిన సునీల్.. ఎక్కువ రాష్ట్రాల్లో కమలనాథులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా చేయటం సక్సెస్ అయ్యారని విశ్లేషకులు చెబుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే 2019లో తమిళనాట జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తమిళనాడు డీఎంకే తరఫున పని చేసిన ఆయనకు మంచి ట్రాక్ రికార్డు ఉంది.
ఇప్పుడెందుకీ ప్రస్తావన..!?
ఒకప్పుడు బీజేపీకి (BJP) పనిచేసిన సునీల్ ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు మాత్రమే పనిచేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం కాంగ్రెస్ కోర్ కమిటీలో సభ్యుడు. కన్నడనాట కాషాయ పార్టీని వణికించిన ఈ వ్యూహకర్త నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ. ఇప్పటికే తెలంగాణలోని అధికార పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తూ కల్వకుంట్ల కుటుంబాన్ని (Kalvakuntla Family) టార్గెట్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. దీంతో సునీల్ ఆఫీసుపై పోలీసులు మెరుపు దాడులు చేయడం.. కంప్యూటర్లన్నీ తీసుకెళ్లడం ఇవన్నీ జరిగిపోయాయి. అయితే ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారో తెలియట్లేదు కానీ.. కాంగ్రెస్ నేతలు ఏం చేయాలి..? ఎలా ముందుకెళ్లాలి..? అధికార బీఆర్ఎస్‌ను ఎలా దెబ్బ కొట్టాలని ఎప్పటికప్పుడు వ్యూహాలు రచిస్తూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా రాష్ట్ర కాంగ్రెస్‌లో వర్గవిభేదాలు, నేతల్లో అసంతృప్తి లేకుండా కలిసికట్టుగా పనిచేయించడంలో మునుపటితో పోలిస్తే చాలా వరకు తగ్గింది సునీల్ వల్లనే అని టాక్ నడుస్తోంది. ఇప్పటికింకా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యలాపాలు ప్రారంభమవ్వలేదు కానీ.. ఎన్నికల సీజన్ ప్రారంభం అయితే మాత్రం కథ వేరుగా ఉంటుందని ముఖ్య నేతలు చెప్పుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రాకుండా ఉండటానికి అస్త్రశస్త్రాలన్నీ సునీల్ వాడబోతున్నారట. ఇక్కడ తెలంగాణలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. దక్షిణాదిన రెండో విజయమన్న మాట.
పీకే.. ఎస్కే.. పదవుల విషయంలో..!
మరోవైపు.. కర్ణాటకలో పార్లమెంట్ ఎన్నికలు కూడా మిగిలి ఉన్నాయి. ఈ లోపు ఆయన్ను ప్రోత్సహిస్తూ సలహాదారు పదవి కట్టబెడితే మరింత ఉత్సాహంగా పనిచేస్తారన్నది హైకమాండ్ భావనట. అందుకే కేబినెట్ హోదాతో పదవి కట్టబెట్టారనే టాక్ నడుస్తోంది. అయితే పీకే ఇంతవరకూ ఎన్ని పార్టీలకు పనిచేసినా ఇంతవరకూ ఒక్క పదవీ దక్కలేదు.. తీసుకున్నదీ లేదు కానీ.. ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మాత్రం ఏం చేయాలన్నా.. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా తప్పకుండా ఈయన్ను అడిగే తీసుకుంటారన్నది జగమెరిగిన సత్యమే. ఏపీలో ఇప్పుడు ఇదే సీన్ జరుగుతోందన్న విషయం రెండ్రోజులకోసారి వస్తున్న వార్తలతో పలు సందర్భాల్లో నిరూపితమైంది. ఇప్పుడు ఈయన ఏపీలో వైసీపీ కోసం వ్యూహాలు రచిస్తున్నారు. రెండోసారి అధికారంలోకి తీసుకురావడానికి తొక్కాల్సిన అడ్డదారులన్నీ తొక్కుకుంటూ వెళ్తున్నారు పీకే.
ఫ్యూచర్ అంతా ఎస్కేదేనా..!?
వాస్తవానికి సునీల్ కనుగోలు అనే వ్యక్తి ఏ రాష్ట్రానికైతే పనిచేస్తారో అక్కడ ఒకరిద్దరు కాంగ్రెస్ నేతలకు తప్ప ఆయన ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు.. కనీసం ఫొటోలు కూడా నెట్టింట్లో సరిగ్గా దొరకవ్.. పోనీ సోషల్ మీడియాలో అయినా ఎక్కడైనా ఆయన అకౌంట్లు ఉన్నాయా అంటే అస్సలుండవ్. చాలా లో ప్రొఫైల్‌ను సునీల్ మెయిన్‌టైన్ చేస్తుంటారు. మరోవైపు.. సునీల్ సోదరుడు చెన్నై కేంద్రంగా స్టార్టప్ కంపెనీ పెట్టారు. దీంతో అప్పుడప్పుడు మీడియాల్లో కనిపిస్తుంటారు. ఆయన్నే సునీల్ అనుకొని అందరూ సోదరుడి ఫొటొలనే వాడేస్తుంటారు. మొత్తానికి చూస్తే.. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో బీజేపీకి వ్యూహకర్తగా పనిచేయడం.. ఇప్పుడంతా కాంగ్రెస్‌కు పనిచేస్తూ ఉండటం.. అందులోనూ కన్నడనాట గెలవడంతో ఎక్కడ చూసినా సునీల్ పేరు మార్మోగుతోంది. రేపొద్దున తెలంగాణలో కూడా కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తే ఇక ఎస్కేకు తిరుగుండదేమోనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో పీకే పేరు పూర్తిగా కనుమరుగై ఎస్కే పేరే వినిపిస్తూ.. ఫుల్ డిమాండ్ అయిపోతారని సోషల్ మీడియా వేదికగా ఫాలోవర్స్ తెగ చెప్పుకుంటున్నారు. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్నాయ్.. పీకే బీఆర్ఎస్ కోసం కొద్దిరోజులు పనిచేసి సైడ్ అయ్యారు. కాంగ్రెస్‌కు మాత్రం ఎస్కే కంటిన్యూ అవుతున్నారు.. హ్యాట్రిక్ కొట్టి తీరాల్సిందేనని కేసీఆర్ కంకణం కట్టుకుని మరీ ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సువర్ణావకాశంగా మలుచుకుని ముందుకెళ్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో ఏంటో వేచి చూడాలి మరి.
******************************
ఇవి కూడా చదవండి..
******************************
Delimitation : కొత్త పార్లమెంట్‌లో సీట్ల సంఖ్య పెంపు ప్రకటన వెనుక ఇంత పెద్ద కథుందా.. ఎవరికి లాభం.. అసలు మోదీ ప్లానేంటి..!?
******************************
Balineni Meets YS Jagan : గంటన్నరపాటు వైఎస్ జగన్‌తో బాలినేని భేటీ.. సుదీర్ఘ చర్చల తర్వాత ఫైనల్‌గా ఏం తేలిందంటే..
******************************
Updated Date - 2023-06-02T17:47:20+05:30 IST