Kurnool: మంత్రి గుమ్మనూరికి జగన్ ఝలక్.. వైసీపీలో చేరిన కప్పట్రాళ్ల బొజ్జమ్మ.. పక్కనే నిల్చుని మరీ..
ABN, First Publish Date - 2023-06-22T13:54:30+05:30
‘ఆలూరు నియోజకవర్గం కప్పట్రాళ్ల బొజ్జమ్మ చూసుకుంటుంది.. కర్నూలు పార్లమెంట్ నువ్వు చూసుకో...’ ఈ నెల 19న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్‌కు సీఎం జగన్ తేల్చి చెప్పారని వైసీపీలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఆలూరు నియోజకవర్గం చూడాలన్న జగన్!
గుమ్మనూరు జయరామ్‌కు చెక్ పడినట్లేనా?
మంత్రి వర్గీయుల్లో రగులుతున్న అసంతృప్తి
ఎంపీగా పోటీ చేస్తారా? నియోజకవర్గం మార్చుతారా?
కర్నూలు జిల్లాలో ఇదే హాట్ టాపిక్
కర్నూలు (ఆంధ్రజ్యోతి): ‘ఆలూరు నియోజకవర్గం కప్పట్రాళ్ల బొజ్జమ్మ చూసుకుంటుంది.. కర్నూలు పార్లమెంట్ నువ్వు చూసుకో..’ ఈ నెల 19న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్‌కు సీఎం జగన్ తేల్చి చెప్పారని వైసీపీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ జయరామ్‌కు దక్కకపోవచ్చన్న అనుమానాలకు బలం చేకూరేలా ఆలూరు వైసీపీ రాజకీయాలు మారుతున్నాయి. ఆయన్ను ఎంపీగా పోటీ చేయిస్తారా? లేక నియోజకవర్గం మార్చుతారా? అసలు మంత్రి గుమ్మనూరు పయనమెటు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు కుమార్తె కప్పట్రాళ్ల బొజ్జమ్మ వైసీపీలో చేరికతో మంత్రి వర్గీయుల్లో అసంతృప్తి సెగలు రగులుతున్నాయి. మాజీ జడ్పీటీసీ సభ్యురాలు కప్పట్రాళ్ల బొజ్జమ్మ వైసీపీలో చేరకుండా చివరి వరకు అడ్డుపడిన మంత్రి జయరాం వర్గీయులు నియోజకవర్గంలో ఆమెకు సహకరిస్తారా? అన్న చర్చ ఆలూరు నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది.
మంత్రి గుమ్మనూరు జయరాం 2005లో చిప్పగిరి జడ్పీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడంతో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ జడ్పీటీసీ సభ్యుడిగా విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2011లో వైసీపీలో చేరారు. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆలూరు నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019 మే 30న బాధ్యతలు చేపట్టిన సీఎం జగన్ మంత్రివర్గంలో వాల్మీకి సామాజికవర్గం కోటాలో స్థానం దక్కించుకున్నారు. కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలోనూ అదే సామాజికవర్గం కోటాలో రెండోసారి జగన్ మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. తాజాగా అదే వాల్మీకి సామాజికవర్గానికి చెందిన మాజీ జడ్పీటీసీ సభ్యురాలు కప్పట్రాళ్ల బొజ్జమ్మ వైసీపీలో చేరడంతో మంత్రి జయరాం రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఆలూరు నియోజకవర్గంలోనే కాదు.. జిల్లా అంతటా వైసీపీలో ఇది హాట్ టాపిక్‌గా మారింది. రెండుసార్లు తన గెలుపు కోసం పరోక్షంగా బొజ్జమ్మ సాయం తీసుకున్న జయరాం ఎన్నికల సమరంలో తన సీటుకు ఆమే పోటీ అవుతుందని ఉహించకపోయి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గుమ్మనూరుకు చెక్ పెట్టినట్లేనా..?
మంత్రి పదవి దక్కినప్పటి నుంచి గుమ్మనూరు జయరాంపై పలు అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయన స్వగ్రామం గుమ్మనూరులో సోదరులు అంతర్‌రాష్ట్ర పేకాట కేంద్రం నిర్వహిస్తున్నారనే సమాచారంతో ఏఎస్పీ గౌతంషాలినీ ఆధ్వర్యంలో దాడులకు వెళ్లిన పోలీసులపైనే దాడులకు తెగబడిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆస్పరి మండలం ఆస్పరి, చిన్నహోతూరు గ్రామంలో ఓ పరిశ్రమకు చెందిన భూములు ఏకంగా 180 ఎకరాలను మంత్రి భార్య, బంధువులు, సన్నిహితుల పేరిట కొనుగోలు చేశారు. లెక్కల్లో చూపని ఆదాయం నుంచి బినామీ పేర్లతో కొనుగోలు చేశారని గుర్తించిన ఐటీ శాఖ ‘బినామీ ఆస్తుల లావాదేవీల నిషేధిత చట్టం-1988’ కింద అటాచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈఎస్‌ఐ ఆస్పత్రుల మందుల కొనుగోళ్లలో ఓ కాంట్రాక్టరు మంత్రి కుమారుడికి బెంజ్ కారు గిఫ్ట్ ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. అదే క్రమంలో ఆలూరు నియోజకవర్గంలో మంత్రి సోదరులు ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఆలూరు నియోజకవర్గంలో మంత్రి గుమ్మనూరు ప్రజాదరణ కోల్పోయారని, రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇస్తే గెలవడం కష్టమేనని వైసీపీ కోసం పని చేస్తున్న ఐప్యాక్ టీం సీఎం జగన్‌కు నివేదిక ఇచ్చారని సమాచారం. దీంతో ఐదారు నెలల క్రితమే మంత్రి గుమ్మనూరు జయరాంను ఆలూరు నుంచి దూరం పెట్టాలనే క్రమంలో మరో వ్యక్తి కోసం అన్వేషిస్తున్న తరుణంలో టీడీపీలో అసంతృప్తిగా ఉన్న బొజ్జమ్మ వైపు వైసీపీ దృష్టిసారించింది. 19న సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ఆమెకు ఆలూరు నియోజకవర్గం చూసుకోవాలని జగన్ స్పష్టమైన హామీ ఇచ్చారని, అక్కడే ఉన్న మంత్రి జయరాంను ‘నువ్ కర్నూలు చూసుకో..’ అని జగన్ సూచించారని విశ్వసనీయ సమాచారం. అంటే.. రాబోయే ఎన్నికల్లో జయరాం ఆలూరు నుంచి పోటీ చేయకుండా చెక్ పెట్టినట్లేనా..? అని పలువురు చర్చించుకుంటున్నారు. ఆయన కర్నూలు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. దీనిని గుమ్మనూరు వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. జగన్ చెప్పినట్లు బొజ్జమ్మ ఆలూరు నియోజకవర్గంలో పర్యటిస్తూ వైసీపీ రాజకీయాల్లో కీలకంగా మారితే మంత్రి జయరాం వర్గీయులు, ఆయన సోదరులు సహకరిస్తారా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
బొజ్జమ్మ రాకను అడ్డుకున్న మంత్రి?
మంత్రి జయరాంకు వ్యతిరేకంగా ఆరు నెలలుగా వైసీపీలో పావులు కదిలినట్లు తెలుస్తోంది. మంత్రికి పోటీగా అదే వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన కప్పట్రాళ్ల బొజ్జమ్మను తెరపైకి తీసుకొస్తున్నారని తెలిసి ఆమె చేరికను చివరి వరకు మంత్రి జయరాం అడ్డుకున్నట్లు సమాచారం. జయరాం ఆలూరు నియోజకవర్గంలో ప్రజా ఆదరణ కోల్పోతున్నారని, జిల్లాలో వైసీపీ తరుపున రాజకీయ కార్యకలాపాలు చూసే ఐప్యాక్ టీం కీలక సభ్యుడు దివాకర్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అదే క్రమంలో సీఎంఓలో పని చేసే కడప జిల్లాకు చెందిన కీలక అధికారి ఒకరు ఐప్యాక్ టీంను బొజ్జమ్మ వద్దకు పంపించి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ‘ఏ పార్టీలోకి వెళ్లినా ద్వితీయ శ్రేణి నాయకులుగానే ఉండాలి.. వైసీపీలోకి వచ్చినా రాజకీయ ప్రయోజనం ఏంటి? ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఆలోచిస్తామని’ బొజ్జమ్మ, ఆమె భర్త రామచంద్రనాయుడు షరతు పెట్టినట్లు సమాచారం.
అదే క్రమంలో వైసీపీ ఉమ్మడి కర్నూలు జిల్లా రీజినల్ ఇన్‌చార్జ్‌లు, కడప జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ద్వారా పావులు కదిపారు. ఈ విషయం తెలిసిన మంత్రి జయరాం బొజ్జమ్మ, ఆమె భర్త రామచంద్రనాయుడు వైసీపీలో చేరకుండా చివరి క్షణం వరకు అడ్డుకున్నట్లు సమాచారం. ఇది జగన్ తీసుకున్న నిర్ణయం.. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే అని ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి, రాంసుబ్బారెడ్డిలు జయరాంకు తేల్చి చెప్పడంతో ప్రయత్నాలు విరమించుకున్నారని తెలుస్తుంది. అయితే తాను పిలిచినప్పుడు పార్టీలోకి రాకుండా బొజ్జమ్మ ఇలా షాక్ ఇస్తుందని ఊహించలేదని మంత్రి జయరాం తన సన్నిహితులతో ఆవేదన వ్యక్తం చేసినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.
Updated Date - 2023-06-22T13:54:34+05:30 IST