CM Jagan: అప్పుడు నీచంగా.. ఇప్పుడు గర్వంగా.. సినిమా వాళ్లు ఎలా కనిపిస్తున్నారు జగన్?
ABN, First Publish Date - 2023-08-25T16:46:17+05:30
నేషనల్ అవార్డులు గెలుచుకున్న సినిమా టీమ్‌లను ఏపీ సీఎం జగన్ అభినందించడంపై సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది. గతంలో ఆయా సినిమాల టిక్కెట్ రేట్ల విషయంలో ఇబ్బందులు పెట్టి ఇప్పుడు అభినందించడం హాస్యాస్పదంగా ఉందని నెటిజన్‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గత రెండేళ్లుగా తెలుగు సినిమా వెలిగిపోతోంది. ఈ విషయం మనం చెప్పుకోవడం కాదు.. దేశం మొత్తం నినాదాలు చేస్తోంది. మొన్న ఆస్కార్ అవార్డుల్లో.. నిన్న నేషనల్ అవార్డుల్లో తెలుగు సినిమా డామినేషన్ స్పష్టంగా తెలుస్తోంది. బాహుబలి, RRR సినిమాల తర్వాత టాలీవుడ్ రేంజ్ పెరిగిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అలాంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు రాజమౌళిని అవమానించిన ఘనత ఏపీ సీఎం జగన్‌కు మాత్రమే దక్కుతుంది. అంతేకాకుండా అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాకు కూడా టిక్కెట్ రేట్లు పెంచుకునేందుకు అవకాశం ఇవ్వలేదు. కట్ చేస్తే ఇప్పుడు పుష్ప, ఆర్.ఆర్.ఆర్ సినిమాలు నేషనల్ అవార్డులు కైవసం చేసుకున్నాయి. ఆనాడు టిక్కెట్ రేట్ల కోసం సినీ పెద్దలను తన చుట్టూ తిప్పించుకోవడం.. చేంతాడు రేంజ్‌లో ఆంక్షలు పెట్టడం జగన్ సర్కారుకే చెల్లింది. కనీసం కూడా సినిమా వాళ్లకు గౌరవం ఇవ్వకుండా పలువురు వైసీపీ నేతలు చేసిన కామెంట్లను ఇంకా తెలుగు ప్రేక్షకులు మరిచిపోలేదు. మెగాస్టార్ చిరంజీవి అయితే జగన్‌కు ఏకంగా దండం కూడా పెట్టిన విషయం అప్పట్లో హాట్ టాపిక్‌గా నిలిచింది.
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మీద అక్కసుతో అతడు నటించిన వకీల్ సాబ్ సినిమాకు ఏపీ ప్రభుత్వం టిక్కెట్ రేట్లను దారుణంగా తగ్గించింది. ప్రభుత్వ తీరు కారణంగా బీ, సీ సెంటర్లలో చాలా చోట్ల రూ.10, రూ.25 టిక్కెట్ రేట్లు నడిచాయి. అల్లు అర్జున్ పుష్ప సినిమా సమయంలో కూడా ఇదే రేట్లు ఉండటంతో టిక్కెట్ రేట్లు పెంచాలని నిర్మాతలు కోరారు. అయితే జగన్ ప్రభుత్వం అంగీకరించలేదు. అందుకే హిందీ మార్కెట్‌తో పోల్చితే తెలుగులో పుష్ప సినిమాకు వసూళ్లు తక్కువగా వచ్చాయి. తెలంగాణలో బాగానే వసూళ్లను రాబట్టిన పుష్ప మూవీ తక్కువ టిక్కెట్ రేట్ల కారణంగా ఏపీలో చతికిలపడింది. అటు ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఇద్దరు స్టార్ హీరోలను పెట్టి ఆర్.ఆర్.ఆర్ మూవీ తీశాడు. కరోనా కారణంగా ఈ సినిమాకు బడ్జెట్ ఊహించిన దానికంటే ఎక్కువగా అయ్యింది. దీంతో టిక్కెట్ రేట్లు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే విషయాన్ని ఏపీ ప్రభుత్వం దగ్గరకు తీసుకెళ్తే పరిగణనలోకి తీసుకోలేదు. టిక్కెట్ రేట్లు పెంచాలంటే కొంతశాతం తప్పకుండా ఏపీలోనే సినిమా షూటింగ్ జరపాలన్న రూల్ తీసుకొచ్చారు. అంతేకాకుండా స్టార్ హీరోల పారితోషికాలు తగ్గించుకుంటే టిక్కెట్ రేట్లు పెంచాల్సిన అవసరం ఉండదనే రీతిలో స్టేట్‌మెంట్లు కూడా ఇచ్చారు. దీంతో ఎన్నో చర్చలు జరిపిన తర్వాతే ఆర్.ఆర్.ఆర్‌కు టిక్కెట్ రేట్లు కొద్దిగా పెంచారు. అది కూడా తెలంగాణతో పోల్చితే తక్కువ అనే చెప్పాలి.
కట్ చేస్తే ఇప్పుడు జాతీయ అవార్డులు గెలుచుకున్న పుష్ప, ఆర్.ఆర్.ఆర్ సినిమాలను అభినందిస్తూ ఏపీ సీఎం జగన్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. దీంతో జగన్ ట్వీట్‌పై భారీ ఎత్తున ట్రోల్స్ నడుస్తున్నాయి. దేశం మొత్తం తమ వైపు తిప్పుకున్న దర్శకులు, నటులను శాడిజంతో ఆనాడు జగన్ తన చుట్టూ తిప్పుకున్నారని.. ఇప్పుడు వారిని ఎలా అభినందిస్తారని.. జగన్ రెండు తలకాయల పాము అని పలువురు నెటిజన్‌లు విమర్శలు చేస్తున్నారు. నాలుగేళ్ల వైసీపీ పాలనలో సినిమా వాళ్లను ఏపీ ప్రభుత్వం తీవ్రంగా అవమానించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌లో ఉన్న క్రేజ్‌ను లెక్క చేయకుండా పుష్ప, ఆర్.ఆర్.ఆర్ వంటి పెద్ద సినిమాల నిర్మాతలు, దర్శకులు, నటులను జగన్ సర్కారు ఇబ్బంది పెట్టిందని గుర్తు చేస్తున్నారు. తన అహం తీర్చుకునేందుకు సూపర్ స్టార్లను తన ఛాంబర్‌కు పిలిపించుకుని వాళ్లు మోకరిల్లి అడుక్కునేలా చేసిన ఘనత జగన్‌దే అని సోషల్ మీడియాలో నెటిజన్‌లు ఎద్దేవా చేస్తున్నారు. పుష్ప, ఆర్.ఆర్.ఆర్ వంటి సినిమాలను జగన్ సపోర్ట్ చేసి ఉంటే సదరు సినిమాల వసూళ్లు మరో రేంజ్‌లో ఉండేవని పలువురు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అప్పుడు సినిమా వాళ్లను నీచంగా చూసిన జగన్ ఇప్పుడు గర్వపడేలా చేశారంటూ అభినందించడం హాస్యాస్పదంగా ఉందని కౌంటర్లు ఇస్తున్నారు.
Updated Date - 2023-08-25T17:40:36+05:30 IST