CM KCR : కెమెరాలు ఆపి మరీ సీఎం కేసీఆర్ చెప్పిన ఈ మాటలతో ప్రజాప్రతినిధుల ఫ్యూజులు ఔట్.. సడన్‌గా ఇలా అన్నారెందుకో..!?
ABN, First Publish Date - 2023-04-28T20:56:21+05:30
తెలంగాణ సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారాయి. ఎక్కడ చూసినా వీటిపైనే చర్చ నడుస్తోంది...
‘‘దళితబంధులో రూ.3 లక్షల దాకా తీసుకున్నారు! అవినీతికి పాల్పడిన వారి చిట్టా నా దగ్గర ఉంది. ఇలాంటివి రిపీట్ అయితే టికెట్ ఉండదు. ఎన్నిసార్లు చెప్పినా కొందరు మారడం లేదు. సరిగా పనిచేయని వారి తోక కత్తిరిస్తా’’... సాక్షాత్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) పలికిన మాటలివి!. గోప్యంగా ఎవరో సన్నిహితుల వద్ద చెప్పడం కూడా కాదు. బీఆర్‌ఎస్ ఆవిర్భావ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, డీసీసీబీ చైర్మన్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ముఖ్య నేతల సమక్షంలో కేసీఆర్ స్వయంగా ఈ మాటలు అన్నారు. ‘‘ మీ అవినీతి మళ్లీ రిపీట్ అయితే టికెట్ ఉండదు. మీ అనుచరులు డబ్బులు తీసుకున్నా మీదే బాధ్యత. టికెట్ ఇవ్వకపోవడమే కాదు.. పార్టీలోనే ఉండరు’’ అంటూ కెమెరాలను ఆపించి మరీ గట్టి స్వరంతో కేసీఆర్ గద్దించారు. అయితే గురువారం తెలంగాణ సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారాయి. ఎక్కడ చూసినా వీటిపైనే చర్చ నడుస్తోంది. మరి కేసీఆర్ వ్యాఖ్యలు దేనికి సంకేతం?. జనాల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయం ఏంటి?. ప్రత్యర్థి పార్టీలు ఏమంటున్నాయి? ప్రభుత్వాధినేతకు, బీఆర్ఎస్‌కు ఎదురవుతున్న ప్రశ్నలు ఏమిటి?.. అనే ఆసక్తికర విషయాలపై ఒకసారి పరిశీలిద్దాం...
అసలేం జరిగింది..!?
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ‘దళితబంధు’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం పేరుచెప్పి ఎన్నో సందర్భాల్లో తమది గొప్ప పాలనని సీఎం కేసీఆర్ సహా పార్టీ నేతలంతా చెప్పుకున్నారు. మరి అంత గొప్పగా భావించిన ఈ పథకంలో సొంత పార్టీ నేతల వసూళ్లను సీఎం కేసీఆర్ నిర్ధారించారు. నేతల చిట్టా తన వద్ద ఉందని వ్యాఖ్యానించి ఆయనే స్వయంగా అవినీతిని ఒప్పుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రూ.3 లక్షల దాకా తీసుకున్నారని చెప్పి వివరాలను కూడా ఆయనే బయటపెట్టారని, కానీ చర్యల ఊసే లేదనే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ నేతల అవినీతి గురించి తెలిసినా, లబ్దిదారులకు అన్యాయం జరుగుతున్నా కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకు చర్యలు తీసుకోలేదు?. సైలెంట్‌గా ఉండడానికి కారణం ఏంటి?. లబ్దిదారులకు అన్యాయం జరిగినా ఫర్వాలేదు.. కానీ బీఆర్ఎస్ నేతలపై చర్యలు ఉండకూడదని కేసీఆర్ భావించారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఎందుకిలా అన్నారో..!?
రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యుండి.. అవినీతిపై స్పష్టమైన సమాచారం ఉండి కూడా చర్యలు తీసుకోకపోవడం దేనికి సంకేతమనే ప్రశ్న సీఎం కేసీఆర్‌కు ఎదురవుతోంది. అసలు విచారణ ఊసే ఎత్తకుండా.. మరోసారి టికెట్ కూడా ఆఫర్ చేయడం చూస్తుంటే ముఖ్యమంత్రే అవినీతికి కొమ్ము కాస్తున్నట్టుగా అనిపిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంత జరుగుతున్నా పారదర్శక పాలన అందిస్తున్నామని కేసీఆర్ ఎలా చెప్పుకోగలుతున్నారని జనాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు నేతలపై చర్యలు తీసుకుంటే పార్టీపై అవినీతి ముద్రపడుతుందని, తప్పుడు సంకేతాలు వెలువడతాయని ఇలా చేస్తున్నారా అనేది ప్రస్తుతం తెలంగాణలో నడుస్తున్న చర్చ.
ప్రతిపక్షాల ప్రశ్నలకు జవాబేది..!?
ఎమ్మెల్యేల అవినీతి దళితబంధులో అవినీతికి పాల్పడ్డ ఎమ్మెల్యేల పేర్లు బయటపెట్టాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. తప్పు చేసిన మంత్రులు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను మందలించాల్సిందిపోయి.. సీఎం కేసీఆర్ (CM KCR) వెనకేసు కొస్తున్నారని విమర్శించారు. సొంత ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతుంటే సీఎం ఏం చేస్తున్నారు?.. వారిపై సీబీఐ (CBI) దర్యాప్తు చేయించే దమ్ము కేసీఆర్‌కు ఉందా? అని ప్రశ్నించారు. మరో బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్పందిస్తూ... ‘‘మా ఎమ్మెల్యేలు దోపిడి చేస్తున్నారని స్వయానా ముఖ్యమంత్రే ఒప్పుకున్నడు. సుమోటోగా స్వీకరించి కేసులు పెట్టి, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని తెలంగాణ స్టేట్ పోలీసు వారిని కోరుతున్నా. సాక్ష్యాల కోసం తెలంగాణ సీఎంవోను సంప్రదించండి’’ అని ఫేస్‌బుక్‌లో ఆయన రాసుకొచ్చారు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందిస్తూ... దళిత బంధు అత్యంత అవినీతిమయం అయ్యిందని మండిపడ్డారు. అవినీతి చేసిన ఎమ్మెల్యేలను కేసీఆర్ ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్నించారు. దళిత బంధు అవినీతికి కేసీఆర్‌దే బాధ్యతని విమర్శించారు. మొత్తంగా బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. ఈ వ్యాఖ్యలు ఎలాంటి రాజకీయ మాటల యుద్ధానికి దారితీస్తాయో వేచిచూడాలి.
Updated Date - 2023-04-28T21:00:14+05:30 IST