Janasena ఫ్లెక్సీల్లో ఆమంచి స్వాములు..ఇంతకీ ఆలోచనేంటి?
ABN, First Publish Date - 2023-02-15T12:49:05+05:30
బాపట్ల జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, ఆయన సోదరుడు ఆమంచి స్వాములు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్‌టాపిక్...
బాపట్ల జిల్లాలో ఆమంచి బ్రదర్స్ పాలిటిక్స్ హీట్ పెంచాయి. నిన్నమొన్నటి వరకు ఆమంచి కృష్ణమోహన్ వ్యవహారం హాట్‌టాపిక్ కాగా.. ఇప్పుడు.. ఆయన సోదరుడు ఆమంచి స్వాములు చర్చగా మారారు. ఆయన జనసేనలోకి వెళ్తున్నారనే ప్రచారం మరింత ఊపందుకుంది. దానికి తగ్గట్లే జనసేన ఫ్లెక్సీల్లో ఆమంచి స్వాములు దర్శనమివ్వడం ఆసక్తి రేపుతోంది. ఇంకేముంది.. ఆమంచి సోదరుల పాలిటిక్స్‌పై వైసీపీ, జనసేనలో చర్చోపచర్చలు మొదలయ్యాయి. ఇంతకీ.. ఆమంచి స్వాములు ఆలోచనేంటి?.. ఆ ఫ్లెక్సీలపై రాజకీయ వర్గాల్లో ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి?.. మరిన్ని విషయాలు ఏబీఎన్ ఇన్‌సైడ్‌లో తెలుసుకుందాం..
ఆమంచి బ్రదర్స్ పాలిటిక్స్‌పై చీరాలలో తీవ్ర చర్చ
బాపట్ల జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, ఆయన సోదరుడు ఆమంచి స్వాములు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్‌టాపిక్ అయ్యారు. ఆమంచి కృష్ణమోహన్ ప్రస్తుతం పర్చూరు వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా పని చేస్తున్నారు. అయితే.. ఆయన అన్న ఆమంచి స్వాములు జనసేనలోకి వెళ్తున్నారంటూ గత కొద్దిరోజులుగా చీరాలలో ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఆ సమయంలోనే.. ఆమంచి స్వగ్రామం పందిళ్లపల్లిలో జనసేన ఫెక్సీల్లో ఆమంచి స్వాములు ప్రత్యక్షమవడం చర్చగా మారుతోంది. దాంతో.. ఆమంచి బ్రదర్స్ పాలిటిక్స్‌పై చీరాలలో తీవ్ర చర్చ నడుస్తోంది.
2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా రెండోసారి ఎమ్మెల్యే
వాస్తవానికి.. 2009లో ఆమంచి కృష్ణమోహన్.. చీరాల నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. అయితే.. 2019 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరిన ఆమంచికి ఆ ఎన్నికలు షాక్ ఇచ్చాయి. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ప్రయత్నించగా.. ఫ్యాన్ గాలిలోనూ ఓటమిపాలయ్యారు. అయితే.. ఆమంచిపై గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరామ్.. ఆ ఎన్నికల తర్వాత వైసీపీకి మద్దతు పలికారు. దాంతో.. అప్పటివరకు కృష్ణమోహన్ చేతిలో ఉన్న అధికార పెత్తనం కరణం బలరామ్ చేతిలోకి వెళ్లిపోయింది. ఫలితంగా.. రెండేళ్ల నుంచి ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో అసంతృప్తిగా ఉంటూ వచ్చారు.
అన్నదమ్ముల మధ్య విభేదాలు!
ఇదిలావుంటే.. గతేడాది పర్చూరు వైసీపీ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు ఆమంచి కృష్ణమోహన్ అన్న స్వాములుకి ఇస్తున్నారంటూ ప్రచారం జరిగింది. ఆయనకు స్వాగతం పలుకుతూ కొందరు పర్చూరు వైసీపీ నేతలు ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. వైసీపీలో కృష్ణమోహన్‌ను పక్కనపెట్టి.. స్వాములుని తెరపైకి తీసుకురావడంతో అన్నదమ్ముల మధ్య విభేదాలు తలెత్తాయి. అయితే.. ఆయా ప్రచారాలకు చెక్ పెడుతూ.. ఇటీవల పర్చూరు వైసీపీ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు ఆమంచి కృష్ణమోహన్‌కే దక్కాయి. అప్పటినుంచి.. ఆమంచి స్వాములు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దానికి తగ్గట్టే.. ఆమంచి స్వగ్రామం పందిళ్లపల్లిలో జనసేన ఫ్లెక్సీల్లో స్వాములు కనిపించడం హాట్‌టాపిక్‌గా మారింది.
జనసేనలోకి వెళ్తున్నారని చీరాలలో ప్రచారం
మరోవైపు.. ఇటీవల జనసేన మూడో విడత సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలు పెట్టింది. దానిలో భాగంగా.. ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో జనసేన కార్యకర్తలు ఆమంచి స్వాములును చేర్చడం చర్చనీయాంశం అయింది. అంతేకాదు.. మొన్నామధ్య మద్దిపాడులో ఓ ఫంక్షన్‌కు హాజరైన ఆమంచి స్వాములు.. అక్కడి జనసేన కార్యాలయంలో కొద్దిసేపు గడిపారు. స్థానిక జనసేన నేతలు, కార్యకర్తలతో చర్చించారు. ఆయా పరిణామాలతో ఆమంచి స్వాములు జనసేనలోకి వెళ్తున్నారని చీరాలలో ప్రచారం జరుగుతోంది. అయితే.. ఆ ప్రచారాన్ని స్వాములు కూడా ఖండించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మొత్తంగా.. ఆమంచి స్వాములు వ్యవహారం.. కృష్ణమోహన్‌కు ఇబ్బందిగా మారడం ఖాయంగానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో.. ఆమంచి బ్రదర్స్ పాలిటిక్స్.. చీరాలలో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో చూడాలి.
Updated Date - 2023-02-15T12:49:55+05:30 IST