AP Politics : వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. టీడీపీలోకి కీలక నేత
ABN, First Publish Date - 2023-09-20T11:04:17+05:30
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ముందు రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. ‘మమ్మల్ని ఎవరు అడ్డుకునేది.. మేం చెప్పిందే శాసనం’ అనుకుంటున్న అధికార వైసీపీకి (YSR Congress) ఊహించని రీతిలో ఎదురు దెబ్బలు మొదలయ్యాయి...
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ముందు రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. ‘మమ్మల్ని ఎవరు అడ్డుకునేది.. మేం చెప్పిందే శాసనం’ అనుకుంటున్న అధికార వైసీపీకి (YSR Congress) ఊహించని రీతిలో ఎదురు దెబ్బలు మొదలయ్యాయి. వైసీపీ సీనియర్ నాయకుడు కత్తురోజు శ్రీనివాసాచారి టీడీపీ (Telugudesam) కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. కొద్ది కాలంగా వైసీపీకి దూరంగా ఉంటున్న ఆయన సోమవారం టీడీపీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కత్తురోజు నిర్ణయం వైసీపికి గట్టి దెబ్బకాగా, టీడీపీకి బలం చేకూరనుంది. బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన కత్తురోజు వైసీపీ అవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీల నేతగా పనిచేస్తున్నారు. సుదీర్ఘ కాలంగా పట్టణంలో కోతమిల్లు నడుపుతున్న కత్తురోజు కుటుంబం స్థానిక ప్రజలకు సుపరిచితం. వివాద రహితుడైన ఆయన 2013లో జరిగిన మునిసిపల్ ఎన్నికలలో రెండవ వార్డు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. మునిసిపల్ ఎన్నికలతో పాటు జరిగిన సాధారణ ఎన్నికలలో సైతం. వైసీపీ ప్రతిపక్షానికే పరిమితమైంది. అయినా శ్రీనివాసాచారి (Katturoju Srinivasa Chari) పార్టీ పట్ల విధేయతగా పనిచేశాడు.
క్రియాశీలకనేతగా..!
ప్రజా సమస్యలు, పరిపాలనా అంశాల పట్ల సునిశిత అవగాహన ఉన్న ఆయన మునిసిపాలిటీలో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాడు. 2014 ఎన్నికలలో వైసీపీ తరుపున శాసనసభకు పోటీ చేసిన తనబాల్య స్నేహితుడు డాక్టర్. మొండితోక జగన్మోహనరావు గెలుపు కోసం అవిశ్రాంత కృషి చేశాడు. ఆ ఎన్నికల్లో మిత్రుడు ఓటమి చెందినా ఆయన్ను వెన్నంటి ఉన్నాడు. ఐదేళ్లపాటు ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీకి రాజకీయ వ్యూహాలు అందిస్తూ పార్టీలో క్రియాశీలకనేతగా ఎదిగాడు. ఈ క్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడిగా నియమింపబడ్డారు. 2019 సాధారణ ఎన్నికలలో సైతం వైసీపీ విజయయానికి ఆయన పెద్ద ఎత్తున కృషి చేశాడు. ఆశించిన మేర వైసీపీ విజయం సాధించినా ఆ ఆనందం కత్తురోజుకు ఎక్కవ కాలం మిగలలేదు. ఏమైందో ఏమో గానీ వైసీపీ అధికారంలోని వచ్చిన అనతి కాలంలోనే ఎమ్మెల్యే సోదరులకు ఆయనకు దూరం పెరిగింది.
ఎందుకిలా..?
ఎమ్మెల్యే సోదరులకు, కత్తురోజుకు మధ్య విభేదాలు ఏర్పడినట్టు విస్తృత. ప్రచారం సాగుతున్నా సున్నిత మనస్థత్వం గల కత్తు రోజు ఎక్కడా పార్టీకి గానీ, ఎమ్మెల్యే సోదరులకు గానీ, వ్యతిరేకంగా మాట్లాడలేదు. వైసీపీ కోసం, ఎమ్మెల్యే సోదరుల కోసం ఏడేళ్ల పాటు తన వ్యాపారాన్ని ఫణంగా పెట్టి పని చేశానని, ఆర్థికంగా తీరని నష్టం జరిగిందని తన సన్నిహితుల వద్ద వాపోతూవచ్చారు. అధికారం లేనప్పుడు అండగా ఉన్న తనను అధికారంలోకి వచ్చిన తరువాత ఆ సోదరులు నిర్లక్ష్యానికి గురి చేశారంటూ మనోవేదన చెందారు. ఆర్థికంగా, రాజకీ యంగా ఎదురు దెబ్బలు తగలడంతో పాటు రాష్ట్రంలో జగన్ విధ్వంసకర పాలనపై ఆయన కలత చెందారు. వైసీపీని వీడాలని నిర్ణయించుకున్నారు.
టీడీపీకి బలం
కత్తురోజు నిబద్గత రాజకీయ చతురత తెలిసిన టీడీపీ నాయకులు ఆయన్ను తమ పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించారు. సంవత్సర కాలంగా మౌనం వహిస్తూ వచ్చిన ఆయన శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య సోమవారం కత్తు రోజు నివాసానికి వెళ్లి ఆయన్ను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీలో తగిన గౌరవం ఇస్తామని హామీ ఇచ్చారు. ఈసందర్భంగా జరిగిన చర్చలో కత్తు రోజు తాను పదవులు ఆశించి రావడం లేదని, రాష్ట్రానికి మంచి జరగాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావా ల్సిన ఆవశ్యకత ఉందన్న అభిప్రాయంతో ఉన్నట్లు చెప్పారు. టీడీపీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని ఆయన చెప్పారు. తనతో పాటు చాలా మంది వైసీపీ సానుభూతిపరులు టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. నందిగామ పట్టణ రాజకీయాల పట్ల స్పష్టమైన అవగాహన ఉన్న కత్తురోజు చేరిక టీడీపీకి ఖచ్చితమైన బలమని చెప్పాలి.
Updated Date - 2023-09-20T11:10:07+05:30 IST