Danam Nagender: ఖైరతాబాద్‌లో బీఆర్‌ఎస్ గెలుపు అంత సులువు కాదు.. కారణాలివే..
ABN, First Publish Date - 2023-08-22T22:05:34+05:30
బీఆర్‌ఎస్ పార్టీ దానం నాగేందర్‌కు టికెటు కేటాయించినా, ఈసారి గెలుపు మాత్రం బీఆర్‌ఎస్ పార్టీకి పెద్ద సవాలుగానే మారనుంది. పది సంవత్సరాలుగా ప్రభుత్వం నడుపుతున్న పార్టీపై కొంత వ్యతిరేకతతో పాటు ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా దానం పనితీరుపై ఉన్న కొంత వ్యతిరేకత ఉండడంతో పార్టీ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
ఖైరతాబాద్ (ఆంధ్రజ్యోతి): అధికార బీఆర్‌ఎస్ తరఫున ఖైరతాబాద్ నియోజకవర్గ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరును ప్రకటించడంతో బీఆర్‌ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఈసారైనా తనకు టికెట్ వస్తుందనే నమ్మకంతో పార్టీ పనిలో నిమగ్నమై అధినాయకత్వాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించిన మన్నె గోవర్ధన్‌రెడ్డి ఆశలు మరోమారు తారుమారయ్యాయి. పార్టీ టికెటు కేటాయించినా, ఈసారి గెలుపు మాత్రం బీఆర్‌ఎస్ పార్టీకి పెద్ద సవాలుగానే మారనుంది. పది సంవత్సరాలుగా ప్రభుత్వం నడుపుతున్న పార్టీపై కొంత వ్యతిరేకతతో పాటు ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా దానం పనితీరుపై ఉన్న కొంత వ్యతిరేకత ఉండడంతో పార్టీ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
కాంగ్రెస్, బీజేపీలతో త్రిముఖ పోరు..
ఖైరతాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కార్పొరేటర్ విజయారెడ్డి, డీసీసీ అధ్యక్షులు రోహిణ్ రెడ్డి టికెటు ఆశిస్తున్నారు. బీజేపీ నుంచి ఇక్కడ గతంలో గెలిచిన మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డితో పాటు మరి కొందరు టికెటు ఆశిస్తున్నారు. గతంతో పోలిస్తే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చాలా పుంజుకుంది. బీఆర్‌ఎస్ ఖైరతాబాద్ కార్పొరేటర్ కాంగ్రెస్‌లో చేరి బలమైన నాయకురాలిగా ఎదగడం అధికార పార్టీకి కొంత నష్టం కలిగించే అంశాలుగా చెప్పవచ్చు. గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన బీజేపీ బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతం కోసం ఎన్నో రోజులుగా పనిచేస్తుండడంతో ఈ పార్టీ సైతం గట్టి పోటీ ఇవ్వనుంది. గత కార్పొరేషన్ ఎన్నికల్లో రెండు డివిజన్లను బీజేపీ గెలవగా జూబ్లీహిల్స్ కార్పొరేటర్ బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. కార్పొరేటర్ పార్టీ మారినా పార్టీకి ఓటర్ల బలం మాత్రం తగ్గలేదు. హిమాయత్‌నగర్ డివిజన్‌లో కూడా బీజేపీ బలంగా ఉంది.
దానం నాగేందర్ ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం చాలా రోజుల పాటు ప్రజల మధ్యకు రాకపోవడం, అందుబాటులో లేకపోవడం, ఎన్నికల సందర్భంగా కొన్నాళ్లుగా ప్రజాక్షేత్రంలోకి వచ్చినా, సామాన్యులు ఇప్పటికీ ఆయనను నేరుగా కలవలేకపోవడంతో నియోజకవర్గంలో కొంత వ్యతిరేకత ఉంది. వెంకటేశ్వరకాలనీకి చెందిన కార్పొరేటర్ భర్త టికెట్‌ను ఆశించి భంగపడడం, బంజారాహిల్స్ డివిజన్‌కు గ్రేటర్ మేయర్ తగిన సమయం కేటాయించకపోవడం సైతం పార్టీకి కొంత వరకు సవాలుగానే మారనుంది. ఏది ఏమైనా, అపారమైన రాజకీయ అనుభవం, ఎన్నికల సమయంలో వాతావరణాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే ఎత్తుగడలు తెలిసిన నాయకుడిగా, పార్టీ చేసిన అభివృద్ధి పనులే తనను తిరిగి ఎమ్మెల్యేగా గెలిపిస్తాయనే నమ్మకంతో దానం బరిలోకి దిగారు. మొత్తం మీద ఈ నియోజకవర్గంలో అధికార బీఆర్‌ఎస్ పార్టీకి కాంగ్రెస్, బీజేపీల నుంచి తీవ్రమైన పోటీ ఉండడంతో గెలుపు ఎవరిని వరిస్తుందో వేచిచూడాల్సిందే.
Updated Date - 2023-08-22T22:05:36+05:30 IST